1931లో కరాచీలో సర్దార్ పటేల్ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉండాలని తీర్మానించడం జరిగింది. అవి ముఖ్యంగా- మతం, కులం, లింగభేదంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ వాక్ స్వాతంత్ర్యం, మాట్లాడే హక్కు వయోజన ఓటుహక్కు అసోసియేషన్ గా అయ్యే హక్కులు మొదలైనవి కల్పించడం. దీనికి అనుగుణంగానే రాజ్యాంగం తయారయ్యే ముందు జరిగిన చర్యలలో భాగంగా కాంగ్రెస్ చేసిన లక్ష్యాల తీర్మానంలో వీటిని పేర్కొనడం జరిగింది. అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన “బిల్ ఆఫ్ రైట్స్" వలన ప్రభావితమై మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల సవివరంగా చేర్చారు. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో నిబంధన 12 నుండి 35 వరకు ఆరు ప్రాథమిక హక్కులు పొందుపరచారు. వీటిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. ఈ హక్కులు న్యాయసమ్మతమైనవి. అంటే వీటికి న్యాయస్థానాల రక్షణ ఉంటుంది. ఇవి నిరపేక్షమైనవి కావు. ప్రతిహక్కుపై కొన్ని పరిమితులు ఉన్నాయి. నిబంధన 20, 21 తప్ప మిగిలిన అన్ని ప్రాథమిక హక్కులను అత్యవసర పరిస్థితిలో సస్పెండ్ చేయవచ్చు. 

1.సమానత్వపు హక్కు (14-18) 

దీని ప్రకారం చట్టం ముందు అందరు సమానమే. (నిబంధన 14), వ్యక్తుల మధ్య కులం, మతం, జాతి, లింగ, నివాసస్థానం ఆధారంగా వ్యక్తుల మధ్య విచక్షణలు పాటించరాదు. అయితే షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించవచ్చు. (నిబంధన 15) పైన తెలియచేసిన విచక్షణలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వోద్యోగాలు కల్పించడంలో సమాన అవకాశాలు కల్పిస్తారు. (నిబంధన 16). అంటరాని తనం నిషేధించారు. (నిబంధన 17) ప్రభుత్వానుమతి లేకుండా వ్యక్తులు బిరుదులు స్వీకరించరాదు. కాని ప్రభుత్వం మాత్రం సైనిక, విద్యాఔన్నత్వాన్ని గుర్తిస్తు బిరుదులు ఇవ్వవచ్చు. (నిబంధన 18) 

2. స్వాతంత్ర్యపుహక్కు (19-22) :

నిబంధన 19 ద్వారా ఆరురకాల స్వాతంత్ర్యాలు కల్పించబడినవి. అవి వాక్ స్వాతంత్ర్యము, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యము, సంఘాలు - సంస్థలు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్ర్యము. సంచార స్వేచ్ఛ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యము, సంచార స్వేచ్ఛ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యము, వృత్తి స్వేచ్చ. ఈ స్వాతంత్ర్యాలను దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, దేశ రక్షణ, ప్రజారోగ్యం ప్రజా భద్రత అనే పరిమితులకు లోబడి మాత్రమే ఉపయోగించుకోవాలి. నిబంధనల 20 ద్వారా శిక్ష నుండి విముక్తి పొందే హక్కు కల్పిస్తుంది. అంటే ఒకే నేరానికి ఏ వ్యక్తిని రెండు సార్లు శిక్షించరాదు. నిబంధన 21 ద్వారా వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి రక్షణ కల్పించే జీవించే హక్కును కల్పించారు. హెబియస్ కార్పస్ రిట్ ద్వారా దీనిని పరిరక్షించవచ్చు. నిబంధన 21ఎ ద్వారా ఆరు నుండి 14 సం||లలోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాధమిక హక్కుగా 86వ సవరణ ద్వారా కల్పించారు. నిబంధన 22 ప్రకారం నిర్బంధం, నిగ్రహణ నుండి విముక్తి పొందే హక్కు కల్పించారు. కానీ ఈ నిబంధన నిరోధక నిర్బంధానికి అవకాశం కల్పిస్తుంది. 

3. దోపిడీని నిరోధించే హక్కు (23, 24) 

నిబంధన 23 ద్వారా వెట్టి చాకిరీ నిషేధించబడింది. కానీ ప్రభుత్వం నిర్బంధ సైనిక సేవలందించమని ప్రజలను కోరవచ్చు. నిబంధన 24 ద్వారా 14 సంవత్సరాలలోపు పిల్లలను ప్రమాదకర పరిశ్రమలలో పనిచేయించరాదు. 

4.మత స్వాతంత్ర్యపు హక్కు (25, 28)

లౌకిక రాజ్యమైన భారతదేశంలో ప్రతి వ్యక్తి తన కిష్టమైన మతాన్ని అవలంబించడానికి, ప్రచారం చేసుకోడానికి అవకాశం ఉంది. కానీ బలవంతపు మత మార్పిడి నిషేధించబడింది. (ని|| 25) అన్ని మతాల వారికి మత సంస్థలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోడానికి హక్కు ఉంది. (ని|| 26) ప్రభుత్వం ఒక ప్రత్యేక మత వ్యాప్తికి పన్ను వసూలు చేయరాదు. (ని॥ 27) ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధ నిషేధించబడింది. 5.విద్యాసాంస్కృతిక హక్కు (29, 30): ఈ హక్కు భాషా, మతపరమైన మైనారిటీల కోసం ఉద్దేశించబడింది. నిబంధన 29 ప్రకారం పౌరులు తమ సంస్కృతిని భాషను రక్షించుకునే అవకాశం ఉంది. నిబంధన 30 ప్రకారం మైనారిటీలు స్వయంగా విద్యాలయాలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవచ్చు. 

6.ఆస్తిహక్కు (31) 

దీనిని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి నిబంధన 300ఎ లో చేర్చి కేవలం రాజ్యంగ / చట్టబద్ధ హక్కుగా మాత్రమే కల్పించారు. 

7.రాజ్యాంగ పరిహారపు హక్కు (32) 

మిగిలిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరుడు ఈ హక్కు ద్వారా న్యాయస్థాన రక్షణ పొందవచ్చు. సుప్రీం కోర్టు ని|| 32 ద్వారా, హైకోర్టులు ని॥ 226 ద్వారా రిట్లు జారీ చేసి హక్కులను పరిరక్షిస్తాయి. కనుక అంబేద్కర్ దీనిని రాజ్యాంగానికి హృదయం వంటిదని వర్ణించారు. ఈ ప్రాథమిక హక్కులను పోలీసు, సైనిక దళాలకు వ్యక్తింప చేయకుండా పార్లమెంటు చట్టం చేయవచ్చు. (ని॥38) సైనికశాసనం అమలులో ఉన్న చోట ప్రాథమిక హక్కులు నిలిపి వేయవచ్చు. (నిబంధన 34), ప్రాథమిక హక్కులకు సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. (నిబంధన 36) అయితే ఈ శాసనాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవి గా ఉంటే వాటిని చెల్లకుండా చేసే అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు కల్పించబడింది.