“అంటువ్యాధుల చట్టం-1897”(Epidemic Diseases Act-1897) అత్యంత భయకరమైన వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు మరియు నివారణకు గాను రూపొందించబడిన చట్టం ఇది. బ్రిటీష్ పాలనలోని భారతదేశంలో 1897లో బొంబాయిలో వ్యాపించిన ప్లేగు వ్యాధిని అరికట్టడానికి ఈ చట్టాన్ని మొదటిసారిగా రూపొందించారు. ప్రస్తుత తరుణంలో 2020లో వ్యాప్తి చెందిన కరోనావైరస్ కారణంగా మరల ఈ చట్టం ప్రాముఖ్యతను సంతరించుకొన్నది.

2020లో ప్రబలిన కరోనావైరస్ మహమ్మారి తరువాత భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంటువ్యాధి వ్యాధుల చట్టం - 1897లోని సెక్షన్ 2 యొక్క నిబంధనలను అమలు చేయాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై "ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-1897” ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చట్టం భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ 188 ప్రకారం శిక్షలను అమలు పరుస్తుంది.

ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897(Epidemic Diseases Act-1897) పూర్వాపరాలు

స్వాతంత్ర్యానికి పూర్వం బొంబాయి రాష్ట్రంలో బుబోనిక్ ప్లేగును ఎదుర్కోవడానికి ఈ చట్టం మొదటగా రూపొందించారు. అప్పట్లో ఈ చట్టం కేవలం స్థానికంగా మాత్రమే అమలు జరిగింది. దేశం మొత్తం అమలు చేయడం కుదరలేదు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, కలరా వంటి మహమ్మారుల వ్యాప్తిని నిరోధించడానికి ఈ చట్టం అమలు చేయబడింది.

  • స్వైన్ ఫ్లూని ఎదుర్కోవడానికి 2009లో పూణేలో ఈ చట్టాన్ని అమలు పరిచారు.
  • చండీగఢ్ డెంగ్యూ, మలేరియాలను ఎదుర్కోవడానికి 2015లో ఈ చట్టాన్ని అమలు పరిచారు.
  • గుజరాత్లో కలరా వ్యాప్తిని అరికట్టడానికి 2018లో ఈ చట్టాన్ని అమలు పరిచారు.
  • మార్చి 2020 చివరి వారం నుండి, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని పరిమితం చేయడానికి భారతదేశం అంతటా ఈ చట్టం అమలు చేయబడింది.

రాష్ట్రాలు తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా ఉండేటటువంటి నిర్దిష్ట పరిస్థితుల్లో వాటి స్వంత వ్యూహాలు ప్రతిస్పందనలను రూపొందించుకోవడానికి ఈ చట్టం కింద నిబంధనలను రూపొందించడంలో సౌలభ్యాన్ని ఇవ్వడంజరిగింది.

ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897(Epidemic Diseases Act-1897)లోని ముఖ్యమైన సెక్షన్లు

ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు ఇవ్వగా, అంటువ్యాధిని నియంత్రించేందుకు సెక్షన్ 2 (ఎ) కింద కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని అధికారాలు ఇవ్వబడినవి.

సెక్షన్ 3 జరిమానాలకు సంబంధించినది. దీరి ప్రకారం, ఈ చట్టం కింద రూపొందించబడిన ఏదైనా నియంత్రణ లేదా ఆదేశాన్ని ఉల్లంఘించిన వ్యక్తి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లుగా పరిగణించబడుతుంది.

సెక్షన్ 4 చట్టం అమలు చేసే అధికారులకు చట్టపరమైన రక్షణల గురించి తెలియజేస్తుంది. ఈ చట్టం కింద చిత్తశుద్ధితో పని చేసిన లేదా చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఏ వ్యక్తిపైనా ఎలాంటి దావా లేదా ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరగదు.

ఎపిడెమిక్ డిసీజెస్ (సవరణ) ఆర్డినెన్స్ 2020

ఈ చట్టం ఆర్డినెన్స్ ద్వారా సవరించబడింది. వైద్యులు లేదా ఆరోగ్య కార్యకర్తలపై దాడి చేసేవారిని శిక్షించే నిబంధనలు చట్టంలో కొత్తగా చేర్చబడినవి. వైద్యులు లేదా ఆరోగ్య కార్యకర్తలపై (ఆశా వర్కర్లతో సహా) ఎవరైనా దాడి చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్షను అమలుచేయడాన్ని ఈ ఆర్డినెన్స్ నిర్ధారిస్తుంది. ఇటువంటి నేరాలకు నాన్ బెయిలబుల్ వారంట్లు కూడా జారీ చేయవచ్చు.