ఉష్ణమండల వాతావరణంతో కూడిన తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా పాక్షిక పొడి ప్రాంతాలతో కూడి ఉన్నది. రాష్ట్రంలో వేడి, మరియు పొడి వాతావరణం ఉంటుంది. రాష్ట్రంలో సంభవించే వర్షపాతం, ఉన్న నేలల స్వభావాల ఆధారంగా రాష్ట్రాన్ని ఉత్తర తెలంగాణా మండలం, మధ్య తెలంగాణ మండలం, దక్షిణ తెలంగాణ మండలం అని మూడు వ్యవసాయ వాతావరణ మండలాలు(Agro-Climatic Zones) గా విభజించారు.

1. ఉత్తర తెలంగాణా మండలం (North Telangana Zone) :

  • ఈ మండల ప్రధాన కార్యాలయం పొలాస (జగిత్యాల జిల్లా)లో కలదు. 
  • ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఈ మండలం పరిధిలోకి వస్తాయి. 
  • ఈ మండల పరిధిలో వార్షిక వర్షపాతం 950 - 1150 మి.మీ. లుగా నమోదవుతుంది. ఈ మండలంలో నైరుతి రుతుపవన కాలంలో వర్షం ఎక్కువగా కురుస్తుంది. 
  • శీతాకాలంలో 15° సెం.గ్రే. నుండి 25° సెం.గ్రే. వరకు కనిష్టంగా, వేసవి కాలంలో 32° సెం.గ్రే. నుండి 40° సెం.గ్రే. వరకు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

2. మధ్య తెలంగాణ మండలం (Central Telangana Zone):

  • ఈ మండల ప్రధాన కార్యాలయం ఆరెపల్లి (హన్మకొండ జిల్లా)లో కలదు. 
  • సిద్దిపేట, జనగాం, మెదక్, సంగారెడ్డి, హన్మకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి మొదలైన జిల్లాలు ఈ మండల పరిధిలోకి వస్తాయి. 
  • ఈ మండల పరిధిలో వార్షిక వర్షపాతం 800 -1300 మి.మీ.లుగా నమోదవుతుంది. శీతాకాలంలో 18° సెం.గ్రే. నుండి 25° సెం.గ్రే. వరకు కనిష్టంగా, వేసవి కాలంలో 32° సెం.గ్రే. నుండి 38° సెం.గ్రే. వరకు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

3. దక్షిణ తెలంగాణ మండలం (South Telangana Zone):

  • ఈ మండల ప్రధాన కార్యాలయం పాలెం (నాగర్ కర్నూల్ జిల్లా)లో కలదు. 
  • మేడ్చల్-మల్కాజిగిరి, వనపర్తి, యాదాద్రి-భువనగిరి, జోగులాంబ-గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్ మొదలైన జిల్లాలు ఈ మండల పరిధిలోకి వస్తాయి. 
  • ఈ మండల పరిధిలో వార్షిక వర్షపాతం 560-800 మి.మీ.లుగా నమోదవుతుంది. శీతాకాలంలో 20° సెం.గ్రే. నుండి 26° సెం.గ్రే. వరకు కనిష్టంగా, వేసవి కాలంలో 32° సెం.గ్రే. నుండి 38° సెం.గ్రే. వరకు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.