ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారానికి గాను తలెత్తిన తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)లు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది మరియు భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయమైనది. తొలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 1969 సంవత్సరం నుండి మొదలు 2014లో జరిగిన మలిదశ ఉద్యమం వరకు ఈ సంఘాలన్నీ క్రియా శీలక పాత్ర పోషించాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోని వివిధ దశల్లో అనేక జేఏసీలు ఏర్పడి తెలంగాణ ప్రజల ఆశలు - ఆకాంక్షలకు స్ఫూర్తిగా పోరాడాయి. అప్పటి వరకూ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను సైతం ఈ సంఘాలు ప్రభావితం చేశాయనడం అతిశయోక్తి కాదు.

1969 ఉద్యమంలో సైతం ఈ సంఘాల పాత్రే అత్యంత కీలకంగా మారింది. అప్పట్లో ప్రత్యేకంగా విద్యార్థి, ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటం తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాలకు చెందిన జన బాహుళ్యాలను తెలంగాణ సాధనవైపు కదిలించడం గర్వించదగిన విషయం. 2009 డిసెంబర్ 24న ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన రాజకీయ జేఏసీ సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, మానవ హారం, సకల జనుల సమ్మె, సాగర హారం, జైల్ భరో, రైల్ రోకో, వంటా వార్పు వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఒక చక్కని వేదికగా మారింది.

తెలంగాణకు చెందాల్సిన నీళ్ళు, నిధులు, ఉద్యోగాల పంపిణీలో గతంలో జరిగిన వివక్షలు, భారీ స్థాయిలో భూ ఆక్రమణలు, సాంస్కృతిక దురాక్రమణ, తెలంగాణ జనుల పట్ల చూసిన చిన్నచూపు, ఇతర ఆధిపత్య ధోరణుల కారణంగా విసిగి వేసారి తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలనే నిర్దిష్ట లక్ష్యంతో జేఏసీలు ఏర్పాటు చేయబడినవి. దశాబ్దాలుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో మొదటినుండి జేఏసీలు, ప్రజా సంఘాలే అత్యఒత కీలక పాత్ర పోషించాయి. 

1969లో ఉద్యమానికి ఊపందించిన విద్యార్థులు, ఎన్జీవోలు- టీపీఎస్ ఆవిర్భావం

తొలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్ళలో 1968లో విద్యార్థులు, ఎన్జీవోలు ఏకమై హైదరాబాద్ లో పీపుల్స్ కన్వెన్షన్ ను నిర్వహించారు. ఇదే తరువాత కాలంలో 'ప్రజా సమితి'గా ఏర్పడి, 1969 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా సమితి(టీపీఎస్)గా మార్పు చెందింది. ఆ కాలంనాటి ప్రముఖ కాంగ్రెస్ నేత మర్రి చెన్నారెడ్డి దీనికి నేతృత్వం వహించారు.

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలంగాణ వాదం బలపరిచిన కొందరు ప్రముఖ నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ప్రజా సమితిలో చేరారు. టీపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా రకరకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబడినవి. 1969 జూన్ 10వ తేదీన తెలంగాణ ఉద్యోగుల సంఘంన ఆధ్వర్యంలో సమ్మె జరిగింది.

చెన్నారెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న టీపీఎస్ కొంత కాలం తరువాత ఒక రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని, తొలిసారిగా ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో విజయం దుందుభి మోగించింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969 జూన్లో హైదరాబాదు విచ్చేసి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా టీపీఎస్ బరిలిఓకి దిగింది. తెలంగాణ ఆకాంక్షతో ఉన్న అన్ని వర్గాలు, విద్యార్థి సంఘాలు, ప్రజల మద్దతు టీపీఎసకు లభించింది. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని 14 పార్లమెంట్ స్థానాలకు గాను 10 స్థానాబిను టీపీఎస్ కైవసం చేసుకుంది. కానీ కాలక్రమేణా టీపీఎస్ కు చెందిన ప్రముఖ నాయకులు తిరిగి కాంగ్రెస్ లోకి చేరడంతో ఆ పార్టీ పూర్తి మనుగడ సాగించలేకపోయింది. 

