గాంధీజీ 1915లో దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చే వరకు కాంగ్రెస్ వర్గాలలో ఆయన ఎటువంటి ప్రముఖ పాత్రను వహించలేదు. అంతేగాక అంతకు ముందు ఆయన కూడా ఎవరో భారతదేశ ప్రజలకు తెలియదు. అయితే ఆశ్చర్యకరముగా కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో (1915 - 1920) గాంధీ కాంగ్రెస్ మరియు సామాన్య ప్రజలకు తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అందుకు ప్రధాన కారణం దక్షిణ ఆఫ్రికాలో సత్యము, అహింస ఆయుధాలుగా నడిపిన 'సత్యాగ్రహం' అనే నూతన విధానం విజము సాధించడమే. అంతేగాక మితవాదులు, అతివాదులు అనుసరించిన విధానాలు, విప్లవ ఉగ్రవాదులు అనుసరించిన విధానాలు విఫలము కావటం అందుకు మరొక కారణం. వీటన్నింటికి తోడు గాంధీజీ వ్యక్తిత్వం, అతని నిరాడంబర జీవితం, అలవాట్లు భారత రాజకీయాలలో ఆయనని ప్రముఖ నాయకుడిగా తీర్చి దిద్దటానికి దోహదం చేశాయి.

1917 నుండి భారత రాజకీయాలలో ప్రవేశించిన గాంధీజీ మొదట కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న సమస్యలు పట్ల స్పందించి ఉద్యమాలు చేపట్టాడు. బీహార్ లో చంపారన్ సత్యాగ్రహం (1917), గుజరాత్ లో కైరా సత్యాగ్రహం (1918), గుజరాత్ లో అహ్మదాబాద్ సత్యాగ్రహం (1918) మొదలైనవి.

చంపారన్ సత్యాగ్రహం(1917) :

చంపారన్ సత్యాగ్రహం గాంధీని ఒక జాతీయనాయకునిగా నిలబెట్టింది. బీహార్ రాష్ట్రంలోని చంపరాన్ జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతం. అక్కడ రైతులు ఎక్కువగా నీలిమందు పండించే వారు. ఈ నీలి మందు తోటలు ఆంగ్లేయుల ఆధీనంలో ఉండేవి. ఆంగ్లేయులు రైతులను పీడించేవారు. రైతులు తమ భూములలో తప్పనిసరిగా అధిక భాగం  నీలి మందు పండించి ఆంగ్లేయులు చెప్పిన ధరకు అమ్మాలి. ఇట్టి పరిస్థితులు బెంగాల్లో ఇంతకు ముందే ఉండగా రైతులు తిరుగుబాటు చేసి విముక్తులైయారు. ఈ విప్లవాన్ని 'నీలి విప్లవము'గా పిలుస్తారు. దక్షిణ ఆఫ్రికాలో గాంధీ సాధించిన విజయాల గూర్చి విన్న చంపరాన్ రైతులు తమకు సహయపడవలసిందిగా గాంధీని అర్థించారు. 1917 లో చంపారన్ దర్శించిన గాంధీ భారతదేశంలోని రైతులు ఎటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నారో స్వయముగా చూడడం జరిగింది. గాంధీ వెంట రాజేంద్ర ప్రసాద్, కృపలాని మొదలగు వారు కూడా చంపారన్ వెళ్ళారు. ఈ బృందం 'మోతీహరి' చేరు సరికి ఆ ప్రదేశం నుండి తక్షణమే వెళ్ళి పోవలసిందిగా ప్రభుత్వం వీరందరిని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాన్ని ధిక్కరించిన గాంధీజీ విచారణకు హాజరైనాడు. తాను ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించింది వాస్తవమేనని అంగీకరించాడు. తనకు ప్రభుత్వ అధికారం పట్ల గౌరవం ఉన్నా అంతకు మించి మానవ న్యాయం పట్ల అంతః కరణ పిలుపు వల్ల ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించవలసి వచ్చిందని ఆయన ప్రభుత్వానికి తెలిపాడు. గాంధీ వ్యక్తిత్వం అతను పలికిన మాటలు భారత రాజకీయ రంగములో నూతన మార్గానికి నాంది పలికాయి. వేలాది మంది ప్రజలు గాంధీని అనుసరించారు. ప్రభుత్వం గాంధీపై పెట్టిన కేసును రద్దు చేసి రైతుల ఇబ్బందులను పరిశీలించటానికి ఒక సంఘాన్ని నియమించింది. ఇది గాంధీ సత్యాగ్రహానికి బ్రహ్మండమైన విజయంగా చెప్పవచ్చు.

అహ్మదాబాద్, కైరా సత్యాగ్రహాలు(1918) :

గాంధీ తరువాత అహ్మదాబాద్లోని నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కంకణం కట్టుకొన్నాడు. గాంధీ ఆమరణ నిరాహరదీక్షకు పూనుకొనగా మిల్లు యజమానులు కార్మికుల జీతాలను 35% పెంచటానికి అంగీకరించారు. 

తరువాత గాంధీ గుజరాత్లోని కైరాను దర్శించారు. అచ్చట పంటలు కొన్ని సంవత్సరాలుగా పండలేదు. సాలుసరి దిగుబడి 25% నికి పడిపోయింది. భూమి శిస్తు నిలుపుదలకై గాంధీ ఉద్యమం ప్రారంభించాడు. మొదట భూమిశిస్తు రద్దుకు అంగీకరించని ప్రభుత్వం చివరకు సత్యాగ్రహ ఉద్యమ ప్రభావం వల్ల రైతుల కోరికలను మన్నించవలసి వచ్చింది. సత్యాగ్రహ పద్ధతులు భారత రాజకీయాలలో అద్భుతమైన విజయాలను సాధించటం ప్రారంభమైయింది.