కణం జీవుల యొక్క నిర్మాణ మరియు క్రియాత్మక విభాగం. కణాన్ని 1665లో రాబర్ట్ హుక్ కనుగొన్నారు. లాటిన్లో కణం(సెల్) అంటే “చిన్న గది" అని అర్థం. బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఈస్ట్లు వంటి ఏకకణ జీవులుగా పిలువబడే అనేక జీవులు ఒకే కణాన్ని కలిగి ఉంటాయి. సంక్లిష్ట జీవులను అనేక కణాలతో రూపొందించబడిన బహుళ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తారు.

కణం యొక్క నిర్మాణం

అన్ని కణాలు మూడు ప్రధాన క్రియాత్మకమైన విషయాలు కలిగి ఉంటాయి:

1. కణ త్వచం లేదా ప్లాస్మా పొర

2. న్యూక్లియస్

3. సైటోప్లాజం

కణం యొక్క బయటి త్వచం ప్లాస్మా పొర. ఇది లిపిడ్లు, ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. దాని లోపల సైటోప్లాజమ్ ఉంటుంది. సైటోప్లాజంలో వివిధ సెల్యులార్ లేదా సెల్ ఆర్గానిల్స్ మరియు మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లు మొదలైనవి చేరి ఉంటాయి.

మైట్రోకాండ్రియా(Mitochondria) అంతర్జీవ ద్రవ్యజాలం. రైబో సోములు, లైసోసోములు, గాల్జీ సంక్లిష్టం, కేంద్రకం వంటివి వృక్ష, జంతుకణం రెండింటిలో కనబడతాయి. సెంట్రియోల్స్ అనే నిర్మాణాలు కేవలం జంతుకణాల్లో మాత్రమే కనిపిస్తాయి. వృక్షకణాల్లో ఉండవు. మైటోకాండ్రియాలు పోగుల్లో ఉంటాయి. వీటి చుట్టూ రెండు పొరలతో ఉండే త్వచం ఉంటుంది. దీని లోపలి భాగాన్ని మాత్రిక అంటారు. మాత్రికలో డి.ఎన్.ఎ., రైబోజోమ్లు ఉంటాయి.

కణంలో శక్తి A.T.P. (అడినోసైన్ ట్రైఫాస్పేట్) అనే రూపంలో తయారై ఉంటుంది. శక్తిని A.T.P. రూపంలోనే కణం వినియోగించుకొంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం కణంలో లిపిడ్, ప్రొటీన్ల తయారీకి, కణాన్ని విషపదార్థాల బారినుంచి రక్షించడానికి, యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. గాల్జీ సంక్లిష్టం స్రావక క్రియకు, లైసోసోములను ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది.

కేంద్రకంలో (Nuclear) క్రోమోజోములు ఉంటాయి. D.N.A. వీటిపై ప్రోటీన్ తొడుగు కలిసి క్రోమోజోములను ఏర్పరుస్తాయి. మైటోకాండ్రియాలు కార్బోహైడ్రేట్లను, కొవ్వులను విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి, వీటిని కణశక్తి భాండాగారాలు అంటారు. D.N.A. కేంద్రకంలోనే కాకుండా మైటోకాండ్రియా, హరితరేణువులలో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని స్వయంప్రతిపత్తి కలిగిన కణాంగాలు అని అంటారు.

లైసోజోమ్ లు (Lysosomes)  గుండ్రంగా, ఒకే త్వచంతో కప్పి ఉంటాయి. వీటిలో అనేక ఎంజైమ్లు ఉండి, సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడానికి ఉపయోగపడతాయి. కణం చనిపోయిన తర్వాత వీటిలోని ఎంజైమ్లు కణాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి, వీటిని కణ ఆత్మహత్యా కోశాలు లేదా కణ ఆటంబాంబులు అంటారు.

రైబోజోమ్ లు (Ribosomes) గోళాకారంగా ఉండే నిర్మాణాలు. ఇవి రైబోకేంద్రకామ్ల (ఆర్.ఎన్.ఎ.) ప్రొటీన్లతో నిర్మితమై ఉంటాయి. కాబట్టి, వీటిని రైబో న్యూక్లియో ప్రొటీన్ రేణువులంటారు. రైబోజోమ్లు కణంలో స్వేచ్ఛగా లేదా అంతర్జీవ ద్రవ్యజాలానికి అతికి ఉంటాయి. గుంపులుగా ఉన్న రైబోజోమ్లనే పాలిజోమ్లు (polysomes) అంటారు. ఇవి ప్రొటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి.

కణంలో నాళాలు, తిత్తుల్లాంటి నిర్మాణాలున్న కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది రెండు రకాలు. అవి: 1) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. 2) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. దీనిపై రైబోజోమ్లు అతుక్కుని ఉంటాయి. ఇది ప్రొటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. కణంలో నాళాల మాదిరి ఉండే మరో నిర్మాణం గాల్జి సంక్లిష్టం. ఇది కూడా ప్రొటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. తంతువులతో నిర్మితమై, కణమంతా వ్యాపించి ఉండే నిర్మాణాన్ని కణద్రవ్య పంజరం అంటారు. ఇది కణానికి యాంత్రికబలాన్ని ఇస్తుంది.

కణాంగాల్లో అన్నింటికంటే ముఖ్యమైంది కేంద్రకం(Nuclear). ఇది రెండు పొరలతో కప్పి ఉంటుంది. ఈ పొరను కేంద్రకత్వచం అంటారు. కేంద్రకం లోపల ఉన్న పోగుల్లాంటి నిర్మాణాలను క్రోమాటిన్ పదార్థం అంటారు. ఇది కణవిభజన సమయంలో క్రోమోజోమ్లుగా మారుతుంది. క్రోమాటిన్ లేదా క్రోమోజోమ్లు డి.ఎన్.ఎ. ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. డి.ఎన్.ఎ. లో జన్యువులు ఉంటాయి. ఇవి నిర్ణీత లక్షణాలను నియంత్రిస్తాయి.

కేంద్రకం కణంలోని అన్ని జీవక్రియలను తన అధీనంలో ఉంచుకుంటుంది. నిర్దిష్ట కేంద్రకం ఉండే జీవులను నిజకేంద్రక కణాలని, నిర్దిష్ట కేంద్రకం లేని జీవులను కేంద్రక పూర్వజీవులని అంటారు.