వైపరీత్యం 

ఆస్తి, ప్రాణ నష్టం కల్గించే శక్తి ఉన్న ప్రమాదకరమైన సహజ లేదా మానవ కార్యకలాప పరిస్థితే వైపరీత్యంగా వర్ణించబడుతుంది. వైపరీత్యం అనే పదం 'హజార్డ్' (Hazard) అనే పురాతన ఫ్రెంచి పదం నుండి వచ్చింది. వైపరీత్యాల తీవ్రత పెరిగే కొద్దీ విపత్తుగా మరుతుంది. సాధారణంగా వైపరీత్యాలను మూడు రకాలుగా వర్గీకరించారు. 

1. ప్రకృతిపరమైన వైపరీత్యాలు, 

2. మానవ ప్రేరేపిత వైపరీత్యాలు, 

3. సామాజిక-సహజ వైపరీత్యాలు. 

వేగాన్ని బట్టి వైపరీత్యాలు వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు. 

1. పెనువేగంతో విస్తరించే వైపరీత్యాలు, 2. నెమ్మదిగా విస్తరించే వైపరీత్యాలు. 

1. పెనువేగంతో విస్తరించే వైపరీత్యాలు : ఏదైనా ప్రాంతంలో ఒక వైపరీత్యాం అకస్మాత్తుగా సంభవిస్తే దాని యొక్క ప్రభావం అది ఏర్పడిన ప్రాంతంలో కొంతకాలం మాత్రమే ఉండేటటువంటి వాటిని వేగంగా విస్తరించే వైపరీత్యాలు అంటారు. భూకంపాలు, సునామీలు వీటికి ఉదాహరణలు. 

2. నెమ్మదిగా విస్తరించే వైపరీత్యాలు : ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో వైపరీత్యాలు నెమ్మదిగా సంభవించి, వాటి ప్రభావం మాత్రం దీర్ఘకాలికంగా ఉంటే అటువంటి వాటిని నెమ్మదిగా విస్తరించే వైపరీత్యాలు అంటారు. పర్యావరణ క్షీణత, కరువు, పంటలకు పట్టే చీడలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.

దుర్భలత్వం 

1. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి వల్ల కలిగే తీవ్రత అధికస్థాయిలో ఉంటే ఆ ప్రాంతం యొక్క పరిధిని దుర్భలత్వంగా పిలుస్తారు. 

2. ఏదైనా ఒక కమ్యూనిటీ, దాని నిర్మాణం అందులోని సేవలు లేదా ఏదైనా భౌగోళిక ప్రాంతం దాని స్వభావం, నిర్మాణం, దానికి విపత్తు భరిత ప్రాంతానికి లేదా ప్రమాదకర భూభాగానికి ఉన్న సామీప్యత రీత్యా విధ్వంసానికి గురవడానికి గల పరిధిని దుర్భలత్వం అంటారు. 

దుర్భలత్వాలు రెండు రకాలు 1. భౌతిక దుర్భలత్వం, 2. సామాజిక ఆర్ధిక దుర్భలత్వం. భూకంపాలు లేదా వరదలు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయి, విధ్వంసానికి గురయ్యే వ్యక్తులు, వనరులు భౌతిక దుర్భలత్వం కిందికి వస్తాయి. ఒక వైపరీత్యం ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై చూపే ప్రభావ తీవ్రతను నిర్ధారించేది సామాజిక ఆర్థిక దుర్భలత్వం.

సామర్థ్యం

ఏదైనా కమ్యూనిటీ ప్రాంతంలో సంభవించిన వైపరీత్యం వల్ల నష్టపోయిన ఆస్తులు, వనరులను, జీవనోపాధిని, పునరుద్ధరించుకోగల శక్తి లేదా నైపుణ్యాలనే ఆ కమ్యూనిటీకి గల 'సామర్ధ్యం'గా చెబుతారు. ఒక కమ్యూనిటీ యొక్క సామర్ధ్యం అనేది అందులో నివసించే ప్రజల యొక్క ఆర్థిక, సాంఘిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. 

సంసిద్ధత

ఇది ఒక సంరక్షణ ప్రక్రియ. ఆయా ప్రాంతాల ప్రభుత్వాలు, వ్యక్తులు, ఎన్జీవోలు వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి జరిగిన ప్రాణ, ఆస్తి నష్ట నివారణా చర్యలను ముందస్తుగా చేపట్టే చర్యలను సంసిద్ధత అంటారు. ఇందులో భాగంగా ముప్పు వాటిల్లిన ప్రాంతాలకు తగిన విధంగా ప్రణాళికలను రూపొందించకోవాల్సి ఉంటుంది. ప్రభావిత ప్రాంత ప్రజలకు హెచ్చరికలను జారీచేయడం, ఆయా ప్రాంతాల్లో నూతన సాంకేతిక నిర్మాణాలను, విధానాలను అభివృద్ధి చేయడం, విపత్తు నిర్వహణ సంస్థల్లో పనిచేసే వ్యక్తులకు, ఉద్యోగులకు, అధికారులకు తగిన శిక్షణా కార్యక్రమాల్ని అందించడం సంసిద్ధతలో భాగమే. 

ఉపశమనం 

ఉపశమనం అంటే విపత్తు లేదా తీవ్రమైన విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి చేపట్టే ఎలాంటి చర్యనైనా ఉపశమనం అంటారు. ఉపశమన చర్యలను విపత్తుకు ముందు, విపత్తు సమయంలో లేదా విపత్తు తరువాత కూడా చేపట్టవచ్చు .