బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వందేమాతరం ఉద్యమం తరువాత ముఖ్యంగా దేశంలోని మితవాద వర్గాన్ని తృప్తిపరచటానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని రాజ్యాంగ సంస్కరణలను 'మింటో - మార్లే సంస్కరణలు' అంటారు. ఆనాటి వైశ్రాయి మింటో, ఇంగ్లండ్లోని భారతదేశ వ్యవహారాల కార్యదర్శి మార్లే కలసి రూపొందించినవే 1909 మింటో మార్లే సంస్కరణలు. ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర, రాష్ట్ర శాసన సభలను విస్తరించారు. 16 మంది సభ్యులున్న కేంద్ర శాసన సభను 69కి పెంచారు. వీరిలో 37 మంది అధికార సభ్యులు కాగా, 32 మంది అనధికార సభ్యులు. పెద్ద రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యను 50కి చిన్నరాష్ట్రాల సంఖ్యను 30కి పెంచారు. కేంద్ర శాసన సభలలో భారతీయ సభ్యులకు ప్రజా సమస్యలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయాలను చర్చించి తీర్మానాలు ప్రతిపాదించే వీలు కల్పించారు. ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు వేయటానికి అనుమతించారు. బడ్జెట్ ను చర్చించటానికి, విమర్శించటానికి అవకాశం కల్పించారు. రాష్ట్రాలలో అధికార సభ్యులకు ఆధిక్యత ఏర్పడినప్పటికీ గవర్నర్లకిచ్చిన అధికారం వల్ల మెజారిటీ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్ కు ఉంటుంది. 'విభజించి-పాలించు' అను విధానానికి అనుగుణంగా ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ చట్టం భారత రాజ్య కార్యదర్శి సలహా మండలిలో ఇద్దరు భారతీయులకు వైశ్రాయి కార్యనిర్వహక సంఘంలో ఒక భారతీయునికి స్థానం కల్పించింది. ఈ విధంగా వైశ్రాయి కార్యనిర్వహక సంఘంలో సత్యేంద్ర ప్రసన్నసిన్హా నియమింపబడినాడు. ఈ చట్టం భారతీయులకు ఏ విధంగానూ బాధ్యతాయుత అధికారాన్ని కల్గించలేదు. స్త్రీలకు ఓటు హక్కు కల్గించలేదు. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పరచటంతో భవిష్యత్తులో దేశంలోని శిక్కులు, క్రైస్తవులు ప్రత్యేక ప్రాతినిధ్యం కోరే అవకాశం కలిగింది. ఈ ప్రత్యేక ప్రాతినిధ్య సౌకర్య విధానమే 1947 నాటి దేశ విభజనకు దారి తీసింది.