దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ ఉదారవాద ఆర్థిక చట్టాలను కలిగి, దేశం భూ సరిహద్దుల లోపల ప్రత్యేకంగా గుర్తించబడిన భూభాగాన్ని ప్రత్యేక ఆర్థిక మండలి లేదా సెజ్ గా పిలుస్తారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం, పెట్టుబడిని ప్రోత్సహించడంతోపాటు, ఆయా ప్రాంతాలను అభివృద్ధి పరచడం ద్వారా వ్యాపార సౌలభ్యాన్ని పెంచేందుకు సెజ్ లు ఏర్పాటు చేయబడతాయి.

సెజ్ ల నేపథ్యం

వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న అడ్డంకులను అధిగమించేందుకు గాను 2000 సంవత్సరంలో తొలిసారిగా మన దేశంలో సెజ్ పాలసీని ప్రకటించారు. వీటిలో నిర్మాణాలు ప్రారంభించడానికి ముందు బహుళ నియంత్రణలు, అనుమతులు పొందాల్సి ఉంటుంది. భారతదేశంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, ఒక వేళ ఉన్నా ప్రపంచ ప్రమాణాల కంటే చాలా తక్కువగా స్థాయిలో ఉండడం; ఆర్థిక వ్యవస్థ కూడా అస్థిరంగా ఉండడం వలన భారీగా విదేశీ పెట్టుబడులను దేశంలోనికి ఆకర్షించేందుకు గాను ప్రభుత్వం సెజ్ పాలసీని ప్రకటించింది.

పార్లమెంటు 2005లో ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాన్ని ఆమోదించింది. 2006లో సెజ్ నిబంధనలతో పాటు ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే, 2000 నుండి 2006 వరకు (విదేశీ వాణిజ్య విధానం ప్రకారం) భారతదేశంలో సెలు పనిచేస్తున్నాయి.

సెజ్ చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలు:

అదనపు ఆర్థిక కార్యకలాపాలను రూపొందించడం, వస్తువులు మరియు సేవల ఎగుమతిని పెంచడం, ఉపాధి కల్పన; దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మొదలైన ముఖ్య లక్ష్యాలతో సెజలను ఏర్పాటు చేస్తున్నారు.

సెజ్ సౌకర్యాలు & ప్రోత్సాహకాలు 

  • సెజ్ లో స్థాపించబడిన కంపెనీలు మరియు వ్యాపార సంస్థలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. సెజ్ యూనిట్లను అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసం సుంకం లేని దిగుమతి లేదా దేశీయ వస్తువుల సేకరణ.
  • మొదటి 5 సంవత్సరాలకు ఆదాయపు పన్ను చట్టం కింద సెజ్ యూనిట్లకు ఎగుమతి ఆదాయంపై 100% ఆదాయపు పన్ను మినహాయింపు, ఆ తర్వాత 5 సంవత్సరాలకు 50% మరియు తదుపరి 5 సంవత్సరాలకు పొందిన ఎగుమతి లాభంలో 50%. (యూనిట్ల కోసం నూతన నిబంధన 2020 నుండి అమలులోకి వస్తుంది).
  • వారికి సెంట్రల్ సేల్స్ టాక్స్, సర్వీస్ టాక్స్ మరియు స్టేట్ సేల్స్ టాక్స్ నుండి మినహాయింపు ఇచ్చారు. ఇవి ఇప్పుడు జీఎస్టీలో చేర్చబడ్డాయి. సెజ్ లకు సరఫరాలు ఐజీఎస్టీ చట్టం, 2017 ప్రకారం జీరో-రేట్ చేయబడ్డాయి.
  • కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్. దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ అవసరం లేదు. తయారీ రంగంలో, కొన్ని విభాగాలను మినహాయించి, 100% ఎఫ్టీఐ అనుమతించబడుతుంది.
  • ఆర్జించిన లాభాలు ఎటువంటి డివిడెండ్ బ్యాలెన్సింగ్ అవసరం లేకుండా ఉచితంగా స్వదేశానికి పంపడానికి అనుమతించబడతాయి.
  • కస్టమ్స్ మరియు ఎగుమతి-దిగుమతి విధానానికి ప్రత్యేక డాక్యుమెంటేషన్ అవసరం లేదు. అనేక సెజ్ లు అభివృద్ధి చెందిన ప్లాట్లు మరియు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న స్థలాన్ని అందిస్తాయి.
  • సెజ్ లో నిర్వహించబడే సంస్థలతో పాటు, సెజ్ లను అభివృద్ధి పరిచే వారు కూడా ప్రభుత్వం నుండి అనేక ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను పొందుతారు.

భారతదేశంలో సెజ్ ల నిర్వహణ 

31 జనవరి 2021 నాటికి, దేశంలో 265 సెజ్ లు పనిచేస్తున్నాయి. దాదాపు 64% సెజ్ లు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో ఉన్నాయి.

SEEPZ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ముంబై), కాండ్గా సెజ్, కొచ్చిన్ సెజ్, మద్రాసు సెజ్, విశాఖపట్నం సెజ్, ఫాలా సెజ్ మొదలైనవి భారతదేశంలోని ముఖ్యమైన సెజ్ లకు ఉదాహరణలు.

సవాళ్లు

  • సెలు విస్తృత శ్రేణి ప్రోత్సాహకాలను పన్ను ప్రయోజనాలను అందిస్తున్నందుకు, ఇప్పటికే ఉన్న అనేక దేశీయ సంస్థలు కేవలం సెజ్ లకు మారడానికి ఇష్టపడుతున్నాయి. 
  • సెజ్ లను ప్రోత్సహించడం వల్ల ఆహార భద్రతపై ప్రభావం చూపే సారవంతమైన వ్యవసాయ భూమి, ఖజానాకు ఆదాయ నష్టం వంటి ప్రతికూల ప్రభావాలతో అసమాన వృద్ధికి కారణమవుతుందనే వాదన కలదు.
  • ఆహారావసరాలతో పాటు, సెజ్ ల అవసరాలకు కావలసిన నీటిని సరఫరా చేయడం వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. 
  • శుద్ధి చేయని వ్యర్థ పదార్థాల విడుదలతో సెజ్ లు కూడా కాలుష్యానికి కారణమవుతాయి. 
  • గుజరాత్ లోని మడ అడవుల భారీ విధ్వంసం చేపల పెంపకం, పాడి పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. 
  • సెజ్ లను ప్రోత్సహించాలి కానీ దాని కారణంగా దేశంలోని వ్యవసాయ రంగానికి నష్టం కలగరాదు. సెజ్ ల కారణంగా పర్యావరణానికి ఎటువంటి హాని జరగకూడదు.