19వ శతాబ్దంలో భారతీయ మేధావులు దేశంలో రాజకీయ విజ్ఞానాన్ని విస్తరింప చేయడానికి రాజకీయ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా పలు రాజకీయ సంఘాలను ఏర్పాటు చేసారు. ఈ క్రమంలో భాగంగా మొదటగా  రాజకీయ సంస్కరణలు ఆవశ్యకత గురించి ఆందోళన జరిపిన వాడు రాజారామమోహనరాయ్. ఆయన మరణాంతరం  'డెరోజియన్లు'గా పేరుగాంచిన తీవ్రవాద బెంగాలీ యువకులు రామమోహనరాయ్ ఆశయసాధన కోసం కృషి చేశారు. 

సంఘాల ఏర్పాటుకు కారణాలు : 

ప్రథమ భారత సంగ్రామంగా భావించబడే 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత భారత ప్రజలు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించ సాగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు లేవనెత్తడానికి ఒక యంత్రాంగం అవసరమని భావించిన పలువురు రాజకీయ సంఘాలు ఏర్పాటు చేసారు. ఈ సంఘాలు మొదట రాష్ట్రాలకే పరిమితమయి ఉండేవి. 

విజ్ఞాన సభ : 

కలకత్తాలోని కళాశాలలో ఆచార్యుడుగా పనిచేసిన ఉత్సాహవంతుడు, ప్రతిభాశాలి అయిన డిరోజియా విజ్ఞాన సభను స్థాపించి, మతం, దేశాభిమానం గురించి చర్చలు జరిపేవాడు. ఇతడు వెలిబుచ్చిన అభిప్రాయాలు అతివాద కార్యకలాపాలకు సంబంధినవని అధికారులు అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. కాని అతడు తన ఉద్యమాన్ని మానక పత్రికనొకదాన్ని నడిపి, తన ఆశయాలను ప్రచారం చేశాడు. యువకులు దేశాభిమానం కలిగి ఉండాలని, విద్య అందుకు తగినట్లుగా రూపొందాలని అతడు ఆశించాడు. డిరోజియా ఆలోచనలతో ప్రభావితులైన విద్యార్థులు అనేక సంఘాలను స్థాపించారు.

భూకామందుల సొసైటీ : 

1839 లో భారతదేశంలో ప్రధమంగా ఏర్పడిన రాజకీయ సంస్థ భూకామందుల సొసైటీ. కలకత్తాలో ఏర్పాటయిన ఈ సొసైటీ బెంగాల్, బీహార్, ఒరిస్సా జమీందారుల సంకుచిత ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రారంభమైన సంస్థ. ఈ సంఘం జమిందారుల సంక్షేమంతో బాటు పలు ప్రజాసమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తెచ్చింది. ఈ సంస్థ 1844లో లండనులో ఒక శాఖను ఏర్పాటుచేసి జాన్ క్రాఫర్డు స్థానంలో జార్జి థామ్సన్ ను నియమించింది. ఈ సంస్థ ఆచరణలో ఏమీ సాధించకపోయినా, పాశ్చాత్య దేశాలలో మాదిరిగా భారతదేశములో ఒక రాజకీయ సంఘము ఏర్పాటుకు జరిగిన మొదటి ప్రయత్నముగా చెప్పవచ్చు. 1851 లో బ్రిటిష్ ఇండియా సొసైటీలో ఈ సంస్థ విలీనమైపోయింది.

బ్రిటిష్ ఇండియా సొసైటీ : 

బ్రిటీష్ ఇండియాలోని భారతీయుల స్థితిగతులను మెరుగుపరచవలెనను లక్ష్యంతో కొందరు బ్రిటిషర్లు 1839 లో లండన్లో బ్రిటిష్ ఇండియా సొసైటీని స్థాపించారు. లార్డ్ బ్రౌగామ్, డేనియల్ ఓకొనెల్, జార్జి ధామ్సన్, సర్ చార్లెస్ ఫోర్బెస్ మొదలగువారు ఇందులో సభ్యులుగా ఉండేవారు. వీరు ఇంగ్లండులో విస్తృతంగా పర్యటించి భారతీయుల కష్టాలు తీర్చాలని ప్రచారం చేసారు. 

బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ : 

1843 లో థామ్సన్, ద్వారకానాధ్ టాగూరు మొదలగువారు ఈ సంఘాన్ని స్థాపించారు. భారతీయుల కష్టాలను ప్రభుత్వ దృష్టికి ఇంగ్లండ్ లోని ఆంగ్లేయుల దృష్టికి తీసికొనివచ్చుటయే ఈ సంస్థ లక్ష్యం. ఈ సంఘము భారతీయుల ఆర్థిక పరమైన, వృత్తి పరమైన అంశాలనే గాక హిందూ సమాజంలోని దురాచారాలను నిర్మూలించాలని కోరింది. ఈ సంస్థ 1851 లో బ్రిటీష్ ఇండియా సొసైటీలో విలీనం అయినది.

బ్రిటిష్ ఇండియా సంఘము : 

1851 లో బెంగాల్లోని ప్రముఖులు బ్రిటిష్ ఇండియా సంఘాన్ని స్థాపించారు.  ప్రతి 20 సంవత్సరాలకొకసారి కంపెనీ అధికారాలను పార్లమెంట్ సంస్కరిస్తూ ఉండేది. 1853 లో 20 సంవత్సరాల కాలపరిమితి అవతుంది. అందువల్ల పార్లమెంట్ కొత్త చట్టమొకటి చేయాల్సి ఉంది. ఆ సందర్భంలో తమ సమస్యలను ప్రభుత్వం ద్వారా పార్లమెంటుకు అందజేస్తే బాగుంటుందని బెంగాల్లోను, ఇతర ప్రాంతాలలోని నాయకులు అభిప్రాయపడినారు. తమ సమస్యలకు ఒక నిర్థిష్టమైన స్వరూపాన్ని కల్పించాలంటే ఒక సంఘం అవసరమని వారు నమ్మారు. ఆలస్యం చేస్తే తిరిగి 20 సంవత్సరాల వరకు వారికి ఇటువంటి అవకాశం లభించదు. 1858లో పార్లమెంట్లో భారతీయ పరిస్థితుల చర్చలు జరుగుతాయి. అందుకే కలకత్తాలోని ప్రముఖులు సమావేశాలు జరిపి, తమ సూచనలను బ్రిటన్లోని అధికారులకు అందజేయడానికి ఈ సంఘాన్ని స్థాపించారు.

మద్రాస్ దేశీయ సంఘం : 

1852లో మద్రాస్ దేశీయ సంఘము స్థాపితమైంది. ఈ సంఘం ఏర్పాటుకు పూర్వం మద్రాస్ ప్రజలలో మత పరమైన చైతన్యమే ఎక్కువగా ఉండి, క్రైస్తవ మిషనరీల దుష్ప్రచారాన్ని ప్రతిఘటించడంలో అది వ్యక్తమవుతూ ఉండేది. కాని రాజకీయ చైతన్యం వారిలో ఎంత మాత్రం కనబడలేదు. ఈ సంఘము స్థాపించిన తరువాత వారు రాజకీయాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ వహించడం ప్రారంభించారు. ఈ సంఘంలో ఎక్కువ పాత్ర వహించినవాడు గాజుల లక్ష్మీ నరసు సెట్టి. 

బొంబాయి సంఘము : 

1852 లో బొంబాయి పట్టణంలోని ప్రముఖులు ఈ సంఘాన్ని స్థాపించారు.  బొంబాయిలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా మొదట్లో ఈ సంఘం అంత చురుకుగా పనిచేయలేదు. 

పూనా సార్వజనిక సభ : 

1870 లో మహాదేవ గోవిందా రనడే నాయకత్వంలో పూనాలో సార్వజనిక సభలనే రాజకీయ సంస్థలా స్థాపించారు. సామాన్య ప్రజలకు రాజకీయాలు పరిచయం చేసి వారి బాధ్యతలను గుర్తు చేయడం ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఇందులో వారు చాలా వరకు విజయం సాధించారు. తమ ప్రతినిధుల ద్వారా, నివేదికల ద్వారా ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామాల్లోని రైతుల కష్టాలను కూడా వారు పరిశీలించి, వారికి తమ చేతనైన సహాయం చేశారు. ఈ సభ అచిర కాలంలోనే మంచి ప్రాముఖ్యం సంపాదించింది.  మితవాదులు, అతివాదులు అని రెండు వర్గాల వారు సభలో ఏర్పడడం వలన  కాలక్రమేణ ఈ సభ సభ్యులలో అభిప్రాయ భేదాలు పొడచూపాయి..

ఇండియా లీగ్ : 

1875లో అమృత బజార్ పత్రికా సంపాదకుడైన శశికుమార్ ఘోష్ బెంగాల్లో ఇండియా లీగ్ స్థాపించాడు. భారతీయులలో జాతీయ భావమును పెంపొందించుటమే దీని లక్ష్యం. ఈ సంస్థ ఎక్కువ కాలం పని చేయలేదు.

మద్రాస్ మహాజన సభ : 

1884లో విద్యావంతులైన యువకులు మద్రాస్ మహాజనసభ అనే ఒక సభను స్థాపించారు. ఈ సభ చాలా కాలం వరకు దక్షిణాదికి ముఖ్య రాజకీయ సంఘంగా ఉండెను. ఈ సంఘంలో ప్రధాన పాత్ర వహించిన నాయకుడు పి.ఆనందాచార్యులు.

బొంబాయి ప్రెసిడెన్సీ సంఘం : 

1885 లో కె.టి.తెలంగ్, బద్రుద్దీన్ త్యాబ్ది, ఫిరోజ్ షా మెహతా మొదలైన వారు కలిసి ఈ సంఘాన్ని స్థాపించారు. ఈ సంస్థ ఇంగ్లండు మూడు ప్రతినిధి వర్గాలను పంపింది. ఈ సంఘం తొలి జాతీయ కాంగ్రెస్ మహాసభను జరుపుటకు ఆతిధ్యమిచ్చి చరిత్ర ప్రసిద్ధిగాంచింది.

లండన్ ఈస్టిండియా సంఘం : 

1865 లో అన్ని రాష్ట్రాలకు చెందిన భారతీయులు ఏకమై ఒక కేంద్ర సంఘాన్ని ఇంగ్లండులో మొదటిసారిగా స్థాపించారు. దాని పేరు లండన్ ఈస్టిండియా సంఘము. రాజకీయ, సాంఘిక విషయాలను చర్చించడం, భారతదేశంలోని ఆంగ్ల పరిపాలనలోని లోపాలను బ్రిటిష్ ప్రజలకు తెలియపరచడం, భారతీయుల గురించి వారిలో నాటుకొన్న అపోహలను తొలగించడం ఈ సంఘం ఉద్దేశాలు. కాని ఈ సంఘం ఎక్కువ కాలం పనిచేయలేదు.

తూర్పు ఇండియా సంఘము : 

1866లో తూర్పు ఇండియా సంఘము స్థాపించబడింది. ఇందులో భారతీయులే కాక, ఆంగ్లేయులు కూడా సభ్యులుగా చేరారు. ఇందులో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందినవారు ఉండేవారు. వారిలో ముఖ్య పాత్ర వహించిన నాయకుడు దాదాభాయి నౌరోజి. 

ఇండియన్ అసోసియేషన్ : 

కాంగ్రెస్కు ముందు ప్రారంభమైన జాతీయ సంస్థలలో అత్యంత ముఖ్యమైంది కలకత్తా భారతీయ సంఘం. బెంగాలీ యువ జాతీయవాదులు బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ వారి సంప్రదాయవాద, భూస్వామ్య అనుకూల విధానాలతో విసుగెత్తిపోయారు. విస్తృత ప్రజానీకానికి సంబంధించిన సమస్యల మీద నిర్విరామ రాజకీయ ఆందోళన సాగాలని ఆ యువకులు వాంఛించారు. వారికి సురేంద్రనాధ్ బెనర్జీ నాయకుడు. ఇతని ప్రోత్సాహంతో ఆనందమోహన్ బోస్, వంగ యువ జాతీయ వాదులు 1876లో భారతీయ సంఘాన్ని స్థాపించుకొన్నారు. 

రాజకీయ సమైక్యతను ప్రాతిపదికగా, భారతీయ వాదానికి నిర్థిష్ట స్వరూపాన్ని కల్పించడానికి ఈ సంఘం, అఖిల భారత సమావేశాన్ని నిర్వహించాలని సంకల్పించింది. 1883లో కలకత్తాలోని మొదటి జాతీయ సమావేశాన్ని నిర్వహించి ఆనాడు భారతీయ విద్యావంతులను కలవరపరుస్తున్న రాజకీయ సమస్యల గురించి చర్చించింది. 

1885 డిసెంబరులో ఏ.ఒ. హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ అనే అఖిల భారత రాజకీయ సంస్థను ఏర్పాటుచేయడంతో, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన ఉమేష్ చంద్ర బెనర్జీ ఆహ్వానము మేరకు సురేంద్ర నాధ్ బెనర్జీ నెలకొల్పిన నేషనల్ కాన్ఫెరెన్స్ 1886లో జాతీయ కాంగ్రెస్లో విలీనమైపోయింది.