కాకతీయుల కాలంలో

నాటి కాలంలో జరిగిన ప్రధాన మత పరిణామం జైన, బౌద్ధ మతాలు క్షీణించడం. విష్ణుమూర్తి దశావతారాల్లో బుద్ధుడిని తొమ్మిదో అవతారంగా భావించడం.. బౌద్ధం పౌరాణిక హిందూ మతంలో విలీనం కావడం కనిపిస్తాయి. క్రీ.శ. 12వ శతాబ్దం వరకు.. అంటే తొలి కాకతీయుల కాలం దాకా పాలకులు జైన మతాన్ని అవలంభించారు. మలి కాకతీయులైన రెండో ప్రోలరాజు నుంచి తెలంగాణలో శైవ మత ప్రాచుర్యం ప్రారంభమైంది. కర్ణాటకలో ప్రారంభమైన వీరశైవ మత ఉద్యమం ప్రభావంతో పాల్కురికి సోమనాథుడు తెలుగుదేశంలో వీరశైవ మత ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. వీరశైవ ఉద్యమ ప్రభంజనంలో తెలంగాణలోని పటాన్ చెరువు ప్రాంతంలోని జైన వసతులు విధ్వంసానికి గురైనట్లు పాల్కురికి సోమన తన 'పండితారాధ్య చర్రిత'లో ప్రస్తావించాడు. తెలంగాణలో వర్ధమానపురం, హన్మకొండ, వరంగల్, పటాన్ చెరువు, పూడూరు, ఆలంపూర్, కొలనుపాక, వేములవాడ, పొట్లపల్లి ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న జైన తీర్థంకరుల శిలా విగ్రహాలే ఇందుకు నిదర్శనం. హన్మకొండలోని నేటి పద్మాక్షమ్మ గుట్ట తొలుత జైన క్షేత్రమే. క్రమేపీ తెలంగాణలోని అనేక జైన మతాలయాలను శైవాలయాలుగా మార్చడంతో జైనమతం కనుమరుగైంది. శైవ మతం విస్తృతమైంది. శైవమతంలో కాలాముఖ, కాపాలిక, పాశుపత, వీరశైవం, ఆరాధ్యశైవం లాంటి శాఖలు ఉద్భవించాయి. 

కాకతీయ పాలకులు-కాలాముఖ, పాశుపత శైవాన్ని ఆచరించి, శైవాచార్యులకు భూదానాలు చేశారు. రెండో బేతరాజు హన్మకొండలో శివపురాన్ని నిర్మించి కాలాముఖ శైవాచార్యుడైన రామేశ్వర పండితుడికి మాన్యంగా ఇచ్చాడు. కాకతీయ మహాదేవుని శివ గురువు ధ్రువేశ్వర పండితుడు. ఆ కాలం నాటి శివాచార్యుల్లో విశ్వేశ్వర శివాచార్యులు సుప్రసిద్ధులు. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రునికి కూడా విశ్వేశ్వర శివగురువే శివదీక్షను ఇచ్చాడు. రుద్రమదేవి తమ గురువైన విశ్వేశ్వర శివాచార్యుడికి.. గోళకీ మఠాన్ని నెలకొల్పేందుకు వీలుగా వెలగపూడితో పాటు మందడ గ్రామాన్ని దానం చేసినట్లు మల్కాపురం శాసనం ద్వారా తెలుస్తోంది. శ్రీపతి, మల్లికార్జున, మంచన పండితులు కలిసి ఆరాధ్య శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. 

