కులానికి ఆంగ్లంలో ఉపయోగించే క్యాస్ట్ (Caste) అనే పదం పోర్చుగీసు భాషలోని క్యాస్టాస్ (Castas) అనే పదం నుండి ఏర్పడింది. Casta అంటే తెగ, సంతతి అని అర్థం. కులవ్యవస్థలో సంప్రదాయబద్ధమైన వృత్తులను అనుసరిస్తూ, స్థానికమైన హోదా కలిగి వంశపారంపర్యమైన అంతర్ వివాహాలు కలిగిన సమూహాలు చేరివుంటాయి.

క్రమశ్రేణిలో ఒక ప్రత్యేక కులం కలిగివున్న స్థానం, వివిధ కులాల మధ్య సంబంధాలు చాలా వరకు ఆహారపు అలవాట్లకు, వృత్తులకు సంబంధించిన స్వచ్ఛత, మైలా భావాలవల్ల నిర్ణయింపబడతాయి. కులాలన్ని అనేక ఉపకులాలుగా విభజించబడ్డాయి. 

కులతత్వం 

కులం అనేది హిందూ సామాజిక వర్ణచట్రం నుంచి ఆవిర్భవించిన సాంఘిక నిర్మితికి ఒక రూపం లేదా నిదర్శనం. 'కులతత్వం' అనగా ఒక కులం ప్రజలు మరో కులం వారిని పీడిస్తూ, వారిపై పెత్తనం ప్రదర్శించే ఆధిపత్య ధోరణి. పరిమిత వనరులు, వాటి అసమతౌల్య పంపిణీ, పెత్తనం చేసేందుకు, అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కులతత్వాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా ఉంది. 

నిర్వచనాలు 

కులతత్వం మరియు గుడ్డిగా ఉన్నత సమూహ విధేయతవల్ల, ఆరోగ్యకరమైనటువంటి సామాజిక ప్రమాణాలైన న్యాయం, సమానత్వం విశ్వమానవ సోదరత్వం మరుగుపడుతున్నట్లుగా చేస్తుంది - కాకాకలేల్కర్. 

ప్రతి ఒక్కటి కులలాభాదాయానికి పాటుపడేదే కులతత్వం - కె.యమ్. ఫణిక్కర్ 

కులతత్వం కులవిధేయతకు సంబంధించినది. అది రాజకీయాలలోనికి చొచ్చుకొని పోయింది. ఒక ప్రత్యేక

కులం ఎడల పాక్షికంగా కాని ఏకపక్షంగాని విధేయత చూపెట్టేదే కులతత్వం - డి.ఎన్.ప్రసాద్ 

ఒక కులం దాని ఆసక్తులకు ఇతర కులాలకంటే ఎక్కువగా కాపాడుకోవాలని కాంక్షిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతర కులాల ఆసక్తులకు హానికి కలిగిస్తుంది. మనదేశంలో కులతత్వం సామాజిక మతపరమైన రంగాలకే పరిమితం కాక రాజకీయ, ఆర్ధిక జీవన రంగాలకు కూడా విస్తరించింది.

కులం సమస్య

నేడు భారతదేశం ఎదుర్కొంటున్న సాంఘిక సమస్యలలో కులం సమస్య ఒకటి. కుల వైషమ్యాలవల్ల ఒక కులంవారు మరొక కులం వారిని ద్వేషించడం, లేక ఒక కులంవారు ఇతర కులాలకు చెందిన ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించేవిధంగా తమ ప్రయోజనాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించడం చేరివుంటాయి. సాంఘిక, ఆర్థిక వ్యవహారాలలోను అధికారంలోనూ ఎక్కువ వాటాపొందడానికి వివిధ కులాల మధ్య పెరుగుతున్న పోటీ దీనికి ప్రధాన కారణం. కాని కొందరు స్వార్థపరులు కులం పేరుతో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. కులం వైషమ్యాలు సక్రమమైన ప్రభుత్వ విధానాల అమలుకు, నిజమైన ప్రజాస్వామిక జీవన విధానానికి అడ్డుతగులుతూ, సమాజంలో వర్గ సంఘర్షణలకు దారితీస్తున్నాయి. సామాజిక వ్యవస్థలో, సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాలలో వాంఛనీయమైన మార్పులు రావడం, పడిపోతున్న విలువలను పునరుద్ధరించడం, కుల వైషమ్యాలను అరికట్టడానికి సరియైన మార్గాలు.