మొదటి రౌండ్ టేబుల్ సమావేశం (First Round Table Conference)
ఉప్పు సత్యాగ్రహం తీవ్ర స్థాయిలో ఉన్న దశలో 1930 జూన్ నెలలో సైమన్ కమీషన్ నివేదిక సమర్పించబడింది. నూతన రాజ్యాంగంలో వీలున్నంత వరకూ స్వయం అభివృద్ధికై కావలసిన సూత్రాలను పొందుపరచాలని నివేదికలో సిఫార్సు చేయబడింది. భారత రాజ్యాంగం అంతిమ రూపంలో సమ్మేళన రాజ్యంగా రూపొందాలని రాష్ట్రాలకు శాంతి భద్రతలతో సహా అన్ని అధికారాలలో స్వయం పాలన ఉండాలని నివేదికలో పేర్కొనబడింది. నూతన రాజ్యాంగం ప్రతిపాదనలపై 1929లో వైశ్రాయి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆంగ్ల ప్రభుత్వం భారత ప్రతినిధుల మధ్య చర్చలు జరగాలి. అందువల్ల 1930 నవంబర్ నెలలో లండన్ లో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనార్డ్ అధ్యక్షత మొదటి రౌండ్ టేబుల్ సమావేశము జరిగింది.
ఈ సమావేశానికి గాను ఇంగ్లండ్ కు చెందిన వివిధ పార్టీలకు చెందిన 16 మందిని, సంస్థానాల నుండి 16 మందిని, బ్రిటిష్ పాలనలోని భారతదేశం నుండి 57 మంది ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతినిధులెవరూ హాజరు కాలేదు. మిగతా పార్టీల నాయకులు హాజరైనారు. భారతదేశానికి స్వయం పాలనా ప్రతిపత్తిని కేంద్రంలో భాద్యతాయుత ప్రభుత్వాన్ని, బ్రిటిష్ పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని భారత ప్రతినిధులు కోరారు. భారత సంస్థానాధిపతులు సమ్మేళన రాజ్యాంగానికి అంగీకరించారు. అయితే ఈ రాజ్యాంగం ఆంగ్ల పాలనలోనే ఉండాలని కోరినారు. సమ్మేళన రాజ్యాంగ రూపంపై కొంత ప్రగతి సాధింపబడింది. కానీ, అంబేద్కర్ నిమ్న జాతులకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలని పట్టుపట్టగా చర్చలలో కొంత ప్రతిస్తంభన ఏర్పడింది. ఈ విభేదాల వల్ల సమావేశం వాయిదా వేయబడింది. కొన్ని రాజ్యాంగ సంస్కరణలను ఆమోదించిన బ్రిటిష్ ప్రధాని మత పరమైన విభేదాలను భారతీయులు తమలో తామే పరిష్కరించుకోవాలని కోరారు. నూతన రాజ్యాంగ సంస్కరణలను త్వరలో అమలు చేయాలని ప్రభుత్వం కోరుకుంటుందని ఉద్యమాన్ని నడుపుతున్న నాయకులు ఈ విషయంలో సహకరించాలని కోరాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశ నిర్ణయాలను తాము గుర్తించటం లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలియచేసింది. బ్రిటిష్ ప్రధాని ప్రకటన అస్పష్టంగా ఉంది కాన కాంగ్రెస్ తమ విధానాలను మార్చుకొనే పరిస్థితి లేదని తెలియచేసింది. ఉద్యమాన్ని ఉత్సాహంతో నిర్వహించమని ప్రజలను కోరింది. బ్రిటిష్ ప్రధాని చేసిన విధాన ప్రకటనలోని విషయాలను చర్చించటానికి వీలుగా ప్రభుత్వం నిర్భందంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ విడుదల చేసింది.
