అనేక సంవత్సరాలుగా ఒక ప్రదేశంలో ఉండే సగటు వాతావరణ పరిస్థితిని శీతోష్ణస్థితి అంటారు. వాతావరణం కేవలం కొన్ని గంటల్లో మారవచ్చు, అయితే శీతోష్ణస్థితి మారడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఆవిర్భవించిన నాటి నుండి భూమిపై అనేక వైవిధ్యభరితమైన శీతోష్ణస్థితి పరిస్థితులు ఉండేవి.

శీతోష్ణస్థితి మార్పులకు ఆధారాలు : 

  • సముద్ర మట్టం పెరుగుదల 
  • ప్రపంచ ఉష్ణోగ్రత 
  • పెరుగుదల వేడెక్కుతున్న మహాసముద్రాలు 
  • కుంచించుకుపోతున్న మంచు పలకలు 
  • క్షీణిస్తున్న ఆర్కిటిక్ సముద్రపు మంచు 
  • విపరీతమైన సహజ సంఘటనలు 
  • సముద్ర ఆమ్లీకరణ 
  • మంచు కవచం తగ్గుదల 

శీతోష్ణస్థితిలో సంభవించే మార్పులకు కారణాలు

శీతోష్ణస్థితిలో మార్పులకు అనేక కారణాలు గలవు. వాతావరణంలో అత్యంత ముఖ్యమైన మానవసంబంధ ప్రభావం వాతావరణంలోని హరితగృహ వాయువుల సాంద్రతలో పెరుగుతున్న ధోరణి ఒకటి.

ఖగోళ సంబంధ కారణాలు

ఖగోళ సంబంధ కారణాలు సూర్యరశ్మి కార్యకలాపాలకు సంబంధించిన సౌర ఉత్పత్తిలో వైవిధ్యాలను కలుగచేస్తాయి. సూర్యునిపై గల మచ్చలు పునరావృత పద్ధతిలో ఉదయించి అస్తమిస్తుంటాయి. ఈ మచ్చల సంఖ్య పెరిగినప్పుడు, చల్లగా, తేమగా ఉండే వాతావరణం ఏర్పడుతూ ఒక మోస్తరు తుఫాను కూడా సంభవిస్తుంది. ఈ మచ్చల కారణంగా సూర్యుడి నుండి వెలువడిన వేడి భూమి యొక్క వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

మిలాంకోవిచ్ డోలనాల కారణంగా భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే కక్ష్య లక్షణాలలో వైవిధ్యాలు, భూమి యొక్క కదలిక, భూమి యొక్క అక్షసంబంధ వంపులో మార్పులు జరుగుతాయి. ఇటువంటి మార్పులతో సూర్యుని నుండి వెలువడే వేడి భూ వాతావరణంపై ప్రభావం చూపుతుంది.

అగ్నిపర్వత సంబంధ కారణాలు

వాతావరణ మార్పులకు అగ్నిపర్వతాలు కూడా కారణంగా పరిగణించబడుతున్నాయి. అగ్నిపర్వత విస్ఫోటనాలు వాతావరణంలోకి ఎరోసోల్ లను వెలువరుస్తాయి. ఈ ఏరోసోల్లు భూమి యొక్క ఉపరితలంపైకి చేరే సూర్యుడి రేడియేషన్ను తగ్గిస్తూ గణనీయమైన కాలం వాతావరణంలో కొనసాగుతాయి.

హరితగృహ(గ్రీన్‌హౌస్) వాయువుల గాఢత

క్లోరోఫ్లోరో కార్బన్లు, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఓజోన్ మొదలైనవి ఆందోళన కలిగించే ప్రాథమిక హరితగృహ వాయువులుగా పరిగణించబడుతున్నవి. నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కొన్ని ఇతర వాయువులు ఈ హరితగృహ వాయువులతో సులభంగా స్పందించి వాతావరణంలో వాటి సాంద్రతను ప్రభావితం చేస్తాయి. వాతావరణంలోని హరితగృహ వాయువులలో ఎక్కువ సాంద్రతను కలిగి ఉన్న వాయువు కార్బన్ డయాక్సైడ్.

హరితగృహ(గ్రీన్‌హౌస్) ప్రభావం

హరితగృహ ప్రభావం అనేది భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేసే ఒక సాధారణ ప్రక్రియ. సౌర వికిరణం భూమి యొక్క వాతావరణాన్ని చేరుకుని కొంత భాగం తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబిస్తుంది. సూర్యుని యొక్క మిగిలిన శక్తి భూగోళం, మహాసముద్రాలచే గ్రహించబడి భూమిని వేడి చేస్తుంది. ఈ విధంగా భూమి నుండి అంతరిక్షం వైపు వేడి ప్రసరిస్తుంది. ఈ వేడిలో కొంత భాగం వాతావరణంలోని హరితగృహ వాయువుల ద్వారా బంధించబడి, భూమిని వెచ్చగా ఉంచి భూమిపై జీవరాసుల మనుగడకు తగిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.

శిలాజ ఇంధనాలను కాల్చడం, వ్యవసాయంలో అవలంభించే కొన్ని పద్ధతులు, భూమిని శుభ్రపరచడం వంటి మానవ కార్యకలాపాలు వాతావరణంలోకి విడుదలయ్యే హరితగృహ వాయువుల శాతాన్ని పెంచుతున్నాయి. ఇటువంటి కార్యకలాపాల వలన అదనపు వేడి పెరిగి తద్వారా భూమి యొక్క ఉష్ణోగ్రత పెరగడానికి కారణభూతమయి చివరికి గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తుంది.

గ్లోబల్ వార్మింగ్ 

భూమి, సముద్రం మరియు వాతావరణం యొక్క ఉపరితలం క్రమంగా వేడెక్కడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ హరితగృహ ప్రభావంతో ప్రారంభమవుతుంది. ఇది సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ మరియు భూమి యొక్క వాతావరణం మధ్య పరస్పర చర్య వలన ఏర్పడుతుంది. హరితగృహ వాయువుల ఉనికి కారణంగా వాతావరణం కూడా ఒక హరితగృహంగా మారిపోతుంది.