శాతవాహనుల కాలంలో 

నాటి కాలంలో మత పరిస్థితుల్లో ఒక విశిష్టత కనిపిస్తుంది. చక్రవర్తులు వైదిక మతాన్ని అనుసరించి ఈ మతోద్దరణకు కృషి చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్న 'ఏక బ్రాహ్మణ', 'ఆగమ నిలయ' లాంటి బిరుదులను బట్టి అతడు వర్ణాశ్రమ ధర్మాన్ని పరిరక్షించినట్లు తెలుస్తోంది.గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ఆధారంగా గౌతమీపుత్ర శాతకర్ణి వర్ణసాంకర్యాన్ని నిరోధించాడని తెలుస్తున్నది. శాతవాహన రాజులు యజ్ఞ యాగాది వైదిక క్రతువులు, అశ్వమేధ, రాజసూయ యాగాలు నిర్వహించినట్లు ఆధారాలు కలవు.

ఇంద్రుడు, వాసుదేవుడు, వరుణుడు తదితర హిందూ దేవతలను ఆరాధించారు. అయితే వీరి కాలంలో ఎక్కడా హిందూ దేవాలయాలున్న దాఖలాలు మాత్రం లేవు. పాలకులు మతం విషయంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ప్రభువులు వైదిక మతాన్ని అనుసరించగా రాణులు, అంతఃపుర స్త్రీలు, సామాన్య ప్రజలు బౌద్ధ మతాన్ని ఆరాధించారు. అద్భుతమైన శిల్పకళతో బౌద్ధుల చైత్యాలు (ప్రార్థనా మందిరాలు), విహారాలు (విశ్రాంతి మందిరాలు), స్తూపాలు (సమాధులు - స్మారక మందిరాలు) లాంటివి నిర్మించారు. నల్గొండ జిల్లా కొండాపూర్, ఫణిగరి, నాగార్జున కొండల్లోనూ కరీంనగర్ జిల్లా పెద్ద బంకూర్, ధూళికట్ట తదితర ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలున్నాయి. ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమిత గ్రంథాన్ని మహాయాన బౌద్ధ మతానికి కరదీపికగా భావించేవారు. ఈ కాలంలో ఆచార్య నాగార్జునుడు 'సుహృల్లేఖ'ను రచించి యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితమిచ్చాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడి ఆధ్వర్యంలో తెలుగునేలపై మహాయాన బౌద్ధమతం విశేష ప్రాభవం పొందింది. తొలి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు మొదట జైన మతాభిమాని అని కరీంగనర్ జిల్లా మునులగుట్ట వద్ద లభించిన పురావస్తు ఆధారాల నాణేలు) ద్వారా తెలుస్తోంది. 

ఇక్ష్వాకుల కాలంలో 

ఇక్ష్వాకు వంశ పాలకుడు వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు కూడా అశ్వమేధ, రాజసూయాది యాగాల్ని నిర్వహించి వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించాడు. వీర పురుషదత్తుడు తొలుత వైదిక మతాన్నే అనుసరించి నప్పటికీ తర్వాత బౌద్ధమతాన్ని ప్రోత్సహించడానికి బౌద్ధ విహారాలకు, మహా చైత్యాలకు భూరి విరాళాలిచ్చాడు, దానధర్మాలు చేశాడు. నాగార్జున కొండలో లభ్యమైన శాసనాధారాల్ని బట్టి రాజ కుటుంబాలకు చెందిన మహిళలు కూడా బౌద్ధ మఠాలకు (విజయపురి) దానాలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్ష్వాకుల కాలంలో విజయపురి ప్రపంచంలోనే అతిపెద్ద మహాయాన బౌద్ధ క్షేత్రంగా పేరు పొందింది. అయితే ఎహువల చాంతమూలుడు మాత్రం వైదిక మతాన్నే అనుసరించాడు. హిందూ-వైదిక పురాణ దేవతలకు గుళ్లు కట్టించాడు. బౌద్ధమతాన్ని కూడా ప్రోత్సహించాడు. 

విష్ణు కుండినుల కాలంలో 

విష్ణు కుండినుల పాలకుడైన గోవిందవర్మ మొదట బౌద్ధమతాన్ని అనుసరించినప్పటికీ తర్వాత శైవమతాన్ని అవలంబించాడు. బౌద్ధ భిక్షువులకు, బ్రాహ్మణులకు, పేదలకు విశేషంగా దానధర్మాలు చేశాడు. అతడి భార్య, కుమార్తె (ప్రిత్వీముల) ఇంద్రపురిలోని బౌద్ధ సంఘానికి విహారాన్ని నిర్మించి ఇచ్చినట్లు తెలుస్తోంది. జయాశ్రయుడనే బిరుదున్న రెండో మాధవ వర్మ 11 అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగం లాంటి ఎన్నో అగ్ని స్తోమ యాగాలు చేశాడు. హిరణ్యగర్భ, పౌండరీక యాగాలు కూడా చేశాడు. రెండో విక్రమేంద్రవర్మ శైవ మతస్థుడైనప్పటికీ ఇంద్రపురిలో ఉన్న బౌద్ధ విహారానికి తన వంతు ప్రోత్సాహాన్ని అందించాడు. విష్ణుకుండినుల్లో చివరివాడైన నాలుగో మాధవవర్మ తన రాజ్య, వంశ కీర్తి ప్రతిష్ఠలను ద్విగుణీకృతం చేయాలన్న సంకల్పంతో హిందూ మతాలను ఆచరించాడు. అశ్వమేధం లాంటి వైదిక యజ్ఞ యాగాదులను నిర్వహించాడు. దక్షిణాదిన దేవాలయాలను నిర్మించడమనే సంప్రదాయం వీరి కాలంలోనే మొదలైంది. విజయపురిలో యాగశాల, ప్రముఖ దేవతలైన పుష్పభద్ర(శివ), మహాసేన, అష్టభుజ(విష్ణువు), హారితి(శక్తి) దేవాలయాలను నిర్మించారు. విజయపురిలోని శ్రీపర్వతలోయ బౌద్ధ మతానికి ఏవిధంగా కేంద్ర బిందువైందో అదేరీతిలో విజయపురి సమీపంలోని మంచికల్లు శివ, విష్ణు, శక్తి క్షేత్రంగా ప్రఖ్యాతి చెందింది. 

