భూగోళంపై గల అత్యధిక ఉష్ణోగ్రత, సమశీతోష్ణ మండలం, శీతల ప్రాంతాలు, ఖండాల దేశాల ఉనికి, వర్షపాత విస్తరణ మొదలైన అంశాలను అంక్షాంశాలు తెలియచేస్తాయి. అదేవిధంగా రేఖాంశాలతో ఖండంలోని ప్రజలు తమ జీవన విధానానికి సంబంధించిన సమయాలను తెల్సుకోవచ్చు. అంతేకాకుండా ఇవి వివిధ ఖండాల మధ్య, దేశాల మధ్య ప్రాంతాలమధ్య నిర్దుష్టమైన సమయాన్ని తెల్పుతాయి.

అక్షాంశాలు

ఉత్తర, దక్షిణ దృవాలను సమాన దూరంలో భూమి మధ్య గీసిన వృత్తాకార ఊహారేఖను భూమధ్యరేఖ అంటారు. ఈ రేఖ భూమిని రెండు అర్ధ గోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధ భాగానికి ఉత్తరార్ధ గోళమని, దక్షిణంగా ఉన్న అర్ధ భాగానికి దక్షిణార్థ గోళమని అంటారు. '0°' అక్షాంశరేఖ అయిన భూమధ్యరేఖ ఒక వృత్తం. ఈ రేఖకు సమాతరంగా 1° అంతరంతో ఉత్తర, దక్షిణ ధృవాల వరకు తూర్పుపడమరలుగా గీసిన వృత్తాలకు అక్షాంశాలు అని పేరు. భూగోళంపై ఉన్న అక్షాంశాలలో పొడవైనది భూమధ్యరేఖ. మిగతా అక్షాంశాలన్నీ భూమధ్యరేఖ నుంచి ఉత్తర, దక్షిణ దృవాల వరకు పోనుపోను వాటి నిడివి తగ్గిపోతూ ధృవాల వద్ద బిందువులుగా మారిపోతాయి.

అక్షాంశాలన్నీ భూమధ్య రేఖకు సమాంతరంగా గీచిన వృత్తాలు. వీటిని ఉత్తరార్ధ గోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90గా విభజించారు. మొత్తం భూమధ్యరేఖతో కలుపుకొని (180+1)181 అక్షాంశాలు ఉన్నాయి. రెండు అక్షాంశాల మధ్య దూరం 111 కిలోమీటర్లు (69 మైళ్ళు) ఇలా ప్రతి అక్షాంశానికి మధ్య సమానదూరం ఉండటంవల్ల అక్షాంశాలను సమాంతర రేఖలు అంటారు.

భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న ఉత్తరార్ధగోళంలోని ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశంను కర్కటరేఖ అని, దక్షిణార్ధగోళంలోని ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశంను మకరరేఖ అని అంటారు. ఈ రెండింటి రేఖల మధ్య ఉన్న ప్రాంతాలన్నీ అత్యుష్ణ లేదా ఉష్ణమండలం అని అంటారు.

ఉత్తరార్ధగోళంలోని అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయమని, దక్షిణార్ధగోళంలోని అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని పిలుస్తారు. ఈ రెండింటి మధ్య ప్రాంతాన్ని సమశీతోష్ణమండలం అంటారు. ఉత్తరార్ధగోళంలోని 90° లను, దక్షిణార్ధ గోళంలోని 90°లను ఉత్తర, దక్షిణ ధృవాలని పిలుస్తారు. అరవై ఆరున్నర డిగ్రీల నుంచి 90°ల మధ్య ఇరువైపుల ఉన్న ప్రాంతాన్ని శీతలమండలం అంటారు.

