పట్టు:

పట్టుదారం పట్టుపురుగుల నుంచి లభిస్తుంది. వీటి పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. పట్టుపురుగు గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు పట్టును ఉత్పత్తి చేస్తుంది. దీని లాలాజలం గ్రంథులు పట్టు గ్రంథులుగా మార్పు చెంది ఉంటాయి. పట్టులో నాలుగు రకాలున్నాయి. అవి: మల్బరి పట్టు, టస్సార్ పట్టు, ఈరిపట్టు, ముగాపట్టు. వీటిలో మల్బరి పట్టు ఎక్కువ నాణ్యమైంది. మల్బరి పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం బొంబెక్స్ మోరి. ఇవి మల్బరి ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. 

మల్బరి పట్టు ఉత్పత్తి - వివిధ దశలు :

ఆడజీవి పెట్టిన గుడ్లు పొదిగి గొంగళిపురుగులుగా మారతాయి. ఇవి మల్బరి ఆకులుతింటూ పెరుగుతాయి. దీని తర్వాత గొంగళి పురుగులు తమ పాత కవచాన్ని వదిలి కొత్త కవచాన్ని ఏర్పర్చుకుంటాయి. దీన్ని నిర్మోచనం అంటారు. గొంగళిపురుగు శరీరం చుట్టూ పట్టు దారాలతో కోశాన్ని అల్లుకుంటుంది. దీన్ని కుకూన్ అంటారు. పట్టుపురుగు జీవితదశలోని ఈ దశను ప్యూపా అంటారు. ఈ దశ తర్వాత ప్యూపా మార్పు చెందివ ప్రౌఢజీవిగా మారి కుకూనను ఛేదించుకుని బయటికి వస్తుంది. ఈ ప్రక్రియను రూపవిక్రయం అంటారు. దీనికి ముందే కుకూన్లను వేడినీటిలో ఉంచి లోపల ఉన్న మాత ను చంపి కుకూన్ల నుంచి పట్టుదారాన్ని రీలింగ్ యూనిట్లలో సేకరిస్తారు. ప్రౌఢజీవి కుకూన్ నుంచి బయటకు వస్తే పట్టుదారం ముక్కలైపోతుంది. ఇది పట్టుదారం తయారీకి ఉపయోగపడదు. పట్టు పురుగు గొంగళిపురుగుకు సూక్ష్మజీవి వల్ల పెట్రైన్ అనే వ్యాధి వస్తుంది. పట్టులో పైబ్రోయిన్ అనే ప్రొటీను ఉంటుంది.

టస్సార్ పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం ఆంథిరియా పాఫియా. ఇది ఓక్, ఫిగ్ మొక్కల పై పెరుగుతుంది. ఈరి పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం అట్టాకస్ రిసిని. ఇది ఆముదం ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. ముగా పట్టును ఆంథోరియా ఆస్సమా అనే పట్టుపురుగు ఉత్పత్తి చేస్తుంది. పట్టుదారాలు తేలికగా దృఢంగా ఉంటాయి. వీటిని దుస్తులు, పారాచూట్టు, చేపల వలలు, ఇన్సులేటర్ కాయిల్స్, రేసింగ్ కార్లటైర్లు లాంటి వాటిని తయారు చేయడానికి వాడతారు. 

తేనె:

తేనెను ఎపిస్ జాతికి చెందిన కీటకాలైన తేనెటీగలు ఉత్పత్తి చేస్తాయి. వీటి పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. ఒక గుంపులోని తేనెటీగలు రాణి ఈగ, డ్రోనులు, కూలి ఈగలు అనే రకాలుగా ఉంటాయి. సమూహానికి ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది. గుడ్లను పెట్టడం దీని ముఖ్య విధి. కూలి ఈగలు మకరందాన్ని సేకరించి తేనె పట్టులో నింపుతాయి. వీటికి మైనపు గ్రంథులు ఉండటం వల్ల ఇవి మైనాన్ని ఉత్తప్తి చేస్తాయి. వీటికి దాడిచేసే స్వభావం ఉంటుంది. డ్రోనులు మగ ఈగలు. ఇవి రాణి ఈగతో సంపర్కం జరుపుతాయి.

తేనెటీగల్లో నాలుగు రకాలున్నాయి. అవి: 1) ఎపిస్ డార్సేట. దీన్ని రాక్ తేనెటీగ అని కూడా అంటారు. ఇది ఎక్కువ తేనెను ఇచ్చినప్పటికీ వీటిని మచ్చిక చేసుకోవడానికి వీలుపడదు. 2) ఎపిస్ ఇండికా. దీన్ని ఇండియన్ తేనెటీగ అంటారు. దీన్ని తేనెను ఉత్పత్తి చేయడానికి పెంచుతారు. 3) ఎపిస్ ఫ్లోరియా. దీన్ని చిన్న తేనెటీగ అంటారు. 4) ఎపిస్ మిల్లి ఫెరా.

తేనె మానవుడికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే చక్కెరలు, ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. తేనెను కేకులు, బిస్కెట్లు, బ్రెడ్లు లాంటి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేద, యునాని వైద్యంలో వాడతారు. ఇది దగ్గు, ఎనీమియా, జలుబు లాంటి వాటిని నివారిస్తుంది. తేనెటీగల మైనాన్ని కొవ్వొత్తుల తయారీకి, తోళ్ల పరిశ్రమలోనూ వాడతారు. 

