రాజకీయంగా చైతన్యవంతులైన భారతీయులు అఖిల భారత స్థాయిలో ఒక సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ సంస్థ ఒకే కార్యక్రమ రూపకల్పన కోసం, ఏకాభిప్రాయం కలిగిన వ్యక్తుల వేదికగా మాత్రమే కాకుండా విస్తృత ప్రాతిపదిక కలిగిన స్వాతంత్ర్య పోరాట దృక్పధాన్ని కలిగించేందుకు కావలసిన ప్రజా చైతన్యాన్ని అందించేదిగా ఉండాలని అభిప్రాయపడినారు. ఆ విధంగా ఏర్పాటైన సంస్థయే భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress). కాంగ్రెస్ స్థాపనలో  ఏ.ఓ. హ్యూం అత్యంత ముఖ్య పాత్ర పోషించాడు.

భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం : 

1885 డిసెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకు బొంబాయిలోని తేజపాల్ సంస్కృత కళాశాల గోకుల్దాస్ భవనంలో మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సభ డబ్ల్యు.సి. బెనర్జి అధ్యక్షతన సమావేశమైంది. ఏ.ఓ. హ్యూం, కె.టి. తెలాంగ్ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి బొంబాయి నగరం నుంచి 38 మంది, మద్రాస్ నుంచి 21 మంది, బెంగాల్ నుంచి ముగ్గురు, అయోధ్య నుంచి ఏడుగురు, పంజాబ్ నుంచి ముగ్గురు మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన ముఖ్య ఉద్దేశం : 

జాతీయ స్థాయిలో హ్యూం కాంగ్రెసు స్థాపించడంలోని ముఖ్య ఉద్దేశం, ఈ సంస్థ ద్వారా బ్రిటిష్ పరిపాలన భారతదేశంలో శాశ్వతంగా ఉండేటట్లు చేయడమే. సురంద్రనాధ్ బెనర్జీ స్థాపించిన జాతీయ సంఘం విప్లవాత్మకమైందని, అది ఏనాటికైనా, ఆంగ్లేయులపై తిరుగుబాటు చేస్తుందని అందువల్లనే దానిని అణచివేసి తానే జాతీయ స్థాయిలో ఒక రాజకీయ సంఘాన్ని స్థాపించదలిచినాడు. ఈ సంస్థ నిర్మాణ కార్యక్రమాలు జరిపి ప్రజలకు ఉపయోగకరమైన సాధనంగా నిలిచిపోవలెనని అతని ఉద్దేశము. ఈ సంస్థ మితవాదులను ఎక్కువగా ప్రోత్సహించేదిగా ఉండవలెనని అతడి అభిమతం. 

ప్రజలను ఆనాడు ముందుకు నడిపించేవారు ఆంగ్ల విద్యను నేర్చిన వారు. వారే అసలు నాయకులు. అందువల్ల విద్యాధికులను తమవైపు తిప్పుకోవాలంటే వారికి కావలసినట్లుగా ఒక సంస్థను ఏర్పాటుచేసి, ఆ సంస్థ ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలి. హ్యూం కనుక అటువంటి సంస్థ స్థాపించినట్లయితే ప్రభుత్వ సహకారం తప్పక లభిస్తుందని నమ్మాడు. విద్యావంతులయిన భారతీయుల్లో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలల నుంచి బ్రిటిష్ వారికి తగిన 'రక్షణ కవాటం’ కల్పించేందుకు వీలుగా ఈ సంస్థను స్థాపించాడన్నది ఒక వర్గం వాదన.

అయితే కాలక్రమేణా భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో కాంగ్రెస్ ఆవిర్భావం ఒక ప్రధాన ఘట్టంగా మారబోతున్నట్లు  హ్యూం ఊహించలేదు. అతడు కాంగ్రెస్ స్థాపించిన కొద్ది కాలం తర్వాత దాని పూర్తి పగ్గాలు భారత మేధావుల చేతుల్లోకి వెళ్లడం, వారు కాంగ్రెస్ ని ఒక అస్త్రంగా మలచి భారత జాతీయోద్యమంలో ప్రయోగించడం, చివరికి భారత దేశానికి స్వాతంత్య్రం రావడం జరిగింది. 

ఈ విధంగా 1885 లో ప్రథమంగా కాంగ్రెస్ సమావేశమై దేశ చరిత్రలో నూతన శకాన్ని ప్రారంభించి, భారతదేశ రాజకీయ చరిత్రలో శాశ్వత స్థానాన్ని కూడా సంపాదించింది. జాత్యాభిమానం గల వివిధ ప్రాంతాలవారు, వివిధ భాషలు మాట్లాడేవారు, విద్యావంతులు కలిసి తమ జాతీయ సమస్యలను ఒకే కేంద్రం ద్వారా చర్చించి తమ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేయడం నేడు అసంభవం కాదని కాంగ్రెస్ ప్రధమ జాతీయ సమావేశం నిరూపించింది.

1885 లో భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ఆవిర్భావంతో విదేశీ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం ఒక సంఘటిత మార్గంలో చిన్న ఎత్తున పోరాటం మొదలయింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏ ఏటికాయేడు మరింతగా బలపడుతూ విదేశీ పాలకులకు వ్యతిరేకంగా శక్తివంతమైన సంఘటితమైన ప్రజా ఉద్యమాలను నిర్మించింది.