ఒక ప్రదేశంలో నిలబడి ఆ ప్రదేశం గుండా పోయే అక్షాంశాన్ని కనుగొనడానికి ఆ ప్రదేశం నుంచి ధృవ నక్షత్రపు ఎత్తును దిక్ చక్రం నుంచి డిగ్రీలలో కొలుస్తారు. ఇలా కొలిస్తే వచ్చిన ఈ కోణం విలువ ఆ అక్షాంశానికి సమానం. ధృవ నక్షత్రం ఉత్తర ధృవానికి సరిగ్గా 90° కోణం దూరంలో ఊర్ధ్వంగా ఉంటుంది. భూమధ్యరేఖ పై ఉన్న వారికి దిక్ చక్రం మీద 0° కోణంలో ఈ నక్షత్రం కనిపిస్తుంది. దక్షిణార్ధగోళంలో ఉన్నవారు ధృవనక్షత్రం వంటి మరొక నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని దక్షిణ దృవం, భూమధ్యరేఖ నుంచి ఆనక్షత్రం చేసే కోణాన్ని మొదట తెలుసుకొని తరవాత ఆ స్థలం దిక్చక్రంతో నక్షత్రం చేసే కోణం ఆధారంగా దాని అక్షాంశాన్ని తెల్సుకోవచ్చు. ఉత్తరార్ధ గోళంలో ధృవనక్షత్రాన్ని తెల్సుకోడానికి సప్తర్షి మండలం ఉపయోగపడుతుంది. సప్తర్షి మండలంలో ఆఖరి రెండు నక్షత్రాలకు 'సూచికలు' అని పేరు. అవి ధృవ నక్షత్రాన్ని చూపుతాయి. 

రేఖాంశాలు

భూమి చుట్టూ భూమధ్యరేఖను ఖండిస్తూ లంబంగా ధృవాల ద్వారా గీసిన వృత్తాలను రేఖాంశ వృత్తాలని అంటారు. ఉత్తర, దక్షిణ ధృవాల మధ్య ఉన్న అర్థ వృత్తరేఖను రేఖాంశం అంటారు. భూగోళంపై ఒక డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలున్నాయి. ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాలలోను ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. అందువల్ల రేఖాంశాలను మధ్యాహ్న రేఖలంటారు.

స్థిరంగా ఉన్న ధృవాలకు సమాన దూరంలో ఉన్న భూమధ్యరేఖ మాదిరిగా రేఖాంశాలను లెక్కించడానికి ప్రారంభరేఖ అవసరం. ఈ ప్రారంభరేఖ కోసం 1884లో న్యూయార్క్ లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల సదస్సులలో తీసుకొన్న నిర్ణయం ప్రకారం లండన్ సమీపంలో థేమ్స్ నది ఒడ్డున 'గ్రీనిచ్' అనే ప్రదేశం మీదుగా పోయే రేఖాంశాన్ని '0°' రేఖాంశంగా తీసుకున్నారు. ఈ '0°' రేఖాంశాన్ని ప్రపంచ దేశాలన్నింటికీ ప్రామాణికంగా నిర్ణయించారు. ఈ రేఖాంశం భూగోళంను రెండు భాగాలుగా విభజిస్తుంది. ఈ గ్రీనిచ్ రేఖాంశం నుంచి తూర్పున 180 రేఖాంశాలు, పశ్చిమాన 180 రేఖాంశాలు మొత్తం భూగోళంపై 360 రేఖాంశాలున్నవి. రెండు రేఖాంశాల మధ్య దూరం భూమధ్యరేఖ వద్ద 110 కి.మీ. ఉండగా, 30°ఉత్తర, దక్షిణ అక్షాంశాల వద్ద 97 కి.మీ. 60° ఉత్తర, దక్షిణ అక్షాంశాల వద్ద 56 కి.మీగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధృవాల వద్దకుపోయే కొద్దీ రేఖాంశాల మధ్య నిడివి తగ్గడమే రేఖాంశాల మధ్య దూరభేదానికి కారణం. గ్రీనిచ్ రేఖాంశంను విస్తీర్ణమైన చక్రం అంటారు. అట్లే 180° తూర్పు పశ్చిమ రేఖాంశంను అంతర్జాతీయ దినరేఖ అంటారు.