గాంధీ - ఇర్విన్ ఒప్పందము :
మొదటి రౌండ్ టేబుల్ సమావేవానికి హాజరైన నాయకులు గాంధీని, కాంగ్రెస్ ను తమ బహిష్కరణ విధానాన్ని విడనాడి వైశ్రాయిని కలవమని అర్థించారు. ఫలితంగా గాంధీ 1931 ఫిభ్రవరిలో వైశ్రాయి ఇర్విన్ను కలిశాడు. కాంగ్రెస్ తరపున సంప్రదింపులు జరుపుటకు వర్కింగ్ కమిటీ గాంధీకి అధికారం ఇచ్చింది. గాంధీకి, ఇర్విన్కు మధ్య చర్చలు సాగి ఒక అంగీకారం కుదిరింది. ఈ అంగీకారాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. గాంధీ - ఇర్విన్ ఒప్పందంపై 1931 మార్చి 5న వైశ్రాయి ఇర్విన్, గాంధీ సంతకాలు చేశారు.
గాంధీ - ఇర్విన్ ఒప్పందంలోని ముఖ్యాంశాలు :
- శాసన ఉల్లంఘన ఉద్యమం నిలుపు చేయబడుతుంది.
- రాజ్యాంగ విషయాల చర్చకై మరో సమావేశం జరుగగలదు. అందులో కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొనగలరు.
- సమ్మేళన రాజ్యాంగం రిజర్వేషన్లో మైనారిటీల రక్షణ రాజ్యాంగంలో అంతర్భాగంగా అంగీకరించారు.
- ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటుంది.
- అత్యవసర శాసనాలను రద్దు చేయగలమని ప్రభుత్వం ప్రకటించింది.
- శాసనాలను ధిక్కరించకుండా విదేశీ వస్తువుల బహిష్కరణకై జరిగే శాంతియుత పికెటింగ్ అనుమతించబడగలదు.
- సముద్ర తీరాన ఉన్న ప్రజలు తమ ఉపయోగానికై ఉప్పు తయారు చేసుకొనవచ్చును. కానీ, అమ్మకానికి చేయకూడదు.
పై ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఆపుచేసి రాజ్యాంగ చర్చలలో పాల్గొనటానికి అంగీకరించింది. కొంతమంది నాయకులు ఈ ఒప్పందం లాహోర్ తీర్మానానికి అనుగుణంగా లేదని భావించారు. ముఖ్యంగా యువజన సంస్థలు ఈ ఒప్పందాన్ని నిరసించాయి. సుభాష్ చంద్రబోస్ ఈ ఒప్పందాన్ని విమర్శించాడు. అయితే ఆంగ్ల ప్రభుత్వ పాలనా చరిత్రలో తొలిసారిగా జాతీయకాంగ్రెస్ను సమరాజకీయ ప్రత్యర్థిగా గుర్తించటం జరిగింది. కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీ - ఇర్విన్ ఒప్పందం చర్చకు వచ్చింది. యువకులు ఒప్పందం పట్ల సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ సందర్భంలోనే భగత్సింగ్, రాజగురు సుఖ్ దేవ్ లను ఉరితీయటం జరిగింది. ఈ సంఘటన వల్ల కాంగ్రెస్ సమావేశం ఉద్రిక్త పరిస్థితులలో జరిగింది. సమావేశం గాంధీ - ఇర్విన్ ఒప్పందాన్ని ఆమోదిస్తూ దీనివల్ల పూర్ణ స్వరాజ్య ధ్యేయాన్ని కాంగ్రెస్ విడనాడదని ప్రకటన చేసింది. రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతినిధులను పంపటానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించింది. సుదీర్ఘ చర్చల పిదప కాంగ్రెస్ గాంధీని తమ పార్టీ ఏకైక ప్రతినిధిగా లండన్ పంపటానికి నిశ్చయించింది. ఇదే సమయంలో ఇర్విన్ స్థానములో లార్డ్ వెల్లింగ్టన్ వైశ్రాయిగా వచ్చాడు. ఇతడు గాంధీ - ఇర్విన్ ఒప్పందంలోని అనేక షరతులను అంగీకరించక అణచివేత పద్దతులను సాగించాడు. దీనితో గాంధీ తాను రాజ్యాంగ చర్చలకు లండన్ వెళ్ళటం లేదని ప్రకటించాడు. తరువాత గాంధీ వైశ్రాయిని కలిశాడు. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులను విచారించగలనని వైశ్రాయి హామీ ఇచ్చాడు. దీనితో గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరగుటకు అంగీకరించాడు.
