భారత భూభాగంలో లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న యూనియన్ లేదా ఇతర స్థానిక అధికారుల వ్యవహారాలకు సంబంధించి పబ్లిక్ సర్వీసెస్ ఉద్యోగాల్లో నియమించబడిన వ్యక్తుల నియామకం, సేవా నియమాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం స్థాపించబడిన వ్యవస్తయే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT). భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 323A లో రాజ్యాంగ సవరణను ద్వారా ఈ సంస్థ  ఏర్పాటు జరిగింది.

రాజ్యాంగంలోని XIV-A భాగం ట్రిబ్యునళ్ల గురించి తెలియజేస్తుంది. ఈ నిబంధన 1976లో చేసిన  42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. ఆర్టికల్ 323 మరియు 323B వరుసగా ఇతర విషయాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది.

ఆర్టికల్ 323A ప్రకారం, కేంద్రం లేదా ఏదైనా రాష్ట్రం లేదా ఏదైనా స్థానిక వ్యవహారాలకు సంబంధించిన  పబ్లిక్ సర్వీసెస్ ఉద్యోగాలలో నియమించబడిన వ్యక్తుల నియామకం, సేవా నియమాలకు సంబంధించిన  వివాదాలు, ఫిర్యాదుల తీర్పుకోసం పరిపాలనా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడానికి పార్లమెంటుకు అధికారం కల్పించారు. భారతదేశ భూభాగ పరిధిలోని సంస్థ లేదా భారత ప్రభుత్వ నియంత్రణలో లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని లేదా నియంత్రణలో ఉన్న ఏదైనా కార్పొరేషన్ మొదలైన అన్ని వ్యవస్థల ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే అధికారం దీనికి కలదు.

1985లో పార్లమెంటు రూపొందించిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.

సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)

సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన బెంచ్ ఢిల్లీలో ఉంది. దీనికి తోడు వివిధ రాష్ట్రాల్లో అదనపు బెంచ్ లు కలవు. ప్రస్తుతం 17 సాధారణ బెంచ్ లు మరియు 4 సర్క్యూట్ బెంచ్ లు  కలవు.


అధికార పరిధి

  • ఏదైనా అఖిల భారత సర్వీసులోని సభ్యుడు,
  • కేంద్రం యొక్క ఏదైనా సివిల్ సర్వీస్ లేదా కేంద్రప్రభుత్వం కింద ఏదైనా సివిల్ ఉద్యోగంలో నియమించబడిన వ్యక్తి,
  • రక్షణ రంగ సేవలకు లేదా రక్షణ రంగ అనుసంధానిత ఉద్యోగంలో నియమితుడైన వ్యక్తి మొదలైన వారు  ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు ట్రిబ్యునల్ ను సంప్రదించవచ్చును.  
  • రక్షణ దళాల సభ్యులు, అధికారులు, సుప్రీంకోర్టు సిబ్బంది, పార్లమెంట్ సెక్రటేరియల్ సిబ్బంది CAT పరిధిలోకి రారు. 

చైర్మన్ మరియు సభ్యులు 

  • రాష్ట్రపతిచే నియమించబడిన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఉంటారు. 
  • న్యాయ మరియు పరిపాలనా రంగాలకు చెందిన సభ్యులనే నియమిస్తారు. 
  • చైర్మన్ మరియు వైస్ చైర్మన్ల పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు ఏది ముందు అయితే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఇతర సభ్యులకు 5 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు, ఏది ముందు అయితే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. 
  • ఛైర్మన్, వైస్-ఛైర్మెన్ లేదా మరే ఇతర సభ్యుడు తన పదవీ కాలం మధ్యలో తన రాజీనామా చేయదలిస్తే  రాజీనామాను రాష్ట్రపతికి తెలియజేయవచ్చు.

పని విధానం

సివిల్ ప్రొసీజర్ కోడ్, 1908లో నిర్దేశించిన విధానానికి లోబడి CAT పనిచేస్తుంది. కానీ సహజ న్యాయ సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ట్రిబ్యునల్ కు సివిల్ ప్రొసీజర్ కోడ్, 1908 ప్రకారం సివిల్ కోర్టులో ఉన్న అధికారాలే వర్తిస్తాయి.  ట్రిబ్యునల్ కు దరఖాస్తు చేసుకునే వారు వ్యక్తిగతంగా హాజరు కావచ్చు లేదా న్యాయవాదులను నియమించుకోవచ్చు.

ట్రిబ్యునల్ ఆదేశాలపై కోర్టులో అప్పీల్ చేయాలంటే మొదట హైకోర్టులో అప్పీల్ చేసి, అక్కడ సరైన న్యాయం జరగలేదనిపిస్తే, ఆ తరువాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సి ఉంటుంది. నేరుగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం కుదరదు.