ఆగస్ట్ ప్రకటన :

1940 వేసవి కాలములో యూరప్ లోని యుద్ధం మిత్ర రాజ్యాలకు ఎదురు దెబ్బ తీయటమేగాక జర్మనీ దేశ బాంబుల దాడికి, విమాన దాడులకు గురి కావలసి వచ్చింది. ఈ సందర్భంలో భారత రాజకీయ పార్టీలతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని అతి త్వరలో ఏర్పాటు చేసే షరతుతో బ్రిటన్కు కాంగ్రెస్ తన మద్దతును తెలిపింది. ఇందుకు బదులుగా 1940లో వైశ్రాయి ఆగస్ట్ ప్రకటన చేశాడు. 

ప్రకటనలోని ముఖ్యాంశాలు : 

  • యుద్ధం పూర్తయిన తరువాత బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశానికి నూతన రాజ్యాంగాన్ని రూపొందించుటకు రాజ్యాంగ రచన సంఘాన్ని ఏర్పాటుచేయడం
  • అమలులో ఉన్న కార్య నిర్వాహక మండలిలో భారతీయ నాయకులను చేర్చుకోవటం ద్వారా దానిని మరింత విస్తృతం చేయడం 
  • బ్రిటిష్ ఇండియా భారత రాజ్యాల ప్రతినిధులతో కూడిన వైశ్రాయ్ యుద్ధ మండలిని స్థాపించటం.
  • సంస్కరణల నూతన పధకంలో ప్రభుత్వం అల్ప సంఖ్యాక వర్గాల డిమాండ్ కు సరైన ప్రాముఖ్యాన్ని కల్పించడం.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తనకు సహకరించాల్సిందిగా వైశ్రాయ్ వేడుకొన్నాడు. కాని కాంగ్రెస్ తాను కోరిన జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కార్య నిర్వాహక మండలిని విస్తృత పరచటం అందుకు ప్రత్యామ్నాయం కాదని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. అంతేగాక అల్పసంఖ్యాక వర్గాల సమస్యలకు ప్రాముఖ్యం ఇవ్వటాన్ని కాంగ్రెస్ నిరసించి తన అసంతృప్తిని తెలియజేసింది. కానీ ముస్లిం లీగ్అల్ప సంఖ్యాక వర్గాల వరి డిమాండ్లకు సంబంధించి  బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆహ్వానించింది.

వ్యక్తి గత సత్యాగ్రహం

బ్రిటిష్ ప్రభుత్వం ఎదుర్కొను సమస్యలను కాంగ్రెస్ అవకాశముగా తీసుకోలేదు. ఐతే అదే సమయంలో బ్రిటిష్ విధానానికి తన నిరసనను తెలియచేయాలని కాంగ్రెస్ భావించింది. అందువల్ల గాంధీ నాయకత్వంలో కొంత మంది కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత సత్యాగ్రహాన్ని పాటించుటకు అనుమతించబడింది. సామూహిక చర్య ఏ రూపములో ఉన్నా నిషేధింపబడింది. ఈ వ్యక్తిగత సత్యాగ్రహం బ్రిటిష్ విధానం పై గొప్ప ప్రభావాన్ని చూపలేదు. ఈ విధముగా రాజ్యంగ పరమైన సంక్షోభం కొంత కాలం సాగింది.

లక్ష్యాలు :

  • జాతీయవాద సహనం బలహీనత వల్ల కాదని చూపించడం
  • తాము యుద్ధం పట్ల ఆసక్తి చూపడం లేదని, భారతదేశాన్ని పాలించిన నాజీయిజం మరియు ద్వంద్వ నిరంకుశత్వం మధ్య వారికి ఎటువంటి భేదం లేదని ప్రజలలో గల భావనను వ్యక్తపరచడం.
  • కాంగ్రెస్ డిమాండ్లను శాంతియుతంగా ఆమోదించేందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వడం.

వ్యక్తిగత సత్యాగ్రహి యొక్క డిమాండ్ యుద్ధ వ్యతిరేక ప్రకటన ద్వారా యుద్ధానికి వ్యతిరేకంగా వాక్ స్వాతంత్య్రాన్ని ఉపయోగించడం. ప్రభుత్వం సత్యాగ్రహిని అరెస్టు చేయకపోతే, అతను లేదా ఆమె గ్రామాల్లో సత్యాగ్రహాన్ని పునరావృతం చేస్తూ ఢిల్లీ వైపు కవాతును ప్రారంభిస్తారు ("ఢిల్లీ చలో ఉద్యమం"). వ్యక్తిగత సత్యాగ్రహం యొక్క ప్రధాన అంశం అహింస, ఇది సత్యాగ్రహులను ఎంపిక చేయడం ద్వారా మాత్రమే సాధించబడుతుంది. మొదటి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఆచార్య వినోబా భావే, రెండవ సత్యాగ్రహిగా పండిట్. జవహర్‌లాల్ నెహ్రూ, బ్రహ్మదత్  మూడవ సత్యాగ్రహిఎంపిక చేయబడినారు.

