భారత వ్యవసాయ పరిశోధన మండలి (Indian Council of Agriculture Research - ICAR) వారు రూపొందించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎర్రలోమీ నేలలు, ఎర్ర ఇసుక లోమి నేలలు, లాటరైట్ లేదా జేగురు మృత్తికలు, నిస్సారం నుండి మధ్యస్థ నల్ల నేలలు, లోతైన నల్ల నేలలు, ఉప్పు ప్రభావిత నేలలు, ఒండ్రు నేలలు మొదలైన రకాల నేలలు విస్తరించి ఉన్నవి.

ఎర్ర నేలలు (Red soil)

ఈ రకమైన నేలలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 60-65% వరకు విస్తరించి ఉన్నవి. వీటిలో ఎర్ర ఇసుకతో కూడిన లోమ్స్ (చల్కా), ఎర్ర లోమీ ఇసుక నేలలు (దుబ్బ) నేలలు అని రెండు రకాలు కలవు. సాధారణంగా ఎర్ర నేలలు గ్రానైట్ మరియు నీస్ శిలలు విఘటనం చెందడం వలన ఉద్భవిస్తాయి. ఈ నేలలు ఎరుపు రంగులో ఉండడానికి కారణం వీటిలో ఐరన్ ఆక్సైడ్ ఉండడమే. అయితే వీటిలో ఫాస్ఫరస్ ఆమ్లాలు, నత్రజని, సేంద్రియ పదార్థాల శాతం తక్కువగా ఉండడం వలన ఇవి తక్కువ సారవంతమైనవి ఉంటాయి.

ఈ నేలలు పప్పుధాన్యాలైన కంది, పెసర, ఉలవ; నూనె గింజలైన వేరుశనగ, ఆముదం పంటలకు అనుకూలంగా ఉంటాయి. నీటి పారుదల సమృద్ధిగా ఉన్న ప్రదేశాల్లో పండ్ల తోటల పెంపకానికి కూడా ఈ నేలలు అనువుగా ఉంటాయి. తెలంగాణలో ఈ నేలలు అత్యధికంగా విస్తరించి ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఉత్తర ప్రాంతంలో తక్కువగా విస్తరించి ఉన్నవి.

నల్ల నేలలు (Black Soil)

వీటిని నల్లరేగడి నేలలు అని కూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 20% నుంచి 25% వరకు ఈ నేలలు వ్యాపించి ఉన్నవి. ఉత్తర తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట మొదలైన జిల్లాల్లో ఈ నేలలు విస్తరించి ఉన్నవి. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగూర్ కర్నూల్ జిల్లాల్లో కూడా కొంతభాగంలో ఈ నేలలు విస్తరించి ఉన్నవి.

ఈ నేలలు పత్తి పంటకు అనుకూలంగా ఉండడం వలన వీటిని పత్తి నేలలు అని కూడా పిలుస్తారు. దక్కన్ పీఠభూమిలో లావా ఘనీభవనం వలన ఈ నేలలు ఏర్పడినవి. ఈ నేలలు తేమను ఎక్కువ కాలంపాటు నిలువ ఉంచుకుంటాయి. అంతే కాకుండా మిగతా నేలలతో పోలిస్తే వీటికి నీటిని నిలువ ఉంచుకునే సామర్ధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో ఈ నేలల్లో పగుళ్ళు ఏర్పడి ఉండడం వలన వీటిని “తనకు తానే దునుకునే నేలలు” అని పిలుస్తారు.

అగ్ని పర్వత కార్యకలాపాల కారణంగా ఏర్పడిన నేలలు కాబట్టి వీటిలో ఇనుము, అల్యూమినియం, మెగ్నీషియం, సున్నం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. సేంద్రియ పదార్థం, నత్రజని, భాస్వరం తక్కువ మొత్తంలో ఉంటాయి.

లాటరైట్ నేలలు (Laterite Soil) 

అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం తేమ గల ప్రదేశాల్లో ఈ మృత్తికలు నెలకొన్ని ఉంటాయి. ఇవి ఎక్కువగా వాతావరణ ప్రభావం వలన ఏర్పడతాయి. ఇవి తెలుపు నుండి లేత ఎరుపు రంగులో ఉంటాయి. వీటికి జేగురు నేలలు అనే పేరు కూడా కలదు. నైట్రోజన్, ఫాస్ఫేట్, సేంద్రియ పదార్థాలు, కాల్షియం తక్కువగా ఉండి, ఐరన్ ఆక్సైడ్ పొటాష్ అధికంగా ఉండడం వలన ఈ నేలలు వ్యవసాయ యోగ్యంగా ఉండవు. వీటిని వ్యవసాయానికి అనుగుణంగా మార్చాలంటే సారవంతంగా మార్చి తగిన ఎరువులను వాడడం ద్వారా సాగుకు అనుకూలంగా మారతాయి. అయితే ఈ నేలలు తేయాకు, పసుపు వంటి తోటపంటలకు అనుకూలంగా ఉంటాయి.

ఇతర నేలలు (Other Soil)

ఈ రకమైన నేలల్లో ముఖ్యంగా మధ్యస్థ లోతైన బంకమన్ను తేమ మృత్తికలు, మధ్యస్థ లోతైన గులకరాళ్ళు బంకమన్ను గల మృత్తికలు, మధ్యస్థ లోతైన కాల్కెరియస్ ఆర్ద్ర బంకమన్ను మృత్తికలు, ఒండ్రునేలలు మొదలైనవి. కొమురం భీం జిల్లాలోని మంజీర, హల్ది, పెద్దవాగు, నక్కవాగు మొదలైన ప్రాంతాల్లో, అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల, ఒండ్రుమట్టి నేలలు విస్తరించి ఉన్నవి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కృష్ణానది మరియు ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో కూడా ఈ రకమైన నేలలు విస్తరించి ఉన్నవి.