హోదా 

తన కులహాదాను పెంపొందించుటలో బలీయమైన కాంక్షను కలిగి ఉండటం ఒక కులతత్వం పెంపొందడానికి ప్రధాన కారణంగా గోచరమవుతున్నది. కుల హోదాను నిర్వహించడంలో దాని సభ్యుల సామాజిక హోదాను అవకాశంగా ఆధారంగా తీసుకొంటారు. ఈ ధ్యేయాన్ని సాధించటానికి ప్రతి కులంవారు తమ కుల సభ్యులకు ఎన్నో వీలయిన హక్కులను, గౌరవ మర్యాదలను, సామాజిక హోదాను పెంపొందించటానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి చర్యల వల్ల కులతత్వం పెరగడానికి అవకాశం ఉంటుంది. 

వైవాహిక ఆంక్షలు 

ప్రతి కులంలో అనేక సామాజిక ఆంక్షలుంటాయి. వాటిలో వివాహానికి సంబంధించి కూడా కొన్ని వర్తిస్తాయి. ఇందువల్లనే ప్రతికులం ఒక ఏక వివాహ సమూహంగా స్థిరపడింది. ప్రతి కులం తమది ఉన్నతమయిన గౌరవం కల కులంగా భావిస్తూ వర్ణాంతర వివాహాలను నిరుత్సాహ పరుస్తూ వాటిని విమర్శల ద్వారా ఖండిస్తున్నారు. ఒక కుల సభ్యులందరూ వివాహ కట్టుబాట్లకు అనుగుణంగా ఏకమవడంతో సహజంగా వారిమధ్య బంధుత్వాలేర్పడుతున్నాయి. కానీ చివరికి ఈ భావన కూడా కులతత్వం పెరగడానికి దోహదమవుతోంది. 

నగరీకరణ మరియు పారిశ్రామికీకరణ 

నగరీకరణ పారిశ్రామికీకరణ కారణంగా నగరాల్లో నివస్తున్న అన్నికులాల వారంతా ఏకతాటిపైకి చేరి కులపరంగా వారికి అవసరమైన రక్షణలను ఏర్పరచుకుంటున్నారు. ఇరుగుపొరుగు కుటుంబం తన రక్షణ కోసం ఏర్పాట్లను పొందుపరచుకొన్నట్లుగా నేడు కులాలు ఇదే విధమైన భావనతో భద్రతను ఆకాంక్షిస్తున్నాయి. దీనివల్ల కులతత్వం ప్రోత్సహించబడుతోంది.

రవాణా మరియు కమ్యూనికేషన్ సాధనాలు 

పెరుగుదల ఆధునిక కాలంలో పెరుగుతున్న రవాణా సాధానాలు ప్రసార మాధ్యమాలు దూరతీరంలో ఉన్న కుల సభ్యులను దగ్గర చేరుస్తున్నాయి. దీనివల్ల వారంతా సులభంగా కలుసుకోవడానికి వీలు కలుగుతోంది. వారి సమస్యా పరిష్కారాలను కూడా చేసుకోగలుగుతున్నారు. 

ప్రచారం 

వివిధ కులాల ప్రచారం కూడా ఒక ప్రత్యేకమైన సాధనంగా ఉంటూ కులతత్వ అభివృద్ధికి తోడ్పడుతోంది. కులాల సమస్యలను ప్రచారం చేయుటలో సత్వర చర్యలను చేపట్టటానికి ప్రచార మాధ్యమాలు దోహదపడుతున్నాయి. అందుకే తమ కులం పటిష్టపరమైనదని, బలీయమైనదని సౌభాతృత్వ సామరస్యాలతో ఆయా కులాలు దృఢంగా నమ్ముతున్నాయి. 

నిరక్షరాస్యత 

భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత ప్రబలంగా ఉంది. మరియు విద్యాభ్యాసం కారణంగా కులతత్వాన్ని వాస్తవంగా ప్రోత్సాహానికి గురిచేసింది. 

దుర్వినియోగమవుతున్న హక్కులు 

రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా సంక్రమించిన వివిధ రక్షణలను కొన్ని వర్గాలు దుర్వినియోగం పరుస్తున్నవి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను వారు ఇతర కులాలపై ఆధిపత్యం కోసం ఉపయోగిస్తుండడంతో బాధిత వర్గాలు తమని తాము రక్షించుకోవడం కోసం సంఘటితం అయి ఇదికూడా కులతత్వానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. పరస్పర దాడులు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనచేయడం లాంటి లక్షణాల వల్ల కులతత్వ సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంది. 