క్రిప్స్ రాయభారం :

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1941లో రెండు ప్రధాన మార్పులు సంభవించాయి. ఒకటి 1941 జూన్ లో నాజీ సేనలు సోవియట్ యూనియన్ను ముట్టడించాయి. రెండవది 1941 డిసెంబర్లో పెరల్ హార్బర్ వద్ద అమెరికా యుద్ధ నౌకలపై జపాన్ ఆకస్మిక దాడి చేసింది. 

ఈ విధంగా జర్మనీ జపాన్లకు వ్యతిరేకముగా సోవియట్ యూనియన్ అమెరికా దేశాలు యుద్ధ రంగంలోకి ప్రవేశించాయి. జపాన్ 1942లో రంగూన్ను ఆక్రమించి యుద్ధాన్ని భారత సరిహద్దులకు తీసుకు వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వానికి మరో మార్గం లేక యుద్ధములో భారతీయులు చురుకుగా పాల్గొనాలని భావించింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడైన యఫ్. డి. రూజ్ వెల్డ్ బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ను భారత నాయకులతో ఒక ఒప్పందానికి రావలసిందిగా వత్తిడి చేశాడు. అందువల్ల ప్రధాని చర్యలు రాజ్యాంగ పర సంస్కరణలు చేయు ప్రతిపాదనలతో లేబర్ పార్టీ అతివాద నాయకుడు, దౌత్యాధికారి అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ను పంపాడు. క్రిప్స్ నెహ్రూకు స్నేహితుడు కావటం వల్ల భారత జాతీయ పోరాటానికి సానుభూతితో కూడిన వైఖరి కలిగి ఉండటం వల్ల భారత దేశంలో ఆశాజనకమైన పరిస్థితి ఏర్పడింది. క్రిప్స్ భారత నాయకులందరితో కలసి 1942 మార్చిలో పలు  ప్రతిపాదనలు చేశాడు. 

  • యుద్ధము తరువాత ఒక రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేయాలి
  • ఈ సంఘ సభ్యులను భారతదేశ దిగువ సభ నుండి ఎన్నుకోవాలి
  • బ్రిటిష్ కామన్వెల్త్ పరిధిలోనే ఒక డొమినియన్గా బ్రిటిష్ ఇండియా భారతీయ రాజ్యాల సమాఖ్య ఏర్పాటు కావాలి.
  • క్రింది షరతులకు కట్టుబడి రాజ్యాంగ రచనల సంఘం రూపొందించిన రాజ్యాంగాన్ని బ్రిటన్ అంగీకరించవలసి ఉంటుంది.

షరతులు :

  • ఎదైనా బ్రిటిష్ రాష్ట్రం ఈ సమాఖ్యలో చేరటం ఇష్టంలేకపోతే దానికి ప్రస్తుతం ఉన్న హోదాను అది నిలుపుకోవచ్చు. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఇండియన్ యూనియన్ ని ఇతర రాష్ట్రాలకు ఇచ్చే హోదాను ఇవ్వవలసి ఉంటుంది.
  • రాజ్యాంగ రచనల సంఘం బ్రిటిష్ ప్రభుత్వ అల్ప సంఖ్యాక వర్గాల హక్కులతో సహా అధికార బదిలీకి సంబంధించిన అన్ని అంశాలతో కూడిన ఒక ఒప్పందంపై సంతకం చేయవలసి ఉంటుంది.
  • వైశ్రాయ్ క్రిప్స్ రాయబారము రాష్ట్రాలకు అధినివేశ రాజ్య ప్రతిపత్తిని మరియు యూనియన్ నుండి వైదొలిగే హక్కును కూడా కల్పించింది. ఈ ప్రతిపాదనను విభజన కొరకు లీగ్ కోరికను పురస్కరించుకొని చేసిన మినహాయింపు.

బ్రిటిష్ ప్రభుత్వం విభజనను ఒప్పకోనందున ముస్లిం లీగ్ క్రిప్స్ ప్రతిపాదనను తిరస్కరించింది. కాంగ్రెస్ కూడా ఇందుకు అభ్యంతరాలు తెలిపింది. వైశ్రాయికి ఉన్న అధికారాలు ఏ మాత్రం తగ్గక ఇంకా దేశ రక్షణకు అతనిని బాధ్యుడుగా చేయటం వల్ల ఈ తాత్కాలిక ఏర్పాట్లు అసంతృప్తిని కలిగించే జపాన్ దాడిని త్రిప్పి కొట్టుటలో ప్రజల అండను, ప్రజా చైతన్యాన్ని పురికొల్పుటకు జాతీయ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. కేంద్రం నుండి రాష్ట్రం వేరుపడే ప్రతిపాదన వల్ల దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడుతుందని కాంగ్రెస్ క్రిప్స్ ప్రతిపాదనను వ్యతిరేకించింది. బ్రిటిష్ రాజ్యపునాదులే శిధిలావస్తలో ఉన్న ఆ స్థితిలో ఈ అధినివేశ రాజ్య ప్రతిపత్తి నిచ్చే దీర్ఘకాలిక ప్రతిపాదనను "ఒక దివాలా తీసిన బ్యాంకుకు వ్రాసిన ముందు తేది గల చెక్కు"గా గాంధీ పేర్కొన్నాడు.