సహాయ నిరాకరణ ఉపసంహరణ దేశ ప్రజలకు నిస్పృహ కల్గించింది. కొంత మంది కాంగ్రెస్నయకులు శాసనసభలలో ప్రవేశించి శాసనసభల ద్వారా స్వరాజ్య లక్ష్యాన్ని సాధించాలని ప్రతిపాదించారు. వారికి నాయకుడు చిత్తరంజన్ దాస్. ప్రజా ఉద్యమం లేని సమయంలో శాసనసభల బహిష్కరణ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరగగలదని వారు భావించారు. శాసనసభలలో ప్రవేశించి అవి పని చేయకుండా అవరోధాలు కల్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని వారు వాదించిన వారిలో  చిత్తరంజన్ దాస్ తో బాటు మోతీలాల్ నెహ్రూ, విఠల్ బాయ్ పటేల్, శ్రీనివాస అయ్యంగారు ఉన్నారు. కానీ, శాసనసభలలో ప్రవేశానికి చాలా మంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. రాజేంద్రప్రసాద్, వల్లభాయ్ పటేల్, రాజగోపాలాచారి, అన్సారి మొదలగువారు శాసనసభల ప్రవేశం వల్ల ఏ మాత్రం లాభం ఉండదని వాదించారు. ఎన్నికల వల్ల జాతీయ వాదుల్లో విభేదాలు ఏర్పడతాయని శాసనసభలు నాయకుల ప్రజల దృష్టిని స్వరాజ్య లక్ష్యం నుంచి మళ్ళిస్తాయని విమర్శించారు. అందువల్ల నిర్మాణ కార్యక్రమాల పట్ల కూడా శ్రద్ధ తగ్గగలదని వీరు అభిప్రాయం వ్హాక్తం చేసారు.

స్వరాజ్య పార్టీ (1922):

సహాయ నిరాకరణ ఉద్యమ వైఫల్యం కాంగ్రెస్లో మరొక విభజనకు దారి తీసింది. 1922 డిసెంబర్లో గయలో జరిగిన వార్షిక సమావేశంలో సమావేశ అధ్యక్షుడైన చిత్తరంజన్ దాస్ ప్రవేశపెట్టిన శాసనసభల ప్రవేశ తీర్మానం వీగిపోయింది. అందువల్ల చిత్తరంజన్ దాస్ 1922 డిశెంబర్ 31న స్వరాజ్య పార్టీని నెలకొల్పాడు. చిత్త రంజన్ దాస్ తనను అధ్యక్షునిగా మోతీలాల్ నెహ్రూను కార్యదర్శిగా ప్రకటించాడు. స్వరాజ్ పార్టీ కాంగ్రెస్ కు పోటీ కాదని, అందులో భాగమేనని చిత్తరంజన్ దాస్ వివరించాడు. 1923 నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలలో స్వరాజ్ పార్టీ ఘన విజయాలు సాధించింది. కేంద్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 101 స్థానాలకు గాను 42 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇతర భారతీయ సభ్యుల సహకారంతో శాసనసభలలో అనేక సార్లు ప్రభుత్వ ఓటమికి కారణమైంది. 1925లో స్వరాజ్ పార్టీ అభ్యర్థి విఠల్ భాయ్ పటేల్ కేంద్ర శాసనసభ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. కానీ, స్వరాజ్ పోర్టీ విదేశీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను మార్చలేకపోయింది. 1925 జూన్ నెలలో చిత్తరంజన్ దాస్ మరణంతో స్వరాజ్ పార్టీ అంతరించింది. స్వరాజ్ పార్టీ వారు దేశానికి చేసిన సేవ చెప్పుకోదగింది. సహాయ నిరాకరణ ఉద్యమం హఠాత్తుగా నిలిపి వేసిన సమయంలో ఈ పార్టీ వారు కొత్త విధానాలతో ప్రజలను ఉత్తేజ పరచటానికి ప్రయత్నించారు. భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గూర్చి పరిశీలించటానికి 1927లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన సైమన్ కమీషన్ ఏర్పాటు స్వరాజ్ పార్టీ కృషి ఫలితమే.

సైమన్ కమీషన్ (1928):

1927 లో బ్రిటిష్ ప్రభుత్వం మాంటేగ్ చంస్ఫర్ట్ సంస్కరణల అమలు పరిశీలనకు, భారతీయులు స్వాతంత్రానికి ఎంత వరకూ అర్హులో నిర్ణయ్హించడానికి సర్ జాన్ సైమన్ అనే ఆంగ్లేయుని అధ్యక్షతన ఒక  నియమించింది. ఈ సంఘంలో ఉన్న 7 సభ్యులు ఆంగ్లేయులు కావటం, ఒక్క భారతీయుడూ అందులో లేనందు వలన నిష్పక్షపాతంగా పరిశీలన జరగదని భావించిన అన్ని వర్గాలకు చెందిన భారతీయులు సైమన్ కమీషన్ బహిష్కరించాలని తీర్మానించారు. సైమన్ కమీషన్ 1928 ఫిబ్రవరి 3న బొంబాయి వచ్చింది. ఈ సంఘం వెళ్ళిన అన్ని ప్రదేశాలలో హర్తాళ్ జరిగింది. సైమన్ వెనక్కి వెళ్లిపో (Simon Go Back) అనే నినాదం ప్రతిచోటా ప్రతిధ్వనించింది.  సైమన్ కమీషన్ బహిష్కరణ ఉద్యమానికి మద్రాస్ లో టంగుటూరి ప్రకాశం పంతులు, లాహోర్ లో లాలాలజపతిరాయ్, ఉత్తరప్రదేశ్ లో జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం వహించినారు. లాహోర్ లో సాండర్స్ అనే పోలీస్ ఉద్యోగి జరిపిన లాఠీచార్జిలో తీవ్రమైన గాయాల పాలైన లాలా లజపతిరాయ్ 1928 నవంబర్ 17న మరణించాడు. అందుకు ప్రతీకారంగా భగత్ సింగ్, సుఖఃదేవ్రా, జగురులు సాండర్స్ ను కాల్చి చంపారు. 

నెహ్రూ నివేదిక (1928):

భారతదేశానికి సైమన్ కమీషన్ రాక ఒక నూతన రాజ్యాంగ రూపకల్పనకు దారి తీసింది. నాటి భారత వ్యవహారాల మంత్రి ఒర్కిన్ హెడ్ భారతదేశంలోని అన్ని రాజకీయ వర్గాలకూ ఆమోద యోగ్యమైన భావి భారత రాజ్యాంగాన్ని భారతీయ మేధావులు రూపొందించినట్లైతే భారతదేశానికి వెంటనే స్వాతంత్ర్యం ఇస్తామని బి.బి.సి. రేడియోలో ఒక ప్రకటన చేశాడు. దానికి జవాబుగా భారత నాయకులు దేశీయులకు అందరికీ ఆమోద యోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించటానికి ప్రయత్నించారు. దీని కోసం జాతీయ కాంగ్రెస్ 1928 ఫిబ్రవరిలో అఖిల పక్ష మహాసభను జరిపింది. ఈ మహాసభ నూతన రాజ్యాంగ రచనకై మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడుగా,  ఆలీ ఇమామ్, తేజ్ బహదూర్ సప్రూ, సుభాష్ చంద్రబోస్ మొదలగువారు సభ్యులుగా ఒక ఉప సంఘాన్ని నియమించింది. 1928 ఆగస్ట్ నెలలో ఉప సంఘం తన నివేదికను సమర్పించింది. దీనికి నెహ్రూ నివేదికగా ప్రసిద్ది చెందింది. స్వయంపాలన తక్షణమే ఇవ్వాలని సంఘం కోరింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికపై భారతదేశాన్ని సంయుక్త రాజ్యంగా ప్రకటించవలెనని కార్య నిర్వాహక వర్గం శాసనసభకు బాధ్యత వహించాలని మత అల్ప సంఖ్యాక వర్గాలకు పదేళ్ళపాటు రిజర్వేషన్లు కొనసాగాలని వారు సిఫార్సు చేశారు. 1928 డిశెంబర్, కలకత్తాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నెహ్రూ నివేదిక సమర్పించబడింది. ముస్లిం లీగ్, హిందూ మహాసభ అనేక అభ్యంతరాలను లేవదీశాయి. తిరగి మత ప్రాతిపదిక పై విభేదాలు చెలరేగాయి. జిన్నా ముస్లింలీగ్ తరపున 14 సూత్రాలు కలిగిన కోర్కెల పత్రాన్ని ప్రకటించాడు. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలని కేంద్ర శాసనసభలో 3% సీట్లు ఇవ్వాలని పంజాబ్ శాసనసభలలో జనాభా ప్రాతిపదికపై తమకు సీట్లు కేటాయించాలని పట్టుపట్టాడు. ముస్లింలకు అనుకూలంగా నెహ్రూ నివేదిక రూపొందించారని హిందూ మహా సభ విమర్శించింది. నెహ్రూ నివేదికలో సూచించిన భాద్యతాయుత పాలన కాంగ్రెస్ లోని యువకులైన జవహర్ లాల్ నెహ్రూ, సుబాష్ చంద్రబోస్ తదితరులకు నచ్చలేదు. వారు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరారు. మోతీలాల్ నెహ్రూ పంపిన నివేదిక విషయంలో భారతీయ నాయకులలో ఏకీభావం కుదరక పోవటంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నివేదికను గుర్తించలేదు.