రెండోరౌండ్ టేబుల్ సమావేశం(Second Round Table Conference)
1931 సెప్టెంబర్ లో లండన్లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో గాంధీ పాల్గొన్నాడు. ఈ సమావేశం రెండు ముఖ్య సమస్యలను పరిష్కరించవలసి ఉంది. అవి:
1. సమ్మేళన రాజ్యాంగ వివరాలను ఖరారు చేయటం
2. అల్ప సంఖ్యాక వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రణాళికను రూపొందించటం.
కరాచి కాంగ్రెస్ తీర్మానాన్ని అనుసరించి కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ తక్షణమే బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాంధీ పట్టుపట్టాడు. ఆ ప్రభుత్వాలకు ఆర్థిక, సైనిక రక్షణ, విదేశీ సంబంధాలపై పూర్తిగా అధికారాలుండాలని కోరాడు. భారత జాతికి ప్రాతినిధ్యం వహించగల ఏకైక సంస్థ కాంగ్రెస్ అని పేర్కొన్నాడు. ప్రాతినిధ్యంపై అంతులేని చర్చ జరిగింది. అయితే అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం రూపొందించలేకపోయారు. నిమ్నజాతులకు శాసనసభల్లో కొన్ని స్థానాలు ప్రత్యేకంగా కేటాయించాలని అంబేద్కర్ ప్రతిపాదించాడు. దీనిని గాంధీ అంగీకరించలేదు. ముస్లింలు, ఆంగ్లో ఇండియన్లు, నిమ్న జాతుల ప్రతినిధులు తమలో తాము ఒక అంగీకారం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. హిందూ, శిక్కు ప్రతినిధులు దీనిని ఆమోదించలేదు. రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడింది. గాంధీ భారతదేశానికి తిరిగివచ్చి ఉద్యమాన్ని పునఃప్రారంభించాడు. ప్రభుత్వం గాంధీని నిర్భందించింది.
రెండో అఖిల పక్ష సమావేశంలో ప్రత్యేక నియోజక వర్గాల సమస్యలపై వివిధ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోయినట్లైతే బ్రిటిష్ ప్రభుత్వమే ఆ సమస్యపై ఒక నిర్ణయం తీసుకొని దానిని అమలు జరుపుతుందని బ్రిటిష్ ప్రధాని మాక్ డొనాల్డ్ తన తీర్పును ప్రకటించాడు. దీనినే 'కమ్యూనల్ అవార్డ్' అని అంటారు. ఈ తీర్పు ముస్లింలకు, క్రిస్టియన్లకు, శిక్కులకు, స్త్రీలకు, వెనుకబడిన జాతుల వారికి, భారతదేశంలో నివసిస్తున్న యూరోపియన్లకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలని సూచించింది. వెనుకబడిన జాతుల వారికి ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేయటాన్ని గాంధీ వ్యతిరేకించి పూనాలోని ఎర్రవాడ జైలులో నిరసన వ్రతాన్ని ప్రారంభించాడు. కానీ, నిమ్నజాతుల సమస్యపై 1932లో గాంధీ, అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
మూడో రౌండ్ టేబుల్ సమావేశం (Third Round Table Conference)
1932 నవంబర్ లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఈ సమావేశంలో ఓటింగ్ అర్హత రాష్ట్రాల ఆర్థిక వనరులను గురించి చర్చించారు. మహిళలకు ఓటింగ్ హక్కు కల్పించటం, రాష్ట్రాల శాసనసభ్యులు సమాఖ్య, ఎగువ సభ ప్రతినిధులను ఎన్నుకోవటం ఈ సమావేశం నిర్ణయించిన నూతన విషయాలు. సంస్థానాధిపతులలో సమాఖ్య రాజ్యం పట్ల సానుభూతి తగ్గింది. ఈ సమావేశం ముగిసే నాటికి రాజ్యాంగం పట్ల భారత ప్రజలలో ఇంతకు ముందు ఉన్న ఆసక్తి క్షీణించింది. మూడు సమావేశాల చర్చల ఆధారంగా రాజ్యాంగ సంస్కరణలు ప్రతిపాదిస్తూ 1933లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది.
Pages