శైవ మతం 

శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినుల కాలంలో వర్ధిల్లిన బౌద్ధ, జైన మతాల ప్రాబల్యానికి దీటుగా చాళుక్య పాలకులు శైవ మతానికి ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం చేశారు. చాళుక్య వంశంలోని పాలకులు అనేక యజ్ఞ, యాగాది క్రతువులను క్రమం తప్పకుండా వివిధ సందర్భాల్లో నిర్వహించేవారు. తెలంగాణలో ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, పోలవాస నాయకుల కాలంలో శైవమతానికి విశేష ఆదరణ, ప్రోత్సాహం లభించాయి. శ్రీశైల క్షేత్రానికి ప్రముఖ శైవ క్షేత్రాలైన త్రిపురాంతకం - తూర్పు, ఆలంపూర్ - పడమర, సిద్ధవటం - దక్షిణ, ఉమామహేశ్వరం - ఉత్తర ద్వారాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలంపూర్ లోని శిల్పాల్లో బుద్ధుడు యోగముద్రలో ఉన్నట్లుగా చిత్రించి ఉంటుంది. విష్ణువు మిగతా అవతారాలు ఆ బుద్ధుడి చుట్టూ ఉన్నట్లుగా చెక్కారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వీరి కాలంలో ప్రధాన శైవక్షేత్రంగా వెలిసింది. ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల కాలంలో విశేష ఆదరణ పొందిన బౌద్ధ మతానికి వీరి కాలంలో క్రమంగా ఆదరణ తగ్గింది. వేములవాడ చాళుక్యరాజు రెండో అరికేసరి కాలంలో 'త్రిభువన తిలక' అనే జైన బసతిని నిర్మించారు. ప్రముఖ కన్నడ కవి పంపకవి సోదరుడైన జిన వల్లభుడు చక్రేశ్వరితో కూడిన 24 మంది జైన తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్టించాడు. ఈ కాలానికి చెందిన బద్దెగ రాజు శుభధామ జినాలయాన్ని నిర్మించి ప్రఖ్యాత జైన కవి అయిన సోమదేవున్ని గురువుగా నియమించాడు. వీరి కాలంలోనే పటాన్ చెరువు, బోధన్, ఉజ్జలి, కొలనుపాక, పెద కోడుమూరు, తొగరకుంట ప్రముఖ జైన క్షేత్రాలుగా వెలుగొందాయి.

వైష్ణవ మతం

క్రీ.శ. 10వ శతాబ్ది నాటికి తెలంగాణలో ప్రధాన పరిణామాలు.. శైవ మతానికి ప్రాబల్యం పెరగడం.. శైవ, జైన మతాల్లో అంతఃకలహాలు చెలరేగడం.. క్రమంగా ఇది పౌరాణిక శైవమతానికి దారులు వేసింది. ఇదే కాలంలో తెలంగాణ ప్రాంతంలో శైవమతంతో పాటు వైష్ణవ మతం కూడా ప్రాచుర్యాన్ని పొందింది. బూరుగుగడ్డ, మక్తల్, లింగగిరి ప్రాంతాలు ప్రముఖ వైష్ణవ మత ప్రాంతాలుగా పేరుపొందాయి. విష్ణుకుండినుల పాలకుడైన మాధవవర్మ శ్రీ పర్వతస్వామిని ఆరాధిస్తూ తనను ఆ స్వామితో సరిసమానంగా ఊహించుకున్నాడు. వైష్ణవ మతారాధకుల్లో సామాన్యంగా కనిపించే లక్షణం భక్తుడు-భగవంతుడూ వేరు కాదనే భావన. వైష్ణవుల్లో భగవంతుడు అవతార పురుషుడనేది గట్టి విశ్వాసం. బుద్ధుడు కూడా ఆ అవతార పరంపరలో విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకడనేభావన ఏర్పడింది. వైదిక బ్రాహ్మణ మతానికి బదులుగా పౌరాణిక మతం వచ్చి, దేవాలయాల్లోని పూజా విధానానికి నాంది పలికింది. భక్తి భావం పెరిగి, పూజాది ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేవారు.