సాధారణ బిల్లు (Ordinary Bill)

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 107 & 108 లలో సాధారణ బిల్లు గురించిన సమాచారం పేర్కొనబడింది. సాధారణ బిల్లు ఆర్థిక అంశాలకు సంబంధించినది కాకుండా ఇతర నిబంధనలకు సంబంధించినదై ఉంటుంది. పార్లమెంటులోని ఏ సభలోనైనా సాధారణ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. దీనిని మంత్రి లేదా ప్రైవేట్ సభ్యుడు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి సిఫార్సు అవసరం లేదు.

ద్రవ్య బిల్లు (Money Bill)

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 110 ప్రకారం, ద్రవ్య బిల్లులకు సంబంధించిన నిబంధనలు రూపొందించబడినవి. అయితే ద్రవ్య బిల్లు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 117 (1) మరియు 117 (3) ప్రకారం పేర్కొనబడింది. ద్రవ్య బిల్లుకు సంబంధించి ఆర్టికల్ 110 కింద పేర్కొన్నవి కాకుండా ఇతర ఆర్థిక విషయాలు వీటిలో పేర్కొనబడినవి.

ద్రవ్య బిల్లు - సాధారణ బిల్లు మధ్య తేడాలు :

  • సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభలైన లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. ద్రవ్య బిల్లును పార్లమెంటు దిగువ సభ, లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
  • సాధారణ బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. లోక్‌సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి.
  • సాధారణ బిల్లులను ప్రభుత్వ మంత్రి లేదా లోక్‌సభ లేదా రాజ్యసభలోని ప్రైవేట్ సభ్యుడు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. ఒక ప్రైవేట్ సభ్యుడు అంటే మంత్రి కాకుండా సభలో ఎవరైనా సభ్యుడు అని అర్థం. ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టే అధికారం ప్రభుత్వ తరపున మంత్రికి మాత్రమే ఉంటుంది.
  • సాధారణ బిల్లును ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు సదరు బిల్లును రాజ్యసభకు పంపే ముందు లోక్‌సభ స్పీకర్ ఆమోదం అవసరం లేదు. కానీ ద్రవ్య బిల్లు విషయంలో ద్రవ్య బిల్లును లోక్‌సభ నుంచి రాజ్యసభకు పంపే ముందు లోక్‌సభ స్పీకర్ ఆమోదం తప్పనిసరి.
  • సాధారణ బిల్లును రాజ్యసభ తిరస్కరించవచ్చు లేదా సవరించవచ్చు. ద్రవ్య బిల్లును రాజ్యసభలో సవరించడం లేదా తిరస్కరించడం సాధ్యం కాదు. రాజ్యసభ తన సిఫార్సులను లోక్‌సభకు మాత్రమే పంపగలదు. అంతేకాదు  నిర్ణీత వ్యవధిలోగా ద్రవ్య బిల్లును లోక్‌సభకు తిరిగి పంపించాల్సి ఉంటుంది. లోక్‌సభ రాజ్యసభ సిఫార్సులను తప్పనిసరిగా ఆమోదించాల్సి అవసరం లేదు. తిరస్కరించవచ్చు కూడా.
  • సాధారణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన తేదీ నుంచి 6 నెలల్లోగా ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ద్రవ్య బిల్లును రాజ్యసభ నుండి లోక్‌సభకు కేవలం 14 రోజుల్లో సిఫార్సులతో లేదా సిఫార్సులు లేకుండా పంపాలి.
  • లోక్‌సభ & రాజ్యసభలో బిల్లు ఆమోదించబడినప్పుడు మాత్రమే సాధారణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడుతుంది. అయితే ద్రవ్య బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే ముందు లోక్‌సభ ఆమోదం పొందడం తప్పనిసరి. ద్రవ్య బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే ముందు రాజ్యసభ ఆమోదం అవసరం లేదు.
  • సాధారణ బిల్లు రాష్ట్రపతికి పంపినప్పుడు అతను లేదా ఆమె దానిని పునఃపరిశీలన కోసం తిరిగి పంపవచ్చు, అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ద్రవ్య బిల్లును రాష్ట్రపతి లోక్‌సభ పునఃపరిశీలనకు పంపే అవకాశం లేదు, అంగీకరించాలి లేదా తిరస్కరించాలి.
  • సాధారణ బిల్లుపై ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం గురించిన నిబంధన రాజ్యాంగంలో కలదు. కానీ ద్రవ్య బిల్లుపై ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించే నిబంధన రాజ్యాంగంలో పేర్కొన లేదు.

ద్రవ్య బిల్లు మరియు సాధారణ బిల్లు మధ్య సారూప్యతలు

  • ద్రవ్య బిల్లు మరియు సాధారణ బిల్లు రెండూ భారత రాజ్యాంగంలో నిర్వచించబడ్డాయి.
  • ద్రవ్య బిల్లు మరియు సాధారణ బిల్లు రెండింటినీ లోక్‌సభలో ప్రవేశపెట్టవచ్చు.
  • పార్లమెంటులో ద్రవ్య బిల్లు మరియు సాధారణ బిల్లు రెండింటినీ ప్రవేశపెట్టగల సాధారణ అధికారం ఒక మంత్రికి  మాత్రమే ఉంటుంది.
  • ద్రవ్యబిల్లు మరియు సాధారణ బిల్లు రెండింటినీ తిరస్కరించే అధికారం లోక్‌సభకు ఉంది.