కృష్ణా నది జన్మస్థానం మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో గల మహాబలేశ్వర్. పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశగా సుమారు 1400 కి.మీ. పొడవున ప్రవహిస్తూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ చివరికి ఆంధ్ర ప్రదేశ్ లో గల్ హంసల దీవి వద్ద బంగాళా ఖాతంలో కలుస్తుంది. దీనిని బట్టి కృష్ణ నది భారత దేశంలో ఒక అంతరాష్ట్ర నదిగా గుర్తించవచ్చు. 

తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల మక్తల్ మండలంలోని తంగడి గ్రామం వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించే ఈ నది రాష్ట్రము పొడవునా మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గుండా సుమారు 612 కి.మీ. ప్రవహిస్తుంది. 

తెలంగాణ లో ప్రవహించే కృష్ణా నది ఉపనదులు 

తుంగభద్ర 

కర్ణాటక లోని షిమోగా సమీపంలో గల కూడ్లి వద్ద తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వలన తుంగభద్ర నది ఏర్పడుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూరు జిల్లా మూడిగెరె తాలూకా లోని  గంగమూల ప్రాంతంలో వరాహ పర్వతాలలో సంసే గ్రామం వద్ద తుంగ, భద్రా నదులు ప్రారంభమవుతాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ వద్ద  తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లోని సంగమేశ్వరం వద్ద కృష్ణా నదితో కలుస్తుంది.

డిండి నది 

మీనాంబరం అనే పూర్వనామం కలిగిన డిండి నది జన్మస్థానం మహబూబ్ నగర్ జిల్లా లోని షాబాద్ కొండలు. నాగర్ కర్నూల్ జిల్లా మీదుగా ప్రవహించి నల్లగొండ జిల్లా లోని దేవరకొండ సమీపంలో ఏలేశ్వరం దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. 

భీమా నది 

మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ తాలూకాలోని భీమా శంకర్ కొండలలో గల భీమా శంకర్ దేవాలయం వద్ద జన్మించే ఎయిర్ నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ జిల్లాల్లో ప్రవహిస్తూ రాయచూరు కు ఉత్తరంగా సుమారు 24కి.మీ. దూరంలో తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో కృష్ణా నదిలో కలుస్తుంది. 

మున్నేరు నది 

వరంగల్ రురల్, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దులో గల పాకాల చెరువు వద్ద జన్మించి, వరంగల్ రురల్,  మహబూబాబాద్ జిల్లాల మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని ఏలూరు వద్ద కృష్ణ నదిలో కలుస్తుంది.

మూసీ నది 

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో జన్మించే ఈ నది వికారాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల మీదుగా ప్రవహించి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.