ఫ్రాన్స్ దేశీయుడైన దీన్ లెనోయిర్ తొలిసారిగా సోషల్ ఎక్స్ క్లూజన్ (సామాజిక వర్జన లేదా మినహాయింపు) అనే పదాన్ని ఉపయోగించాడు. ఒక వ్యక్తి తన శక్తియుక్తులను సమర్థంగా వినియోగించుకుని సామాజికంగా అభివృద్ధి చెందేందుకు కొన్ని హక్కులను కల్పించారు. సామాజిక పరిస్థితులు లేదా సాంఘిక నిర్మితుల కారణంగా తమ శక్తి యుక్తులను సమర్ధంగా వినియోగించుకుని సామాజికంగా అభివృద్ధి చెందేందుకు కల్పించిన హక్కులను పొందలేని స్థితిలో ఉన్న వ్యక్తులను సమాజం మినహాయించినవారు లేదా బహిష్కరించినవారుగా పేర్కొనడం జరిగింది. మానవ పరిణామ క్రమంలో భాగంగా సమాజంలో అధికారం, హోదా, సంపద పంపిణీలో కొందరిపట్ల నిరంతరం వివక్ష జరుగుతున్నందు వలన అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న సదరు వ్యక్తులు లేదా వర్గాలు తీవ్రమైన వెనుకబాటుతనానికి గురవడం జరుగుతోంది. 

సాధారణంగా పేదరికంలో మగ్గుతున్న వారు వారున్న పరిస్థితుల వల్ల కొన్ని హక్కులు పొందలేకపోయినప్పటికీ, పేదరికం నుంచి బయటపడిన లేదా పేదరికం సవరణకు గురైనప్పుడు తిరిగి ఆయా హక్కులు, రక్షణను పొందేందుకు వీలు కలుగుతుంది. 'సామాజిక వర్జన' కారణంగా విలువైన మానవ వనరులు పాక్షికంగా లేదా భారీ ప్రమాణాలతో కూడా తమ శక్తియుక్తుల్ని సమర్థంగా ప్రదర్శించలేని పరిస్థితి ఏర్పడి తత్ఫలితంగా చివరికి దేశాభివృద్ధి కుంటుపడే ప్రమాదకర స్థాయి కలుగుతుంది. 

సామాజిక వర్జన వల్ల సాంఘిక అసమానతలు ఏర్పడతాయి. పక్షపాతం, దోపిడీ లాంటి లక్షణాలు సమాజంలో కనిపిస్తాయి. ఈ కారణంగా మినహాయింపు లేదా బహిష్కరణకు గురైన వర్గాలు తీవ్ర అసంతృప్తికి గురవుతాయి. దాని ఫలితంగా సామాజిక అనిశ్చితి ప్రబలే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా తిరుగుబాట్లు, విప్లవాల ద్వారా పరిపాలనా వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుంది. ఆధునిక కాలంలో 'సామాజిక వర్జన'ను వెనుకబాటుతనంగా భావించడంతో ఈ మినహాయింపును పాటిస్తున్న దేశాలు ప్రపంచ ర్యాంకింగ్ లో అట్టడుగు స్థాయికి చేరి అంతర్జాతీయీకరణంలో 'వెనుకబాటుతనం' దశలో ఉంటున్నాయి. 

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సంక్షేమ రాజ్య భావనలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మినహాయింపు వల్ల వంచనకు గురైన వర్గాలకు ఉపశమనం, రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో 'మినహాయింపు' అనేది ఒక సామాజిక, పరిపాలన, రాజకీయ చర్చనీయాంశంగా మారి ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయి. 'సామాజిక మినహాయింపు' ఒక్కో సమాజంలో ఒక్కో రూపంలో ఉంటుంది. ఇది బహురూపాల్లో ఉండవచ్చు. ఒక వర్గానికే పరిమితం కావచ్చు లేదా అనేక వర్గాలకూ విస్తరించవచ్చు. 

భారతదేశంలో సామాజిక వర్జన

భారతదేశంలోని సామాజిక నిర్మితులు సమాజ మనుగడ కోసం, శ్రమ విభజనతో ప్రారంభమయ్యాయి. తర్వాతి కాలంలో సాంఘిక మినహాయింపు సమాజంలోని కొన్ని వర్గాలకే పరిమితమైంది. 

కులం 

భారతదేశంలో అత్యంత స్పష్టంగా గోచరించే సాంఘిక నిర్మితి అయిన 'కులం' సామాజిక అంతరాలకు ఒక ముఖ్యమైన కారణంగా నిలుస్తున్నది. ఇటువంటి అంతరాల వలన అధికారం, హోదా, హక్కులను కొన్ని కులాలకు మాత్రమే కల్పిస్తే, మరికొన్ని కులాలకు ఆ అవకాశం లేకుండా చేశాయి. ప్రస్తుతం దళితులుగా గుర్తింపు పొందిన వర్గాలకు వేల సంవత్సరాలుగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులు లేకుండా నియంత్రణ లేదా నిషేధం విధంచడం వెనుక ఉన్న సాంఘిక నిర్మితి కూడా కులమే. వీరిని భారత సమాజం పూర్తి స్థాయిలో సామాజిక ప్రక్రియల నుంచి బహిష్కరించడమే కాకుండా తీవ్ర దోపిడీకి గురి చేసింది. సామాజికంగా వెనుకబడిన కులాలుగా గుర్తింపు పొందినవారు కూడా పరిమిత స్థాయిలోనే రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులు పొందడం జరిగింది. సామాజికంగా వెనుకబడిన వారి నుంచి సమాజం కావాల్సిన సౌకర్యాలు, ఉత్పత్తులు పొందుతూనే వారికి అవసరమైనవి నియంత్రిస్తూ వచ్చింది. ఈ కారణం వల్ల సదరు వర్గాలు సంపూర్ణ సమాజ భాగస్వామ్యంలో పాలుపంచుకోలేక పోయాయి. కేవలం కులం ప్రాతిపదికనే ఉన్నత వర్గాలు పూర్తి స్థాయి 'ధనాత్మక మినహాయింపులు' పొందుతూ రాజకీయ, సామాజిక, ఆర్థిక శక్తులుగా ఎదిగి మిగతా కులస్తులను వివక్షకు గురిచేయడం జరిగింది.

తెగ

'తెగలు' మిగతా భారత సమాజానికి పూర్తి భిన్నంగా తమ జీవన శైలిని సాగిస్తున్నాయి. భౌగోళికంగా సమాజానికి దూరంగా జీవించడం వల్ల ఈ వర్గాలు సామాజిక ఎడబాటుకు గురవుతున్నాయి. తొలి దశల్లో తెగలు సమాజం నుంచి ఏమీ ఆశించకపోవడంతో దోపిడీ, వివక్ష కొంతవరకు తక్కువగానే ఉండేది. సమాజానికి భిన్నంగా ఉండటం, సరైన జీవన ప్రమాణాలు అందుకోలేకపోవడం, విద్య, ఉపాధి, ఉత్పత్తి రంగాల్లో తగిన భాగస్వామ్యం లేకపోవడం లాంటి మినహాయింపులకు వీరు గురయ్యారు.

లింగభేదం 

కుల, తెగ లాంటి పరిమితులకు అతీతంగా లింగభేదం వల్ల సమాజంలో అర్ధభాగంగా మనుగడ సాగిస్తున్న మహిళలు కూడా మినహాయింపునకు గురయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, మత నియమాలు, సాంఘిక పరిస్థితుల పేరుతో రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలో మహిళలకు సరైన భాగస్వామ్యం లేకపోవడం గమనార్హం. సామాజికంగా కూడా సొంత ఉనికిని కోల్పోయిన పరిస్థితుల్లో మహిళలు నియంత్రణకు గురయ్యారు. కుటుంబ స్థాయి నిర్ణయీకరణలో కూడా భాగస్వామ్యం లోపించడంతో సామాజిక హోదా, భాగస్వామ్యంలో స్త్రీలు వెనుకబడిన సందర్భాలెన్నో కలవు. 

ప్రాంతీయత 

భౌగోళికతను ఆధారంగా చేసుకుని కొన్ని వర్గాలకు ప్రత్యేక హక్కులను కల్పించని పరిస్థితే భారతదేశంలో కనిపించే ప్రాంతీయ మినహాయింపు ధనాత్మక వివక్ష ఈ మినహాయింపుతో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలకు అధికారం, హక్కులు, రక్షణలు బలహీనంగా లేదా అసలు అందకపోయే పరిస్థితి ఉంది.