సామాజిక వర్షన లేదా మినహాయింపు గురించి తెలుసుకోవడానికి ముందు సామాజిక నిర్మితి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా కలదు. సామాజిక నిర్మితిని తెలుసుకోవడం ద్వారా సమాజంలో గల వర్గాలు, అందులో వర్జనకు గురవుతున్న వర్గాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు. 

సామాజిక నిర్మితి లక్షణాలు

సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన అంశాలు ఇతర పాశ్చాత్య సమాజాల కంటే భారతీయ సమాజంలో భిన్నంగా ఉన్నాయి. మతాలు, జాతులు, భాషలు, కులాలు, తెగల్లో గల అంతర్గత ప్రత్యేకత స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్నాయి. కానీ ఎన్ని విధాల వైవిధ్యాలు కలిగినా కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప సామాజిక నిర్మితి భారత సమాజంలో కనిపిస్తుంది. 

సామాజిక జీవనంలో వ్యక్తుల పరస్పర చర్యల వల్ల సంబంధాలు ఏర్పడతాయి. ఈ అల్లికను సామాజిక నిర్మితిగా భావించవచ్చు. తరతరాలుగా వ్యక్తులు మారినా కూడా సమాజిక నిర్మితి కొనసాగుతూనే ఉన్నది. సమాజంలో నివసించే వ్యక్తులు తమ సామాజిక అవసరాల కోసం రకరకాల సంస్థలను ఏర్పాటు చేసుకుంటారు. వారి సామూహిక జీవితానికి ఇవి అనివార్యమైనవిగా భావించబడతాయి. వ్యక్తులు, సంస్థల విశిష్ట అమరికనే నిర్మితి అనవచ్చు. అలాంటి విభిన్న సంస్థల సమగ్ర నిర్మితిని సమాజిక నిర్మితిగా నిర్వచించవచ్చును. 

ఒక సమాజంలో ప్రజల జీవన విధానం, ఆచార అలవాట్లు, సంప్రదాయం,కట్టుబొట్లు వారు నివసించే భౌగోళిక వాతావారణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ పరిస్థితులు భారతదేశంలోని వైవిధ్యానికి కారణాలుగా చెప్పొచ్చు. భారత సమాజ విశిష్ట లక్షణం భిన్నత్వం. దీనికి ప్రధాన కారణం భౌగోళిక వైవిధ్యం. దేశంలోని అన్ని పాంతాల్లో శీతోష్ణస్థితి, వాతావరణం, నదులు, వర్షపాతం వంటివి ఒకే విధంగా లేవు. దీనివల్ల భారత సమాజంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానంలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. అందువల్లనే భారతదేశంలోని సామాజిక నిర్మితి భిన్నంగా ఉంటుంది. 

భిన్న మతాల సమూహం 

భారత సమాజంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇతర మతాల వారు ఉన్నారు. ప్రజల సామాజిక జీవన విధానం, విశ్వాసాలు, అలవాట్లు చాలా వరకు మత ప్రాతిపదికగా ఉంటాయి. ప్రతి మతానికి పవిత్ర గ్రంథం, ప్రత్యేక ఆరాధన పద్ధతులున్నాయి. రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా గుర్తించినప్పటికీ ప్రజల జీవన విధానంలో మతం ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. 

కుల వ్యవస్థ 

భారతదేశంలో వేదాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైనదిగా భావించబడే రుగ్వేదంలోని పదవ మండలంలో గల పురుషసూక్తంలో బ్రాహ్మణు, క్షత్రియ, వైశ్యు, శూద్రులనబడే చాతుర్వర్ణ వ్యవస్థ గురించిన ప్రస్తావన కలదు. ఆ తరువాత సంభవించిన అనేక పరిణామాల కారణంగా ఇతర కులాలు ఏర్పడినవి. సాధారణంగా కులాలనేవి వ్యక్తులు నిర్వర్తించే వృత్తుల ఆధారంగా ఏర్పడినవే. మారుతున్న కాలానికి అనుగుణంగా కులాంతర వివాహాలు, వృత్తుల మార్పునకు అవకాశం లేకుండా కుల వ్యవస్థ కఠినతరమైనదిగా తయారవుతూ వచ్చింది. ప్రయాణ సౌకర్యాలు, భావ ప్రసార సౌకర్యాలు, నాగరికత, పాశ్చాత్యీకరణ, పారిశ్రామికీకరణ, అంతర్జాతీయ వ్యవస్థల ప్రభావం, ప్రపంచీకరణ నేపథ్యంలో కుల వ్యవస్థ కూడా అనేక మార్పులకు లోనవుతోంది. 