స్వార్ధపూరిత ఆలోచనలు 

రాజకీయ నాయకుల స్వార్థపూరిత ఆలోచనలు, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కూడా కులతత్వం మరింతగా పెచ్చు పెరుగుతున్నది. రాజకీయపార్టీలు తమ ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి ఆయా కులాలను తమవైపునకు తిప్పే ఒక తంత్రాన్ని బహిరంగంగానే అమలు చేస్తున్న. జనాభా ప్రాతిపదికన స్థానాలు, మంత్రిత్వ శాఖలను కేటాయిస్తున్నాయి. వీటివల్ల సమాజంలో స్పష్టమైన కుల విభజన చేయడం వల్ల అంతరాలు పెరిగి, కులతత్వం ముదురుతుంది. 

చట్టాల ఉల్లంఘన 

వివిధ సందర్భాల్లో కులతత్వంతో వ్యవహరించిన వ్యక్తులకు సకాలంలో సరైన శిక్షలు లేక. స్వేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. 

సాంకేతిక కారణాలు 

ఆధునిక కాలంలో పెరుగుతున్న సాంకేతిక విప్లవాల కారణంగా సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ కులాల వారందరు తమకు సంబంధించిన విషయాలను కొన్ని క్షణాల్లోనే తెలుసుకోగలుగుతున్నారు. అనేక కులాలకు చెందిన సామాజిక మాధ్యమ గ్రూపులు ఏర్పాటవడంతో సమాచార మార్పిడి మరింత వేగవంతమై కులతత్వానికి కారణభూతమవుతోంది.

కులతత్వం వలన కలిగే దుష్ఫలితాలు 

కులతత్వం వల్ల సమాజంలో సామరస్య వాతావరణం బలహీనపడి అనిశ్చితి అశాంతి పెరుగుతుంది.కులతత్వం అప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసి తద్వారా ఫలితాలు కూడా తారుమారు అయ్యే పరిస్థితి కలుగుతుంది. రాజ్యాంగ స్ఫూర్తికి 'కులతత్వం' ప్రతిఘాతం కలుగజేస్తుంది. రాజ్యాంగం సమానత్వాన్ని ప్రజాస్వామిక వ్యవస్థను ప్రతిపాదించింది. కులతత్వం వల్ల సమానత్వానికి విఘాతం ఏర్పడడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తి బలహీనపడుతుంది. భారత జాతీయత మాత్రమే ఈ దేశాన్ని సంఘటితంగా ఉంచగలదు. కులతత్వం సూక్ష్మ సంఘటితత్వాన్ని ఏర్పరిచే ప్రక్రియలో విశాల ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. 

కులతత్వం మతమార్పిడులకు కారణం అవుతుంది. బాహ్య ప్రలోభాలు లేనంతవరకు 'మత మార్పిడులు' రాజ్యాంగం ప్రసాదించిన హక్కే కానీ కులతత్వం బాహ్య ప్రలోభమే కాబట్టి, మత మార్పిడులు ఉద్రిక్తతలకు కారణమవుతాయి. ఒక సామాజిక చట్రంలో అణగారిన వర్గాలు మతమార్పిడి చేసుకోవడానికి కారణం అగ్ర కులతత్వమే అనేది ఒక భావనగా ఉన్నది. కులతత్వం వ్యక్తులను ప్రేరేపించి పాలనలో అనేక అక్రమాలకు కారణమవుతోంది. ఇతర కులాలవారికి ప్రభుత్వ ప్రతిఫలాలు అందకుండా అడ్డుకునేలా వారిని పురిగొల్పుతుంది. అవినీతి చర్యలకు పాల్పడేందుకు తోడ్పడుతుంది. కులతత్వం వల్ల సంఘర్షణలు ఏర్పడితే ఆయా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుంది. పెట్టుబడులు మందగించడం వల్ల ఉపాధి కల్పన తగ్గుతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. దేశ ఉత్పాదకత క్షీణిస్తుంది. ఎటువంటి లాభం లేకపోయినా కూడా కులతత్వం వల్ల ప్రజలు ఆయా కుల వృత్తులను అంటి పెట్టుకుని ఉండడం వలన వ్యక్తిగతంగా వారు నష్టపోవడమే కాకుండా సమాజానికి, చివరికి దేశానికి కూడా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది.