భారత రాజ్యాంగంలోని 324వ ప్రకరణ ప్రకారం దేశములో ఎన్నికల నిర్వహణకు ఒక స్వతంత్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడింది. 324వ ప్రకరణలోని రెండవక్లాజు ప్రకారము ఎన్నికల సంఘము ఒక ప్రధాన ఎన్నికల అధికారిని, ఇతర ఎన్నికల అధికారులను కలిగి ఉంటుంది. ఇతర ఎన్నికల అధికారుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. 

ఎన్నికల సంఘము యొక్క విధులు: 

భారతదేశములో జరిగే ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎన్నికల సంఘము నిర్వహిస్తుంది. లోక్ సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు మొదలైనవి ఎన్నికల సంఘముచే నిర్వహించబడతాయి. ఎన్నికల సమయములో పొలింగ్ సక్రమంగా జరిగేటట్లు చూడటం ఎన్నికల సంఘము విధి. మహిళలకు ప్రత్యేక పోలింగూలను కేటాయించడం, ఉద్రిక్తతత గల నియోజకవర్గాలను గుర్తించి అటువంటి ప్రాంతాలకు పరిశీలకులను పంపడం, రిగ్గింగ్ వంటి అక్రమాలను నిరోధించుటకు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం మొదలైన బాధ్యతలన్నీ ఎన్నికల సంఘము నిర్వహిస్తుంది. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా అర్హులైన భారత పౌరులందరికి కలిపి ఓటర్ల జాబితాను తయారు చేయుట కూడా ఎన్నికల సంఘము విధులలో

ప్రధానమైనది. రాజకీయ పార్టీలను జాతీయ పార్టీలుగాగాని ప్రాంతీయ పార్టీలుగా గుర్తించి వాటికి ఎన్నికల గుర్తులు కేటాయించటం వంటి విధులను కూడా ఎన్నికల సంఘము నిర్వహిస్తుంది. 

ఎన్నికల సంఘానికి ఎన్నికలను జరిపించే అధికారమే కాక రద్దు చేసే అధికారము కూడా ఉంది. ఏ నియోజకవర్గములోనైనా రిగ్గింగ్, బూత్ అక్రమణ మొదలైన అక్రమ పద్ధతులు జరిగినట్లు దృష్టికి వస్తే వాటిపై విచారలు జరిపి వాటి నిజనిర్ధారణ జరిపి ఎన్నికలను ఆయా నియోజక వర్గాలలో రద్దు చేయగల అధికారము ఎన్నికల సంఘానికి కలదు. లోకసభ, రాష్ట్ర శాసనసభలు, రాజ్యసభ మొదలైన సభల్లో వివిధ కారణాల వల్ల ఏర్పడే ఖాళీలను భర్తీ చేయటానికి ఎన్నికల సంఘము ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. 

ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగము నిర్దేశించిన షెడ్యూల్డు కులాలు, తెగలకు రిజర్వేషన్లను అమలుపరచే బాధ్యత కూడా ఎన్నికల సంఘానిదే. నియోజవర్గాలను పునర్వ్యవస్థీకరించడం, పోలింగ్ అధికారులపై, పోలీసు సిబ్బందిపై ఎన్నికల సమయములో అధికారము కల్గి ఉండటం ఎన్నికలు నిర్వహించటానికి అధికార సిబ్బందిని ఏర్పాటు చేయమని రాష్ట్రపతిని, గవర్నర్లను కోరటం, ఒక శాసనసభ్యనీ అనర్హునిగా ప్రకటించే విషయములో రాష్ట్రపతి, గవర్నర్లకు సలహానివ్వటం మొదలైన విధులను కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. 

ప్రధాన ఎన్నికల అధికారి:

ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. ఇతడు రాష్ట్రపతిచే నియమించబడి అతడి ఇష్టమున్నంత కాలము పదవిలో ఉంటాడు. ప్రధాన ఎన్నికల అధికారి కాలపరిమితి సాధారణముగా 6 సంంవత్సరములు లేదా 65 సంవత్సరముల వయస్సు, ఏది ముందుగా పూర్తయితే దానిని అనుసరిస్తారు. ఈ లోపు అతను రాజీనామా చేసి వైదొలగవచ్చును. ప్రధాన ఎన్నికల అధికారి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించు విధానాన్ని కూడా రాజ్యాంగం పేర్కొంది. ఇతనిని తొలగించు తీర్మానము పార్లమెంటులో ఉభయ సభల ద్వారా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించబడినప్పుడు రాష్ట్రపతి ఇతనిని తొలగిస్తాడు. అయితే ఇతనిని “ఋజువు కాబడ్డ, అమర్యాదప్రవర్తన, "అసమర్థత" కారణాలపై కూడా తొలగించవచ్చు". ఈ విధమైన పరిస్థితులు కల్పించుట ద్వారా ప్రధాన ఎన్నికల అధికారి స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలవుతుంది. ప్రధాన ఎన్నికల అధికారి జీత భత్యాలు పార్లమెంటు చేయు చట్టాలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఈ జీత భత్యాలను పదవిలో ఉన్నంతవరకు ఎట్టి మార్పులు చేయరాదు. ప్రధాన ఎన్నికల అధికారి జీత భత్యాలు భారతీయ సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి.

ఎన్నికల సంఘము నిర్వహించే విధులన్ని ప్రధాన ఎన్నికల అధికారిచే నిర్వహించబడతాయి. ప్రధాన ఎన్నికల అధికారికి తోడ్పడేందుకు ప్రాంతీయ ఎన్నికల అధికారి, ఉప ఎన్నికల అధికారి, కార్యదర్శులు ఇతర సిబ్బంది ఉంటారు. ప్రాంతీయ ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి సలహాపై రాష్ట్రపతి నియమిస్తాడు.