విభిన్న భాషలు 

భిన్నత్వంలో ఏకత్వంగా విరాజిల్లుతున్న భారత సమాజంలో అనేక రకాల భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. అయితే భారత రాజ్యాంగం మాత్రం ఎక్కువగా వాడుకలో గల 22 భాషలను మాత్రమే గుర్తించింది. భారతదేశంలో ఇండో ఆర్యన్ భాషలు మాట్లాడే ప్రజలు ఎక్కువ శాతం, ద్రవిడ భాషను మాట్లాడే వారు తక్కువ శాతం; ఆస్ట్రిక్, యూరోపియన్ భాషలు మాట్లాడేవారు అతి తక్కువ శాతం ఉన్నారు. హిందీని జాతీయ భాషగా గుర్తించి, ఆంగ్ల భాషను అధికార భాషగా ఏర్పరిచి భాషాపరమైన సమైక్యత సాధించే ప్రయత్నం జరిగింది. కొన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ, హిందీని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఉద్యమాలు జరిగి ఉద్యమాలు ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలకు దారితీయడం జరిగింది.

జాతులు 

చారిత్రకంగా చూస్తే భారతదేశానికి అనేక జాతులు వలస రావడం లేదా ఆక్రమణలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడం వంటి రకరకాల కారణాల వల్ల జాతి వైవిధ్యం సుస్పష్టంగా గోచరమవుతోంది. ఆర్యులు, కుషాణులు, హుణులు, అరబ్బులు, తరుష్కులు భారతదేశానికి తరలివచ్చి ఇక్కడే స్థిరపడి, ఇక్కడి సంస్కృతిలో విలీనమయ్యారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జి.ఎన్.గుహ భారతీయ సమాజంలోని జాతి విభాగాల వారసత్వాన్ని ఆధారంగా చేసుకొని, భారత జాతులను నేగ్రిట్లు, ప్రోటో ఆస్ట్రాలాయిడ్లు, మంగోలాయిడ్లు, మెడిటరేనియన్లు, పశ్చిమ బ్రాచీ సెఫాల్స్, నార్టిలు అనే రకాలుగా విభజించాడు. 

గ్రామీణ సమాజం 

భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం సుమారు 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించేవారు. నేడు అది సుమారు 60 శాతానికి పడిపోయింది. భారతీయ గ్రామాలు సుమారు 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయి. భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా గ్రామీణ వ్యవస్థ స్వయం సమృద్ధి, స్వయం పాలనా అధికారాలు కలిగి ఉండేవని చెప్పడానికి చారిత్రక ఆధారాల కలవు. విదేశీ దండయాత్రలు, బ్రిటిష్ పాలనలతో వ్యాపార సరళిలోని ఉత్పత్తి, పంపిణీ విధానాల్లో కలిగిన మార్పులు గ్రామీణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. కుటీర పరిశ్రమలు, చేతివృత్తులకు ఆదరణ కొరవడింది. పారిశ్రామికీకరణ వల్ల పట్టణాలకు ప్రాధాన్యం ఏర్పడింది. పాశ్చాత్యీకరణ వల్ల గ్రామీణ సామాజిక వ్యవస్థలో గుర్తించదగ్గ మార్పులు వచ్చాయి. నేడు మనం చూస్తున్న గ్రామాలకు, ప్రాచీన కాలంలోని గ్రామాలకు చాలా తేడాలు కనిపిస్తాయి. కాలానుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సంభవించిన మార్పులు గ్రామీణ ప్రాంత ప్రజల ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలపై కూడా ప్రభావం చూపాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 

సంస్కృతీకరణ, లౌకికీకరణ, పాశ్చాత్యీకరణ 

ఆధునిక భారతీయ సమాజంలో సంస్కృతీకరణ ప్రక్రియ ద్వారా చెప్పుకోదగిన మార్పులు కలిగాయి. పాశ్చాత్యీకరణల కారణంగా భారతీయ ప్రజల జీవన విధానంలో కూడా అవే ధోరణులు ప్రస్ఫుటమవుతున్నాయి. లౌకికీకరణ ఫలితంగా భారత సమాజం విభిన్న మతాలకు నిలయమైనప్పటికీ మత ప్రమేయం లేని లౌకిక సమాజంగా పరివర్తన చెందింది. ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాలు రాజ్యాంగం, చట్టం ప్రకారం నిర్ణయమవుతాయి. భారతదేశంలో అధికారిక మతమంటూ లేకుండా, మతాన్ని వ్యక్తిగత అంశంగా భావించి మతసహనం పాటించడం జరుగుతోంది.