రాజకీయ పార్టీ అంటే ఒకే విధమైన రాజకీయ అభిప్రాయాలను పంచుకునే, ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రభుత్వంలో అధికారం కోసం ప్రయత్నించే వ్యక్తుల సమూహం. భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థ కలదు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో రాజకీయ పార్టీలను కలిగి ఉన్నదేశం భారతదేశం. స్థానిక, రాష్ట్ర, జాతీయస్థాయి ఎన్నికలలో పోటీ చేయాలనుకునే రాజకీయ పార్టీలు భారత ఎన్నికల సంఘంచే గుర్తించబడినవై ఉండాలి. 

రాజకీయ పార్టీల కూర్పు - రాజ్యాంగం

ఆధునిక రాజకీయ వ్యవస్థలో, నాలుగు రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి:

(1) పాత రాజకీయ మరియు సామాజిక-ఆర్థిక వ్యవస్థను విశ్వసించే ప్రతిచర్యాత్మక రాజకీయ పార్టీలు.

(2) సంప్రదాయవాద రాజకీయ పార్టీలు యథాతథ స్థితిని కొనసాగించాలని విశ్వసిస్తున్నాయి.

(3) ఉదారవాద పార్టీలు ప్రస్తుత వ్యవస్థను క్రమంగా సంస్కరించాలని విశ్వసిస్తున్నాయి.

(4) రాడికల్ పార్టీలు వ్యవస్థను చాలా త్వరగా, తీవ్రంగా మార్చాలని విశ్వసిస్తాయి. కొన్నిసార్లు, ఇప్పటికే ఉన్న సంస్థలను పడగొట్టడం ద్వారా కూడా వ్యవస్థను మార్చాలనే విశ్వాసంతో ఉంటాయి.

భారతదేశంలో పార్టీ వ్యవస్థ

భారతదేశంలో బహుళ-పార్టీ వ్యవస్థ అమలులో ఉన్నది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు భారతదేశంలోనే గలవు. హంగ్ పార్లమెంట్లు, హంగ్ అసెంబ్లీలు, సంకీర్ణ ప్రభుత్వాలు, అస్థిర ప్రభుత్వాలు బహుళ పార్టీ వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల అంశాలుగా భావించవచ్చు.

నేటి కాలంలో అనేక రాజకీయ పార్టీలు తమ నాయకుల వల్లే జనాలలో బహుళ ఆదరణను పొందుతున్నాయి. ఒక నాయకుడి చుట్టూ అనేక పార్టీలు ఏర్పడ్డాయి. ఈ నాయకులు రాజకీయ పార్టీ, దాని సిద్ధాంతాల కంటే ముఖ్యమైనవిగా పరిగణించబడతారు.

కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ పట్టును కలిగి ఉన్నాయి. జాతీయ రాజకీయ పార్టీలకు దీటుగా ఈ పార్టీలు లబ్ధి పొందుతున్నాయి. వీటిలో చాలా పార్టీలు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ప్రాంతీయ రాజకీయ పార్టీల శక్తి పెరుగుదల వలన కేంద్రంలో, వివిధ రాష్ట్రాల ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటులో వాటి పాత్ర గణనీయంగా పెరిగింది.

జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పార్టీల గుర్తింపు

భారతదేశంలో రాజకీయ పార్టీలను నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఇది ఎన్నికలలో వారి పనితీరు ఆధారంగా రాజకీయ పార్టీలకు జాతీయ లేదా రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలుగా గుర్తింపు ఇస్తుంది. ఈ పార్టీలను గుర్తింపు పొందిన పార్టీలు అంటారు. ఇవి కాకుండా నమోదైన గుర్తింపు లేని పార్టీలు కూడా ఉన్నాయి.

ఎన్నికల సంఘం ప్రతి జాతీయ రాజకీయ పార్టీకి ప్రత్యేకంగా ఒక గుర్తును కేటాయిస్తుంది. ఇది దేశం అంతటా ఉపయోగించేందుకు పార్టీ కోసం రిజర్వ్ చేయబడుతుంది. అదేవిధంగా, ప్రతి రాష్ట్ర రాజకీయ పార్టీకి ఆ రాష్ట్రమంతటా ఉపయోగించేందుకు ఆ పార్టీ కోసం రిజర్వ్ చేయబడిన గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. ఈ గుర్తులను రిజర్వ్ చేసిన గుర్తులు అంటారు. వీటిని ఏ ఇతర అభ్యర్థి/పార్టీ ఉపయోగించడానికి వీలులేదు. ఇతర అభ్యర్థులు మిగిలిన గుర్తుల నుండి తమకు కావలసిన గుర్తును ఎంపిక చేసుకోవచ్చు.

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఉండాల్సిన అర్హతలు :

  • లోక్ సభ ఎన్నికలు లేదా శాసనసభ ఎన్నికలలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల నుండి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం ఆరు శాతం సాధించి, ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాల నుండి లోక్ సభలో  కనీసం నాలుగు సీట్లు గెలిచి ఉండాలి.

  • లోక్ సభలో రెండు శాతం సీట్లు గెలుచుకుని, ఈ అభ్యర్థులు నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నా కనీసం మూడు రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలి.

రాష్ట్ర పార్టీగా పార్టీగా గుర్తింపు పొందాలంటే ఉండాల్సిన అర్హతలు :

  • ఒక రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలలో మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించి, ఆ రాష్ట్రంలో కనీసం రెండు సీట్లు గెలుచుకోవాలి.

  • సంబంధిత రాష్ట్రం నుండి లోక్ సభకు జరిగే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లను పొంది, సంబంధిత రాష్ట్రం నుండి కనీసం ఒక్క సీటునైనా గెలుపొంది ఉండాలి.

  • సంబంధిత రాష్ట్ర శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికలలో శాసనసభలో మూడు శాతం సీట్లు లేదా అసెంబ్లీలో 3 సీట్లు ఏది ఎక్కువైతే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.

  • లోక్ సభలో ప్రతి 25 స్థానాలకు ఒక సీటు గెలిస్తే లేదా సంబంధిత రాష్ట్రం నుంచి లోక్ సభకు జరిగే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రానికి కేటాయించిన దానిలో ఏదైనా ఒక స్థానాన్ని గెలిచి ఉండాలి.