భారత రాజ్యాంగంలో షెడ్యూల్డు కులాలకు ఇతర భారత పౌరులకు కల్పించిన సాధారణ హక్కులతో పాటు కొన్ని ప్రత్యేక రక్షణలు కూడా కల్పించబడినవి.

  • అధికరణ 15(4) ప్రకారం బలహీన వర్గాలకు సామాజిక, విద్య, ఆర్థిక రంగాలలో ప్రత్యేక సదుపాయాలను కల్పించడం జరుగుతుంది.
  • అధికరణ 15(5) ప్రకారం సామాజికపరంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారు, షెడ్యూల్డు కులాలు లేదా తెగల అభ్యున్నతి కోసం ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థల్లోనూ వారి ప్రవేశానికి సంబంధించి, ప్రభుత్వం చట్టం జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది.
  • అధికరణ 16(4) ప్రకారం ఈ అధికరణ ఉద్యోగాలలోను, సర్వీసులలోను సరైన భాగస్వామ్యం కల్పించనప్పుడు వారికి కొన్ని స్థానాలను కల్పిస్తుంది.
  • అధికరణ 17 ప్రకారం అస్పృశ్యతను రద్దుచేయడం జరిగింది. అస్పృశ్యతను పాటించడం కూడా నేరంగా పరిగణిస్తారు. ఈ రాజ్యాంగ నిబంధన ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయడం జరిగింది.
  • అధికరణ 23 ప్రకారం మానవ క్రయ విక్రయాలను, వెట్టి చాకిరిని నిషేధిస్తుంది.
  • అధికరణ 46 ప్రకారం షెడ్యూల్డు కులాల, గిరిజనుల, బలహీన వర్గాల వారికి సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలు.
  • అధికరణ 330 ప్రకారం శాసనసభలో షెడ్యూల్డు కులాలకు, తెగలకు లోక్ సభ సీట్లు రిజర్వు చేయాలి. అధికరణ 332 ప్రకారం శాసనసభలో షెడ్యూల్డు కులాలకు, గిరిజనులకు సీట్లను రిజర్వు చేయాలి.
  • అధికరణ 338 ప్రకారం రాష్ట్రపతి షెడ్యూల్డు కులాల, గిరిజనుల అభివృద్ధి క్రమంపై సమీక్ష జరపడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించవచ్చు.
  • అధికరణ 341 ప్రకారం అస్పృశ్యత, సాంఘిక రుగ్మతల వల్ల బాధపడుతున్న కొన్ని వెనుకబడిన వర్గాలను షెడ్యూల్డు కులాలుగా ప్రకటించడం జరిగింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత 1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డు కులాల జాబితా ప్రకటించబడింది.