పోషకాహారం అనేది ఆహారాన్ని తీసుకోవడం మరియు శక్తిని పొందడం, శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం ఉపయోగించే ప్రక్రియ. సాధారణంగా జంతువులు తమ ఆహారం కోసం ఇతర జంతువులు లేదా మొక్కలపై ఆధారపడతాయి. అవి తమ పోషక అవసరాలను తీర్చుకోవడానికి మొక్కలు లేదా జంతువులను లేదా రెండింటినీ భక్షిస్తాయి. 

జంతువులు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోలేవు కాబట్టి వాటిని పరపోషకాలు అంటారు. జంతువులకు తయారయిన ఆహారం అవసరం కాబట్టి అవి తినే మొక్కలు లేదా ఇతర జంతువులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, పాము కప్పలను తింటాయి, కీటకాలు జంతువుల మృతదేహాలను తింటాయి, పక్షులు పురుగులు మరియు కీటకాలను తింటాయి.

పోషకాహార పద్ధతులు

పోషకాహారంలో రెండు రకాలు ఉన్నాయి. అవి: 

1) స్వయం పోషణ (ఆటోట్రోఫిక్) 

2) పరపోషణ (హెటెరోట్రోఫిక్) పరపోషణ ద్వారా పోషకాహారం

అన్ని జంతువులు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు వంటి సాధారణ అకర్బన పదార్థాల నుండి తమ స్వంత ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. దీనిని పరపోషణ ద్వారా పోషకాహార తయారీ (హెటెరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్) అంటారు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే జీవులను పరపోషకాలు అంటారు. ఉదాహరణకు, మనిషి, కుక్క, పిల్లి, జింక, పులి, ఆవు, ఈస్ట్ వంటి పచ్చని మొక్కలు అన్నీపరపోషకాలే. పోషకాహారం రకాలు

పరపోషణ విధానం

పోషకాహారం యొక్క మూడు రకాల పరపోషణ విధానాలు కలవు:

1) పూతికాహారుల పోషణ 

2) పరాన్నజీవి పోషణ

3) జాంతవ భక్షక (హోలోజోయిక్)పోషణ

పూతికాహారులు పోషణ

పూతికాహారులు అంటే తమ ఆహారాన్ని పొందడం కోసం చనిపోయిన మరియు కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాలపై ఆధారపడే జీవులు. ఈ జీవులు చనిపోయిన మరియు కుళ్ళిన చెట్ల కుళ్ళిన కలప, కుళ్ళిన ఆకులు, చనిపోయిన జంతువులు, కుళ్ళిన రొట్టె మొదలైన వాటిని తింటాయి.

శిలీంధ్రాలు మరియు అనేక బ్యాక్టీరియా పూతికాహారుల వర్గంలోకి వస్తాయి. పూతికాహారులు చనిపోయిన మరియు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాల నుండి సంక్లిష్ట సేంద్రియ పదార్థాన్ని వాటి వెలుపల సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి ఈ సరళమైన పదార్థాలను గ్రహిస్తాయి.

పరాన్నజీవి పోషణ

ఈ విధానంలో జీవులు ఇతర జీవులను చంపకుండా వాటి అతిథేయి అని పిలువబడే ఇతర జీవులను తింటాయి. ఒక క్రమ పద్ధతిలో ఆహారాన్ని పొందే జీవులను పరాన్నజీవులు అంటారు. పరాన్నజీవులు అతిథేయికి హాని చేస్తాయి, అది మొక్క లేదా జంతువు కావచ్చు. పరాన్నజీవులు మానవజాతికి, పెంపుడు జంతువులకు మరియు పంటలకు వ్యాధులను కలిగిస్తాయి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, కుకుటా వంటి కొన్ని మొక్కలు, ప్లాస్మోడియం, రౌండ్వార్మ్లు వంటి కొన్ని జంతువులు పరాన్నజీవి పోషణకు ఉదాహరణలు.