90లలో జరిగిన ఉద్యమంలో ప్రజా సంఘాల పాత్ర

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులే ముఖ్య పాత్ర పోషించారు. 1989లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటుచేయబడింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ లోని బసంత్ టాకీస్ లో భారీ సభ ఏర్పాటు చేయగా, 1969 ఉద్యమంలో పాలుపంచుకొన్న నేతలంతా ఈ సభకు హాజరై పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, వాటికి ఆంధ్ర నేతల అడ్డంకుల గురించి చర్చించారు. ఈ చర్చలు తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలకు చేరడంతో తెలంగాణ ఆకాంక్ష మరింత తీవ్రతరమైంది. 1970ల తర్వాత విద్యావకాశాలు విస్తృతమయ్యాయి. రిజర్వేషన్లు, ఇతర కారణాల వల్ల ఆర్థిక కోణంలో మధ్యతరగతి వర్గం పెరిగింది. ఈ వర్గం నుంచి విద్యావంతుల సంఖ్య పెరిగింది. దాంతో తెలంగాణ ప్రజలు వివక్షకు గురవుతున్న విధానంపై మరింత చైతన్యం వచ్చింది. వారంతా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. క్రమేణా 1990ల నాటికి ఈ పౌర సంఘాలు బలపడ్డాయి. మలి దశ ఉద్యమంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాయి. తెలంగాణ మహా సభ, తెలంగాణ జన సభ, తెలంగాణ ఐక్య వేదిక వంటి అనేక సంఘాలు ఏర్పాటు చేయడంతో ఉద్యమం మరింత ఊపందుకున్నది.