గ్రీనిచ్(0°) రేఖాంశాల నుంచి 180° పశ్చిమ రేఖాంశాల మధ్య భాగాన్ని పశ్చిమార్థగోళమని, గ్రీనిచ్ రేఖాంశం నుంచి 180° తూర్పు రేఖాంశాల మధ్య భాగాన్ని 'పూర్వార్ధగోళమని' పిలుస్తారు. పూర్వార్ధగోళంలోని రేఖాంశాలను తూర్పు రేఖాంశాలని, పశ్చిమార్థగోళంలోని రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలని అంటారు. సూర్యునికి ఒక డిగ్రీ నుంచి మరొక డిగ్రీ రేఖాంశంకు ప్రయాణించడానికి 4 నిముషాల సమయం పడుతుంది. ఈ విధంగా గంటకు 15 రేఖాంశాలను దాటుతూ సూర్యుడు ప్రయాణించగలడు. ఈ విధంగా 24 గంటలలో మొత్తం 360 రేఖాంశాలను దాటుతూ సూర్యుడు ప్రయాణిస్తాడు.

ఒక ప్రదేశం ఉనికి అక్షాంశ, రేఖాంశాల ద్వారా తెలిపేటపుడు మొదట అక్షాంశాన్ని తరవాత రేఖాంశాన్నీ చెపుతారు. ఇలా అక్షాంశం, రేఖాంశం పరస్పరం ఖండించుకొనే ప్రదేశాలుగా ఏర్పడతాయి. గ్రిడ్ చతుష్కోణంలో ఉంటుంది. గ్రిడ్ సహాయంతో భూగోళంపై ఏ ప్రదేశాన్నైనా సులభంగా గుర్తించవచ్చు. 

కాలమానం - అంతర్జాతీయ దినరేఖ

180° తూర్పు, పశ్చిమ రేఖాంశంను అంతర్జాతీయ దినరేఖ అంటారు. 1884లో వాషింగ్టన్ లో జరిగిన అంతర్జాతీయ భూగోళ శాస్త్రజ్ఞుల సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రీనిచ్ రేఖ నుంచి తూర్పుగా పయనిస్తే ప్రతి డిగ్రీకి 9 నిమిషాల కాలం ముందుకు జరుగుతుంది. ఈ విధంగా గ్రీనిచ్ కాలానికి 180° తూర్పు రేఖాంశమైన అంతర్జాతీయ దినరేఖ సమీపించే సరికి 12 గంటల కాలం ఎక్కువ అవుతుంది. తూర్పు, పశ్చిమ రేఖాంశమైన అంతర్జాతీయ దినరేఖకు ఒకవైపున సోమవారం మరోవైపున ఆదివారం ఉంటుంది. అందువల్ల అంతర్జాతీయ రేఖను దాటేప్పుడు తూర్పు రేఖాంశం నుంచి, పశ్చిమ రేఖాంశంలోకి పయనించే వారు ఒక రోజు వెనకకు మార్పుకావాల్సి ఉంటుంది. అంటే సోమవారం నుంచి ఆదివారం లోకి మార్చుకోవాలి. అంతర్జాతీయ దినరేఖ ఎక్కువ భాగం పసిఫిక్ మహాసముద్రం మీదుగా పోతుంది. 

స్థానిక కాలం

ఒక రేఖాంశంపై పగలు సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినపుడు 12 గంటలుగా తీసుకొని నిర్ణయించిన కాలాన్ని స్థానిక కాలం అంటారు. 

ప్రామాణిక కాలం

ఒక ఖండంలోగాని, ఒక దేశంలోగాని వివిధ ప్రదేశాలలోని స్థానిక కాలాలను దృష్టిలో ఉంచుకొని ఆదేశం మధ్యగుండా పోయే రేఖాంశానికి కలపగా వచ్చే సమయాన్ని ప్రామాణిక కాలం అంటారు.