భారత రాజ్యాంగంలోని 338వ అధికరణ ప్రకారం షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల ప్రయోజనాలను కాపాడ డానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఇవ్వబడింది. మొదటిసారిగా  రాష్ట్రపతి 1951లో షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమీషనర్‌ను నియమించారు. షెడ్యూల్డు కులాలకు, తెగలకు రాజ్యాంగంలో పొందు పరచబడిన రక్షణలను విచారించి పరిశోధించడం ఈ కమీషనర్ ముఖ్యవిధి.

షెడ్యూల్డు కులాల మరియు తెగల కమీషనను 1978వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తీర్మానం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 1987, సెప్టెంబర్ లో జాతీయ షెడ్యూల్డు కులాలు మరియు తెగల కమీషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉండాలని నిర్ణయించడం జరిగింది. 65వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1990లో షెడ్యూల్డు కులాల, తెగల కమీషనర్ నిర్వర్తించే విధులన్నింటినీ జాతీయ కమీషనకు బదలాయించారు. ఈ కారణం వల్ల 1992 మార్చి, 12వ తేదీ నుంచి కమీషనర్ పదవిని రద్దు చేయడం జరిగింది. 1997 మార్చిలో మొదటి జాతీయ షెడ్యూల్డు కులాలు మరియు తెగల కమీషను తొలి అధ్యక్షుడిగా శ్రీ రామ్ ధన్, ఉపాధ్యక్షుడుగా శ్రీ బండి ఓరాన్ నియమించబడగా, వీరితో పాటు మరో ఐదుగురు సభ్యులు కూడా నియమించబడినారు.

2004 ఫిబ్రవరిలో అమలులోకి వచ్చిన 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు వేర్వేరు కమీషన్లు ఏర్పాటు చేయబడినవి. ఈ విధంగా వేరుగా ఏర్పాటు చేయబడిన తొలి జాతీయ షెడ్యూల్డు కులాల అధ్యక్షునిగా శ్రీ సూరజ్ భాన్, ఉపాధ్యక్షునిగా ఫఖర్ భాయ్ వగేలాలతో పాటు మరో ముగ్గురు సభ్యులు నియమించబడినారు.

జాతీయ షెడ్యూల్డు కులాల కమీషను సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు కల్పించడం జరిగింది. షెడ్యూల్డు కులాలకు సంబంధించిన అన్ని ముఖ్య విషయాలలో కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కమీషనన్ను సంప్రదించాల్సి ఉంటుంది.

విధులు

  • భారత రాజ్యాంగంలో షెడ్యూల్డు కులాలవారికి కల్పించిన రక్షణలకు సంబంధించిన వివిధ అంశాలను దర్యాప్తు చేయడం పర్యవేక్షించడం.
  • షెడ్యూల్డు కులాల రక్షణలకు, హక్కులకు సంబంధించిన ఫిర్యాదులను విచారించడం.
  • షెడ్యూల్డు కులాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ప్రక్రియలో పాల్గొనడం, సలహాలివ్వడంతో పాటు వారి అభివృద్ధికి సంబంధించిన విషయాలను సరిచూడడం.

నిర్మాణం 

  • జాతీయ షెడ్యూల్డు కులాల కమీషన్ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో కలదు. 
  • వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కమీషన్ కార్యాలయాలు కలవు. 
  • కేంద్ర కార్యాలయంలో పాలన, సమన్వయ విభాగం, సేవాపరిరక్షణ విభాగం, అకృత్యాల, పౌరహక్కుల పరిరక్షణ విభాగం, ఆర్థిక, సామాజిక, అభివృద్ధి విభాగం అనే నాలుగు విభాగాలుంటాయి.