1985లో రాజ్యాంగంలోని 52వ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆమోదించబడింది. ఈ చట్టంలో భాగంగా భారత రాజ్యాంగానికి పదవ షెడ్యూల్ను జోడించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం పార్లమెంటు సభ్యుడు లేదా రాష్ట్ర శాసనసభ్యుడు తన పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినా లేదా ఓటింగ్ పై పార్టీ నాయకత్వం ఆదేశాలను ఉల్లంఘించినా సదరు శాసనసభ్యుడు పార్టీ ఫిరాయించినట్లు పరిగణించబడుతుంది.

ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని 101, 102, 190, 191 ఆర్టికల్లను సవరించారు. చట్టసభలలో స్తానాలను వదలడం, పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల సభ్యత్వానికి అనర్హత లేదా ఫిరాయింపు కారణంగా అనర్హతకు సంబంధించి కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసింది.

చట్టం ప్రత్యేకతలు

ఒక వ్యక్తి పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హుడైతే, పార్లమెంటులోని ఏ సభలోనైనా సభ్యుడిగా ఉండటానికి అనరుడవుతాడు. ఒక వ్యక్తి పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హుడైతే, రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యుడిగా ఉండటానికి అనరుడవుతాడు.

రాజ్యాంగానికి తొమ్మిదవ షెడ్యూల్ తర్వాత, పదవ షెడ్యూల్ చేర్చబడింది, ఇందులో ఆర్టికల్స్ 102(2) మరియు 191(2) ఉన్నాయి.

రాజ్యాంగ నిబంధనలు:

ఆర్టికల్ 75(1A) ప్రకారం, ప్రధానమంత్రి, మంత్రి మండలితో సహా మొత్తం మంత్రుల సంఖ్య, హౌస్ ఆఫ్ పీపుల్ యొక్క మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించకూడదు.

ఆర్టికల్ 75(1B) ప్రకారం, ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, ఆ సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడైతే, ఆ తేదీ నుండి ప్రారంభమయ్యే కాలానికి మంత్రిగా నియమించబడటానికి కూడా అనర్హుడవుతాడు. అటువంటి సభ్యునిగా అతని పదవీకాలం ముగిసే తేదీ వరకు లేదా అటువంటి వ్యవధి ముగిసేలోపు అతను పార్లమెంటులోని ఏ సభకు ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసిన తేదీ వరకు, అతను ఎన్నికైనట్లు ప్రకటించబడిన తేదీ వరకు, ఏది ముందుగా ఉంటే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.

అనరత.

102 (2) ప్రకారం ఒక వ్యక్తి పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హుడైతే, పార్లమెంటులోని ఏ సభలోనైనా సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని పేర్కొంది.

164(1A) ప్రకారం ఒక రాష్ట్రంలోని మంత్రి మండలిలో ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించకూడదు.

164 (1B) ప్రకారం, ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన శాసన మండలి ఉన్న రాష్ట్ర శాసనసభ సభ్యుడు లేదా రాష్ట్ర శాసన సభ సభ్యులు ఆ సభలో సభ్యులుగా ఉండటానికి అనర్హులవుతారు. ఒక మంత్రి తన అనర్హుహడిగా ప్రకటించిన తేదీ నుండి తన పదవీ కాలం ముగిసే తేదీ వరకు లేదా అతను ఒక రాష్ట్ర చట్టసభలకు లేదా పార్లమెంటుకు ఏదైనా ఎన్నికలలో పోటీ చేసే కాలం వరకు, అటువంటి వ్యవధి ముగిసేలోపు, అతను ఎన్నికైనట్లు ప్రకటించబడిన తేదీ వరకు, ఏది ముందైతే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.

191 (2) ఒక వ్యక్తి పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హుడైతే, రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడవుతాడు.

361-బి ఏదైనా రాజకీయ పదవిని చేపట్టడానికి అనర్హుడు.

చట్టం వలన ప్రయోజనాలు

పార్టీ విధేయత యొక్క మార్పులను నిరోధించడం ద్వారా ప్రభుత్వానికి స్థిరత్వాన్ని చేకూరుస్తుంది.

పార్టీ మద్దతుతో, పార్టీ మేనిఫెస్టోల ఆధారంగా ఎన్నికైన అభ్యర్థులు పార్టీ విధానాలకు విధేయులుగా ఉండేలా చూస్తుంది. పార్టీ క్రమశిక్షణను కూడా ప్రోత్సహిస్తుంది.

చట్టంలోని ప్రతికూలతలు

పార్లమెంటేరియన్లు పార్టీలు మారకుండా నిరోధించడం ద్వారా, అది పార్లమెంటుకు, ప్రజలకు ప్రభుత్వం యొక్క జవాబుదారీతనాన్ని తగ్గిస్తుంది.

పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అసమ్మతిని అరికట్టడం ద్వారా సభ్యుని వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనలో జోక్యం చేసుకుంటుంది.