లాహోర్ కాంగ్రెస్ సమావేశం(1929) :

జాతీయ ఉద్యమంలో 1929 వ సంవత్సరం ఒక మైలురాయి. 1929 జూలైలో కాంగ్రెస్ వాదులు తమ శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయవలసిందిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఈ తీర్మానం సర్వసాధారణ సభ ముందు ప్రవేశ పెట్టబడగా శాసన సభల బహిష్కరణను గాంధీ బలపరిచాడు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కూడా గాంధీని సమర్థించారు. ఇంగ్లండ్ లో జరిగిన సాధారణ ఎన్నికలలో 'లేబర్ పార్టీ' విజయం సాధించి రామ్సే మాక్ డోనాల్డ్ ప్రధాన మంత్రి అయ్యాడు. రాజ్యాంగ ప్రగతిని గురించి చర్చలు జరిపేందుకు వారు భారత వైశ్రాయి లార్డ్ ఇర్విన్ ను లండన్ రావలసిందిగా కోరారు. ఇర్విన్ భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత సైమన్ సంఘ సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించదని ఈ సిఫార్సులను చర్చించటానికి త్వరలో సమావేశం ఏర్పాటు చేయగలమని ప్రకటించాడు. ఈ ప్రకటనను ఇంగ్లండ్ లోని కన్సర్వేటివ్, లిబరల్ పార్టీలు విమర్శించాయి. ఈ విమర్శల వల్ల ప్రభుత్వం వెనుకంజ వేయవలసి వచ్చింది. లేబర్ పార్టీకి పార్లమెంట్ లో స్పష్టమైన మెజారిటీ లేదు. నెహ్రూ తదితర కాంగ్రెస్ నాయకులు ఇర్విన్ ను కలసి స్వయం పాలనా ప్రతిపత్తి ఇవ్వగలమనే నిర్దిష్టమైన హామీ ఇవ్వవలసిందని కోరినారు. ఇర్విన్ తన అశక్తతను వెల్లడించాడు.

ఇటువంటి పరిస్థితులలో అఖిల భారత కాంగ్రెస్ 1929 డిశెంబర్ 29న లాహోర్ సమావేశమైంది. జవహర్ లాల్ నెహ్రూ ఈ సమావేశానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. సమావేశం ఒక సుదీర్ఘ తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యాంగ ప్రగతికి వైశ్రాయి చేసిన కృషిని అభినందిస్తూ ప్రస్తుత పరిస్థితులలో దాని వల్ల ఎట్టి లాభం చేకూరదని అభిప్రాయం వ్యక్తం చేయబడింది. అందువల్ల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావలసిన పనిలేదని భావించారు. నెహ్రూ నివేదిక కూడా కాల దోషం పట్టిందని, నాటి కాంగ్రెస్ వాదులు భారతదేశ సంపూర్ణ స్వరాజ్య సాధనకు కృషి చేయాలని తీర్మానించారు. ఈ కృషిలో ప్రధమ ఘట్టంగా కాంగ్రెస్ వారు కేంద్ర, రాష్ట్ర సభల నుండి రాజీనామా చేయాలని రానున్న ఎన్నికలలో పాల్గొన కూడదని స్పష్టం చేయబడింది. కాంగ్రెస్ వాదులు నిర్మాణాత్మక కార్యక్రమాలలో పాల్గొంటూ, అవసరమనుకున్నప్పుడు ఏ క్షణంలోనైనా పన్నుల నిరాకరణతో సహా ఎట్టి శాసనోల్లంఘన ఉద్యమానికైనా పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా జరిగిన హింసాయుత చర్యలకు బాధపడిన గాంధీ అట్టి చర్యలు పునరావృతం కాకుండా యువశక్తిని అహింసాయుత నిర్మాణాత్మక కార్యక్రమాలకు వినియోగించాలని కోరుతూ తీర్మానం చేయించాడు. 1929 డిశెంబర్ 31 రాత్రి 12 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ ప్రశాంత గంభీరమైన ఊరేగింపుగా వచ్చి రావీ నదీ తీరంలో పింగళి వెంకయ్యచే తయారు చేయబడిన స్వతంత్ర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.

లాహోర్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యాన్ని కాంక్షించింది. 1930 జనవరి 26న దేశమంతటా పూర్ణ స్వరాజ్య దినంగా జరపాలని పట్టణాలలో, పల్లెలలో ఆ రోజున తీర్మాన ప్రతులను ప్రజల ముందు చదువ వలెనని నిర్ణయించారు. ఈ ప్రకటన సుదీర్ఘమైంది. ఆంగ్ల ప్రభుత్వం ఏ రీతిగా భారతదేశాన్ని దోచుకున్నదీ తెలియచేస్తూ భవిష్యత్ కార్యక్రమాన్ని వివరించింది. ప్రజలు అహింసాయుత శాసనోల్లంఘనకు సిద్ధం కావాలని పూర్ణ స్వరాజ్యసాధనకై కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆదేశాలను అమలు పరచాలని కోరడమైంది. దేశ మంతటా స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరిపారు. కాంగ్రెస్ సభ్యులు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేశారు. కొంత  మంది నిర్భందింపబడి శిక్షలకు గురైనారు. 1930 ఫిబ్రవరిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సబర్మతిలో సమావేశమై శాసన ఉల్లంఘన గూర్చిన తీర్మానం చేసింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించటానికి గాంధీకి అధికారమిస్తూ ఉద్యమం పూర్తిగా అహింసా పద్దతులపై నిర్వహించాలని స్పష్టం చేయబడింది.