జాంతవ భక్షక పోషణ

ఈ విధానంలో జీవులు ఘన లేదా ద్రవ ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఆ ఆహారం మొక్కల ఉత్పత్తి లేదా జంతు ఉత్పత్తి ఏదైనా కావచ్చు. ఈ ప్రక్రియలో ఒక జీవి సంక్లిష్టమైన సేంద్రీయ ఆహార పదార్థాన్ని తన శరీరంలోకి తీసుకుంటుంది. తరువాత శరీర కణాలలోకి శోషించబడిన ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది. శోషించబడని ఆహారం విసర్జన ప్రక్రియ ద్వారా జీవుల శరీరం నుండి బయటికి పంపబడుతుంది. మనిషి, పిల్లి, కుక్క, ఎలుగుబంటి, జిరాఫీ మొదలైనవి ఈ రకమైన పోషణను కలిగి ఉండే జీవులకు ఉదాహరణలు.

ఆహారపు అలవాట్ల ఆధారంగా జంతువులను మూడుసమూహాగా విభజించవచ్చు:

1) శాకాహారులు

2) మాంసాహారులు

3) సర్వభక్షకులు 

శాకాహారులు

గడ్డి, ఆకులు, పండ్లు, బెరడు మొదలైన మొక్కలను మాత్రమే తినే జంతువులను శాకాహారులు అంటారు. శాకాహార జంతువులకు ఉదాహరణలు ఆవు, మేక, గొర్రెలు, గుర్రం, ఒంటె, జింక మొదలైనవి.

మాంసాహారులు

ఇతర జీవులను మాత్రమే తినే జంతువులను మాంసాహారులు అంటారు. ఇవి మొక్కలను తినవు. సింహం, పులి, కప్ప, రాబందు, తోడేలు, బల్లి మొదలైనవి మాంసాహార జంతువులకు ఉదాహరణలు.

సర్వభక్షకులు

మొక్కలు మరియు ఇతర జంతువుల మాంసం రెండింటినీ తినే జంతువులను సర్వభక్షకులు అంటారు. కుక్క, కాకి, పిచ్చుక, ఎలుగుబంటి, చీమ మొదలైనవి సర్వభక్షక జంతువులకు ఉదాహరణలు.

జంతువులలో పోషకాహార ప్రక్రియ

జంతువులలో పోషకాహార ప్రక్రియలో వివిధ దశలు జంతువులలో పోషణ ప్రక్రియలో ఐదు దశలు ఉన్నాయి:

1) అంతరగ్రహణం

2) జీర్ణక్రియ

3) శోషణ

4) స్వాంగీకరణ

5) విసర్జన

అంతరగ్రహణం

శక్తిని పొందడానికి మరియు జీవిత కార్యకలాపాలను కొనసాగించడానికి ఆహారం తినడాన్ని అంతరగ్రహణం అంటారు. 

జీర్ణక్రియ

జంతువులు తినే ఆహారం వాటి శరీరం గ్రహించలేని పెద్ద కరగని అణువును కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కరగని ఆహార అణువులను చిన్న అణువులుగా విభజించే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు.

జంతువులు జీర్ణక్రియకు భౌతిక మరియు రసాయన పద్ధతులను ఉపయోగిస్తాయి. భౌతిక పద్ధతి అంటే నోటిలో ఆహారాన్ని నమలడం, నెమరువేయడం(కొన్ని జంతువులు); రసాయన పద్ధతి అంటే శరీరం ఆహారంలో జీర్ణ రసాలను కలపడం. జీర్ణం అయిన తర్వాత ఆహారాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది.

శోషణం

ఆహార అణువులు చిన్నవిగా మారిన తర్వాత అవి పేగు గోడల గుండా వెళ్లి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియను శోషణ అంటారు.

స్వాంగీకరణ

తిన్న ఆహారం శరీరంలోని అన్ని భాగాలకు, ప్రతి కణానికి చేరవేయబడి తద్వారా శక్తి ఉత్పత్తి జరుగుతుంది. శరీరం యొక్క పెరుగుదల, మరమ్మత్తు కోసం పదార్థాలు తయారు చేయబడతాయి. ఈ ప్రక్రియను స్వాంగీకరణం అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే శరీరంచే శోషించబడిన ఆహారం శరీరంలోకి కలిసి పోవడాన్ని స్వాంగీకరణం అంటారు.

విసర్జన

జీర్ణం కాని ఆహారాన్ని శరీరం నుండి బయటకు తరలించే ప్రక్రియను విసర్జన అంటారు.

ఏకకణ జీవులలో పోషణ ప్రక్రియ ఒకే కణం ద్వారా మాత్రమే జరుగుతుంది.