అగ్నిశిలలు
భూ అంతర్భాగాల్లో అధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల కారణంగా శిలలు పాక్షిక ద్రవ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ పాక్షిక శిలా ద్రవాన్ని 'మాగ్మా'గా పిలుస్తారు. భూ ఉపరితలం పైకి ఉబికి వచ్చిన మాగ్మాను 'లావా' అని అంటారు. ఈ మాగ్మా లేదా లావా చల్లబడి క్రమంగా ఘనీభవించి అగ్ని శిలలుగా పరిణామం చెందుతాయి. వీటిని ప్రాథమిక శిలలు అని కూడా అంటారు.
భూపటలం యొక్క అంతర్భాగంలో మాగ్మా ఘనీభవనం చెందడం వల్ల 'ఫుటానిక్ అగ్ని శిలలు' ఏర్పడతాయి. భూపటలం యొక్క ఉపరితలానికి చేరే క్రమంలో మార్గ మధ్యలో ఘనీభవం చెందిన మాగ్మా 'హైపర్ బేసల్ అగ్ని శిలలను ఏర్పరుస్తుంది. భూ ఉపరితలం పైకి చేరిన తర్వాత లావా ఘనీభవించి లావా శిలలు ఏర్పడుతాయి. అగ్నిశిలలు కఠినంగా, దృఢంగా ఉండడం చేత వీటిలో శిలాజాలు ఏర్పడే అవకాశం లేదు. ఫై జాతికి చెందిన లోహ ఖనిజాల కేంద్రీకృత స్థావరాలుగా అగ్నిశిలలు ఉంటాయి. గ్రానైట్, బసాల్ట్, గాబ్రో, డయరైట్, ఆండె సైట్ మొదలైనవి ప్రధాన అగ్ని శిలలకు ఉదాహరణలు.
అవక్షేప శిలలు
భూ ఉపరితలం పై ఏర్పడే బాహ్య బలాల కారణంగా కఠిన పటల శిలలు శిథిలం చెందడాన్ని శిలా శైథిల్యం లేదా క్రమక్షయం అని అంటారు. శిథిలమైన శిలా పదార్థాలు నదీ హరివాణాలు, లోయలు, మైదానాలు, సముద్ర భూతలంపై నిక్షేపమై కాలక్రమంలో శిలలుగా మారుతాయి. పై పొరల సంపీడనం వల్ల కింది పొరల్లోని శిలా శిథిలాలు క్రమంగా సంఘటితమయి అవక్షేప శిలలు ఏర్పడుతాయి. ఇసుకరాయి, షేల్ అవక్షేప శిలలకు కొన్ని ఉదాహరణలు. బొగ్గు, చమురు, సహజవాయువు మొదలైన శిలాజ ఇంధన వనరులకు అవక్షేప శిలలు నిలయంగా ఉంటాయి. భూ ఉపరితలం పైన ఉండే శిలలు ఎక్కువభాగం అవక్షేప శిలల తరగతికి చెంది ఉంటాయి.
ఏర్పడే విధానాన్ని బట్టి, అవక్షేప శిలలను మూడు రకాలుగా విభజించారు. 
1. యాంత్రికంగా ఏర్పడినవి. ఇసుకరాయి, సమ్మేళనం, సున్నపురాయి, పొట్టు, లూస్ మొదలైనవి దీనికి ఉదాహరణలు. 
2. రసాయనికంగా ఏర్పడింనవి. చెర్ట్, సున్నపురాయి, హాలైట్, పొటాష్ మొదలైనవి దీనికి ఉదాహరణలు. 
3. సేంద్రీయంగా ఏర్పడింది. గీసెరైట్, సుద్ద, సున్నపురాయి, బొగ్గు మొదలైనవి దీనికి ఉదాహరణలు. 
రూపాంతర శిలలు
ఈ శిలలు పీడనం మరియు ఉష్ణోగ్రత మార్పుల వలన జరిగిన చర్యల కారణంగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన శిలల రసాయనిక ధర్మాలు పూర్తిగా మార్పు చెంది ఉంటాయి. అవక్షేప శిలలు లేదా అగ్ని శిలలు వీటి మాతృశిలలుగా ఉంటాయి. 
షేల్, ఇసుకరాయి, సున్నపురాయి వంటి అవక్షేప శిలలు రూపాంతరం చెంది స్లేట్, క్వార్జెట్, పాలరాయి వంటి రూపాంతర శిలలను ఏర్పరుస్తాయి. గ్రానైట్, గాబ్రా వంటి అగ్ని శిలలు రూపాంతరం చెంది నీస్, ఫిల్లెట్ వంటి రూపాంతర శిలలను ఏర్పరుస్తాయి. స్లేట్, క్వార్టెలు తిరిగి రూపాంతర ప్రక్రియకు లోనయి సిస్ట్, ఫిల్లెట్ వంటి రూపాంతర శిలలను ఏర్పరుస్తాయి. కఠినంగా, దృఢంగా ఉండటం వల్ల భవన నిర్మాణ రంగంలో రూపాంతర శిలలను విశేషంగా ఉపయోగిస్తారు. నాన్ ఫై జాతికి చెంది లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాల వనరులను రూపాంతర శిలలు కలిగి ఉంటాయి.