ఆర్థిక వనరులుగా దేవాలయాలు

కాకతీయులు దేవాలయాల నిర్మాణాన్ని పుణ్యకార్యంగా భావించి అనేక ఆలయాలను నిర్మించారు. దేవాలయాల్లోనే శాసనాలు వేయించారు. వాటికి దగ్గర్లోనే చెరువులను నిర్మించే సంప్రదాయానికి కూడా వీరే శ్రీకారం చుట్టారు. చెరువుల నుంచి వ్యవసాయానికి సాగునీరు అందించడం ద్వారా దేవాలయాలకు ఆర్థిక పురిపుష్టిని కల్పించేవారు. దీన్నిబట్టి ఆ కాలం నాటి దేవాలయాలు కేవలం సాంఘిక, సాంస్కృతిక కేంద్రాలుగానే కాకుండా ఆర్థిక వనరులుగా కొనసాగినట్లుగా తెలుస్తోంది. వివిధ వృత్తి పనులు చేసుకునేవారు, కళాకారులు ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దేవాలయాల మీద ఆధారపడేవారు. కాకతీయుల కాలం నాటి ప్రధాన, ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో హన్మకొండ వేయి స్తంభాల గుడి, పాలంపేట రామప్పగుడి, వరంగల్ భద్రకాళి ఆలయం.. నాగులపాడు, పిల్లలమర్రి, ఐనవోలు ఆలయాలున్నాయి. దుర్గాష్టమి, దసరా, దీపావళి, సంక్రాంతి, మహా శివరాత్రి, ఉగాది, ఏరువాక లాంటివి ఆనాటి హిందువుల ముఖ్యమైన పండగలు. కాకతీయుల కాలంలో మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేవారు. ఏటా కొత్తగా వ్యవసాయం, సేద్యపు పనులు ప్రారంభించడానికి ముందు 'ఏరువాక' పండగ నిర్వహించేవారు. ఎల్లమ్మ, కాకతమ్మ, ఏకవీర, పోలేరమ్మ, మారమ్మ, మల్లారమ్మ గ్రామదేవతలతో పాటు దుర్గ, పార్వతి, శివుడు, విష్ణువు అవతారాలను పూజించేవారు. వీరి కాలంలోనే బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్న కేశవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. కాకతీయల కాలంలో శైవం - వైష్ణవం మధ్య సమన్వయం సాధించడానికి తిక్కన హరిహరనాథ తత్వాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. కుల దేవతలు, గ్రామ దేవతలు, వీరుల ఆరాధన కూడా కాకతీయుల కాలంలో కొనసాగింది. ఓరుగల్లులో ఈ గ్రామ దేవతల పూజలు, పల్నాటి వీరుల పూజలు జరిగినట్లు 'క్రీడాభిరామం' ద్వారా తెలుస్తోంది.

పద్మనాయకుల కాలంలో 

కాకతీయుల అనంతరం రేచర్ల పద్మనాయకులు వైష్ణవ మతాన్ని అనుసరించారు. సర్వజ్ఞ సింగభూపాలుడు గొప్ప వైష్ణవ మతాభిమాని. మాదానాయకుడు కూడా రామానుజాచార్యుల కుమారుడైన వెంకటాచార్యుడి శిష్యుడై వైష్ణవ మతాన్ని అవలంబించాడు. పాలకులు వైష్ణవ మతాన్ని ఆచరించగా సామాన్య ప్రజలు తీవ్రవాద శైవంపై ఆదరాభిమానాలు చూపించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వీరి కాలంలోనే 'రణము కుడుపు' అనే ఆచారం ప్రారంభమైంది. 'రణము కుడుపు' అంటే మృతుల రక్త మాంసాలతో బియ్యం కలిపి వండిన ఆహారాన్ని రణ దేవతలకు, భూత ప్రేతాలకు నివేదన చేయడం. శైవ వైష్ణవాల మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ ప్రజలు సామరస్య పూర్వకంగా మెలిగి మత సహనాన్ని పాటించారు. 

కుతుబ్ షాహీల కాలంలో

కుతుబ్ షాహీ పాలకులు పరమత సహనం పాటించి రాజ్యాన్ని పరిపాలించారు. నాటి పాలకులు ముస్లింలు కాగా రాజ్యంలోని అత్యధిక శాతం ప్రజలు హిందువులు. గోల్కొండ పాలకులు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. కుల, మత భేదం లేకుండా మొత్తం 14 పండగలను జాతీయ పర్వదినాలుగా ప్రకటించారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా 'వసంతోత్సవాల'ను ప్రారంభించాడు. గోల్కొండ బోనాల పండగ నాటి నుంచే నిర్వహించేవారు. నేటికీ తెలంగాణలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు మొదట గోల్కొడ కోట నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. హిందూ ముస్లింల సామరస్యానికి ప్రతీక పీర్ల పండగ. హిందూ ముస్లింల సఖ్యత, హిందువులను ఉద్యోగాల్లో నియమించడం వంటి పరిణామాలు మొగలులు గోల్కొండపై దండెత్తడానికి దారితీశాయి. హిందూ ముస్లింల సఖ్యత, సామరస్యం కుతుబ్ షాహీల కాలంలో అత్యున్నత స్థితికి చేరుకుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను రూపుమాపి, కాలజ్ఞాన తత్వాల ద్వారా మత సామరస్యానికి కృషి చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ కాలానికే చెందివాడు కావడం విశేషం. గోల్కొండ ప్రభువులు క్రైస్తవుల కోసం మచిలీపట్నంలో చర్చిని కూడా నిర్మించి తమ ఔన్నత్వాన్ని నిరూపించుకున్నారు.