1996లోనూ ప్రజాసంఘాలే...
1996లో అప్పటి ప్రభుత్వం అనుసరించిన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, ఉపాధి కల్పన, జీవనోపాధి, ప్రజల సంక్షేమం పరంగా ప్రభుత్వం నుంచి ఆశించకూడదని ప్రభుత్వం పేర్కొనడం, ప్రైవేటు వర్గాలకు చేయూతనిచ్చే విధంగా వ్యహరించడం వంటి కారణాల వలన తిరిగి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఉద్యమం ప్రారంభమైనది. అప్పటికే తాము వివక్షకు గురవుతున్నామనే భావన కలిగి ఉన్న తెలంగాణ ప్రజలు ప్రభుత్వ విధానాల వల్ల తాము మరింత వివక్షకు గురవుతామని, విద్యా, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని ఆందోళన చెంది ఇందుకు ప్రత్యేక తెలంగాణ సాధనే పరిష్కారమనే అభిప్రాయానికి రావడంతో మలి దశ ఉద్యమానికి నాంది పడింది. ఈ క్రమంలోనూ విద్యార్థులదే కీలక పాత్ర. తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వంటి సంఘాలు ఆవిర్భవించాయి.
వివిధ సభలూ...సమావేశాలూ...జేఏసీల ఉద్యమాలూ...
1993 ఆగస్టులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై జాతీయ స్థాయి సెమినార్ జరిగింది. ఇందులో జార్జి ఫెర్నాండెజ్, జస్టిస్ మాధవ రెడ్డి, సురేంద్ర మోహన్ వంటి జాతీయ స్థాయి రాజకీయ, మేధావి వర్గాలంతా పాల్గొన్నారు. 1996లో తెలంగాణ జర్నలిస్టు, రచయితల నేతృత్వంలోని ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ పేరుతో ఒక సభ జరిగింది. 1996 నవంబర్ 1న వరంగల్ లో తెలంగాణ ప్రజా సమితి నిర్వహించిన సభ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రస్ఫుటం చేసింది. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, తీవ్రతరం చేయడంలో వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల జేఏసీ, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జేఏసీ ఉద్యమాన్ని క్రియాశీలకంగా నడపడంలో కృషి చేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా విద్యార్థి జేఏసీ 2009లో చలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. అలాగే 2010 జనవరిలో విద్యార్థి జేఏసీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరసనకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, హైకోర్టును ఆశ్రయించి భారీ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు మొదటి నుంచీ ప్రముఖపాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలంగా వ్యవహరించారు. 
టీఆర్ఎస్ ఆవిర్భావం
 తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఏర్పాటు చేయడం మలిదశ తెలంగాణ ఉద్యమంలో జరిగిన అత్యంత ప్రత్యేక పరిణామం. అప్పటివరకు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాలను, ఇతర నిరసనలను ప్రభుత్వాలు తమ అధికారంతో అణచివేశాయి. ఇది గమనించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రాజ్యంగబద్దంగా తెలియజేప్పాలనే లక్ష్యంతో అప్పటివరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఉన్న కె.చంద్రశేఖరరావు కేవలం ప్రత్యేక తెలంగాణ అంశమే తమ ఎజెండాగా 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. టీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణ ఉద్యమంలో రాజకీయ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఉద్యమ కార్యక్రమాలు జరగడం, వాటిలో విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు ఇలా అన్ని వర్గాలు మమేకమయ్యాయి. మలి దశలో 1990ల నుంచి 2009 వరకు వేర్వేరుగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించిన వర్గాలు 2009లో ఏకతాటి పైక వచ్చి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా పయనించడం తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే కీలక పరిణామం. 2009 నవంబర్ 29 నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో పౌర సంఘాలన్నీ మళ్లీ జీవం పోసుకున్నాయి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఐక్య వేదికలు కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ ఆందోళన కార్యక్రమాలను అణచివేయాలని అప్పటి ప్రభుత్వం ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లోని విద్యార్థులపై చేసిన లాఠీచార్జీ, కాల్పుల కారణంగా సాధారణ ప్రజానీకం సైతం ఉద్యమంలోకి వచ్చేలా చేసింది. 
తెలంగాణ రాజకీయ జేఏసీ ఆవిర్భావం
తెలంగాణ  రాజకీయ జేఏసీ ఏర్పాటు తెలంగాణ ఉద్యమ క్రమంలో అత్యంత కీలకమైన పరిణామం. కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో డిసెంబర్ 9, 2009న అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి పి. చిదంబరం 'తెలంగాణ ఏర్పాటు దిశగా అవసరమైన చర్యల ప్రక్రియను ప్రారంభిస్తున్నాం' అని ప్రకటించారు. అయితే డిసెంబర్ 23 నాటికి పరిస్థితి తలకిందులైంది. డిసెంబర్ 9 ప్రకటనకు భిన్నమైన ప్రకటన విడుదలైంది. అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రకటన సారాంశం. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆయా పార్టీల్లోని తెలంగాణ ప్రాంత నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి. దీంతో డిసెంబర్ 24, 2009న అన్ని రాజకీయ పార్టీల నేతలంతా కలిసి రాజకీయ ఐక్య వేదిక(జేఏసీ)ను ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు - ఆవశ్యకతపై 2010 ఫిబ్రవరి 10న కేంద్రం ఐదుగురు సభ్యులతో శ్రీ కృష్ణ కమిటీని నియమించింది.
ఉద్యోమంలో భాగంగా జేఏసీ నేతృత్వంలో జరిగిన సహాయనిరాకరణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో జరిగాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణ ఉద్యోగులు, పౌర సంఘాలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో 2011 ఫిబ్రవరి 17 నుంచి 16 రోజుల పాటు ఉద్యోగుల సహాయ నిరాకరఱ్మ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ 2011 సెప్టెంబర్ 13 నుంచి 42 రోజులపాటు జరిగిన సకల జనుల సమ్మె, 2011 సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సడక్ బంద్, 2012 సెప్టెంబర్ 30న సాగర హారం నిర్వహణ అత్యంత ముఖ్యఘట్టాలు.