ఆవులు, ఎడ్లను తెల్లజాతి, దున్నలు, గెదెలను నల్లజాతి పశువులని అంటారు. పశువుల నుంచి మనకు పాలు, మాంసం లభిస్తాయి. పాల ఉత్పత్తిని పెంచడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒంగోలు జాతి, హర్యానా జాతి పశువులు మన దేశంలో ఉండే తెల్లజాతి పశువులు. ఒంగోలు జాతి పశువులు అధిక వాతావరణ ఉష్ణోగ్రతను విషజ్వరాలను తట్టుకుంటాయి. ఇంగ్లండ్ కు చెందిన జెర్సీ ఆవులను, డెన్మార్క్ కు చెందిన హాల్ స్టీన్ ఆవులను మన దేశంలోని ఆవులతో సంకర పరచి సంకరజాతి ఆవులను సృష్టించారు. ఇవి పాలను అధికంగా ఇస్తాయి.

ఆవుపాలకంటే గేదెపాలలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి కాబట్టి, పాల పదార్థాలు తయారు చేయడానికి గేదెపాలు అనుకూలమైనవి. ఆవుల కంటే గేదెలు వ్యాధులను ఎక్కువగా తట్టుకుంటాయి. మనదేశంలో ముర్రా, భద్వారి, జఫ్రాబాడి, సుర్తి, మేష్న, నాగ పూరి, నీలిరావి వంటి గేదె జాతులు ఉన్నాయి. వీటిలో ముర్రాజాతి గేదెలు ఎక్కువ పాలను ఇస్తాయి. పశుగ్రాసాల కోసం నేపియర్ గడ్డి, పారాగడ్డి వంటి వాటిని పెంచుతారు. తీపిజొన్న, లూస్నర్, జనుము, వంటివి కూడా పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. పెరుగుదలకు, శరీరాభివృద్ధికి కావలసిన మాంసకృత్తులు, కొవ్వులు, పిండిపదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండటం వల్ల పాలను సంపూర్ణాహారం అంటారు.

సాధారణ పద్ధతుల్లో సంకరజాతి పశువులను ఉత్పత్తి చేయడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించం కోసం కృత్రిమ గర్భధారణ, సూపర్ ఓవ్యులేషన్, పిండిమార్పిడి అనే విధానాలను అనుసరిస్తున్నారు. కృత్రిమ గర్భధారణలో ఎద్దుల నుంచి సేకరించిన శుక్లాన్ని-180°C వద్ద నత్రజని ద్రావణంలో మొదట నిల్వ చేస్తారు. దీన్ని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువచ్చి ఆవుల్లోకి ప్రవేశపెడతారు. ఆవు నుంచి ఒకేసారి అనేక అండాలను విడుదల చేయడానికి గర్భంతో ఉన్న ఆడ గుర్రాల రక్తం నుంచి సేకరించిన సీరమ్ గొనాడో ట్రాపిన్ అనే హార్మోన్ ను ఎక్కిస్తారు. ఇలా వచ్చిన అండాలను కృత్రిమ ఫలదీకరణ జరిపి పిండాలను మరో ఆవులోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతినే 'పిండమార్పిడి' అంటారు.

చేపలను అధిక సంఖ్యలో పెంచడాన్ని మత్స్య సంవర్ధనం అంటారు. చేప మాంసంలో విటమిన్-ఎ, డి, శరీరానికి ఉపయోగపడే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. బొచ్చె, వాలుగ, మట్టగిడస మొదలైనవి మంచి నీటి చేపలకు ఉదాహరణ. పొలస, సుడుము, సొర, రిబ్బను చేప వంటివి సముద్ర చేపలకు ఉదాహరణ. చేపలు గుడ్లు పెట్టడానికి వాటికి పియూష గ్రంథి స్రావాన్ని ఎక్కిస్తారు. చేపలను డబ్బాల్లో నిల్వ చేసే ముందు క్లాడ్లీడియం బోటులీనమ్ వంటి బాక్టీరియాలను లేకుండా చూడాలి. మేకలు,

గొర్రెల నుంచి మనకు మాంసం, ఉన్ని లభిస్తుంది. నెల్లూరు జాతి గొర్రెలు రుచిగల మాంసాన్ని, దక్కన్ జాతి గొర్రెలు మాంసంతో పాటు ఉన్నిని కూడా ఇస్తాయి. కోళ్లలో గుడ్లు పెట్టే వాటిని లేయర్స్ అని, మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్స్ అని అంటారు. గుడ్లను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి వైట్ లెగ్ హార్న్ రకాన్ని పెంచుతారు.