• తుఫాను గాలుల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తమవడంతో పాటు మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి. విద్యుత్ స్థంభాలు కూలిపోవడం, చెట్లు పడిపోవడం, చిన్న చిన్న భవన నిర్మాణాలు కూపోవడం మొదలైనవి జరుగుతాయి. వరదల కారణంగా వచ్చే బురద, మట్టి వల్ల రోడ్లు, వీధులు, చెత్తతో పేరుకుపోతాయి. 
 • తుఫానుల కారణంగా వచ్చే అధిక వర్షాలతో వరదలు ఏర్పడి వేల సంఖ్యలో జననష్టం కలుగుతుంది. అనేకమంది గాయాల పాలయ్యే అవకాశం ఉంటుంది. రకరకాల అంటువ్యాధులు కూడా ప్రబలుతాయి. 
 • భూ గర్భజలాలు, తాగునీరు కలుషితమవుతాయి. బావులు, చెరువుల్లో నీరు ఉప్పునీటితో నిండిపోతుంది. 
 • పంటలు దెబ్బతింటాయి. మొక్కలు వేళ్లతో సహా పెల్లకించబడతాయి. సముద్రం నీరు వచ్చి చేరడంతో భూమిలో లవణీయత పెరగడం వలన భూమి సరైన పంటలు పండే సామర్థ్యం కోల్పోతుంది. 
 • టెలిఫోన్ టవర్స్ కూలిపోవడం కేబుల్ వ్యవస్థలు ధ్వంసమవడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం, వంతెనలు కూలడం, శాటిలైట్ వ్యవస్థ స్తంభించడం వల్ల సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయి. 

నష్టనివారణ చర్యలు 

 • తీర ప్రాంతాల్లో సరైన వృక్ష సంపద లేకపోవడంతో తుపాను సులభంగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అయా ప్రాంతాల్లో పెద్దమొత్తంలో చెట్లను నాటడం వలన సముద్రం ఒడ్డున ఉండే చెట్లు అడ్డుగోడలా నిలిచి కొంతవరకు వరదలను నివారించే అవకాశం ఉంటుంది. 
 • పశ్చిమ బెంగాల్ లోని మాంగ్రూవ్ అడవులను పరిరక్షించడం వలన ఆ ప్రాంతంలో తుఫానుల కారణంగా సంభవించే వరదలను నివారించే అవకాశం ఉంటుంది. 
 • తుఫానుల గత చరిత్రను ఆధారం చేసుకొని తరచుగా తుఫానులు సంభవించే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన పటాలను తయారు చేయాలి. తుఫాను కదలికలను గమనించే పటిష్టమైన ఉపగ్రహ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
 • ఆధునిక సమాచార వ్యవస్థలను ఉపయోగించి తీర ప్రాంతాల్లోని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. 
 • తుఫాను బారిన పడుతున్న ప్రాంతాల్లో వీలైనంత తక్కువ మానవ జనాభా నివసించేలాగా చూసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో భవన, ఇతర నిర్మాణాలు గాలి, నీటి తాకిడిని తట్టుకునేలా నిర్మించాలి. 
 • తుఫాను సంభవిత ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, టెలిఫోన్ లైన్లను భూగర్భంలో ఏర్పాటుచేయడం వలన సమాచార వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 
 • తుఫాను వల్ల వచ్చే వరదల తీవ్రతను వరద నియంత్రణా పద్ధతుల ద్వారా తగ్గించాలి. తీర ప్రాంత ప్రజలకు తుఫానులపై అవగాహన కల్పించాలి. 
 • ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఋతుపవనాలు, వర్షపాతం, తుఫానులకు సంబంధించిన పూర్తి సమాచార సేకరణ జరిపి, ఆ సమాచారాన్ని ప్రాంతీయ తుఫాను హెచ్చరిక కేంద్రాల ద్వారా స్థానిక ప్రజలకు చేరేలాగా చూడాలి.