లక్క

లక్క టకార్డియా లక్క లేదా రాసిఫర్ లక్క అనే కీటకం శరీరం నుంచి స్రవిస్తుంది. ఇది తుమ్మ, రేగు, రావి, మామిడి, సాల్ లాంటి వృక్షాలపై పెరుగుతుంది. కీటకం చెట్ల రసాలను పీల్చుకుని రక్షణ కోసం లక్కను విడుదల చేస్తుంది. ఈ లక్కను చెట్ల నుంచి తీసి శుభ్రపరిచి అనేక రకాలుగా ఉపయోగిస్తారు. దీన్ని సీలింగ్ ఏజెంట్ గా, ప్రింటింగ్ లో, పెయింట్స్, వార్నిష్ తయారీలో ఉపయోగిస్తారు. ఆభరణాలను నింపడానికి, ప్లాస్టిక్ వస్తువుల తయారీలో ఇన్సులేటర్ గా లక్క ఉపయోగపడుతుంది. 

సర్పాలు, పక్షుల ఆర్థిక ప్రాముఖ్యం

ఇవి పొలంలో ఎలుకల జనాభాను అదుపులో ఉంచి పంటను రక్షిస్తాయి. కొన్ని దేశాల్లో సర్పాల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. వీటి విషాన్ని యాంటి వీనమ్ తయారు చేయడానికి, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. సర్పాల చర్మాలను హాండ్ బ్యాగులు, బెల్టులు, కొన్ని దుస్తుల తయారీలో ఉపయోగిస్తారు. 

పక్షుల నుంచి మనకు మాంసం, గుడ్లు లభిస్తాయి. కోడి, బాతు, టర్కీ పక్షి లాంటివి మనకు ఉపయోగపడతాయి. కోళ్లలో రోడ్ ఐలెండ్, లెగ్ హరన్ జాతి కోళ్లను పెంచుతున్నారు. ఆహారం, సంతానోత్పత్తి కోసం పక్షులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలసపోతాయి. సైబీరియా కొంగ రష్యా నుంచి భారత దేశానికి వలస వస్తుంది. పక్షులను సహజ పరిస్థితుల్లో పరిరక్షించే ప్రదేశాన్ని శాంక్చుయరీ అంటారు. పక్షులకు కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి, పరిరక్షించే ప్రదేశాన్ని ఎవియరీ అంటారు.

క్షీరదాల ఉపయోగం 

క్షీరదాల్లో ఆవు, గేదె, గుర్రం, మేక, గొర్రె, పంది లాంటి జంతువులు మానవుడికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆవు, గేదెల నుంచి పాలు లభిస్తున్నాయి. కొన్ని పశువులు వ్యవసాయంలో ఉపయోగపడుతున్నాయి. మేకలు, గొర్రెల నుంచి పాలు, మాంసం, తోలు లభిస్తున్నాయి. గొర్రె శరీరం మీద పొడవుగా, బిరుసుగా, నిటారుగా ఉండే రోమాలను ద్వితీయ రోమాలు లేదా ప్లీస్ అంటారు. వీటి నుంచి ఉన్ని దుస్తులను తయారు చేస్తారు. స్పెయిన్ దేశానికి చెందిన మెరీనో జాతి, న్యూజిలాండ్ దేశానికి చెందిన కోరిడెల్ జాతి గొర్రెల నుంచి మేలు రకం ఉన్ని లభిస్తుంది. తోలుకు కొరాకుల్ జాతి గొర్రె ప్రసిద్ధిచెందింది. 

పందులను ముఖ్యంగా మాంసం కోసం పెంచుతారు. ఇవి మిగతా జంతువుల కంటే త్వరగా పెరుగుతాయి. ప్రత్యుత్పత్తి శక్తి ఎక్కువ, ఖర్చు తక్కువ. పంది మాంసాన్ని ఫోర్క్ అంటారు. దేసి గోరి రకాలు భారతదేశంలో ప్రసిద్ధి. బెర్క్ షైర్, యార్క్ షైర్, లాండ్ రేస్ రకాలు విదేశాల్లో ప్రసిద్ధి చెందాయి.

గుర్రాలు రవాణాకు, వినోదానికి ఉపయోగపడతున్నాయి. మధ్య ఆసియా, రష్యా దేశాల్లో నివసించే ప్రిజివాల్ స్కి గుర్రాలను మచ్చిక చేసిన గుర్రాల పూర్వీకులుగా భావిస్తారు. మగ గాడిద, ఆడ గుర్రం సంకర ఫలితంగా ఏర్పడిన జీవిని మ్యూల్ అంటారు. ఆడ గాడిద, మగ గుర్రం సంకర ఫలితంగా ఏర్పడ్డదాన్ని హిన్ని అంటారు. మ్యూల్స్ వంధ్య జీవులు. ఇవి పర్వత ప్రాంతాల్లో బరువులు మోయడానికి ఉపయోగపడతాయి. 

నిమ్నస్థాయి జంతువుల ప్రయోజనాలు

నిమ్నస్థాయి జంతువులైన ప్రోటోజోవాలు, స్పంజికలు, మొలస్కా జీవులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రోటోజోవా వర్గంలోని ఫారామిని ఫెరిడా, రేడియోలేరియా విభాగ జీవులు కవచంతో ఉంటాయి. ఇది కాల్షియం కార్బొనేట్, సిలికాన్తో నిర్మితమై ఉంటుంది. ఈజీవులు చనిపోయిన తర్వాత వీటి అస్థిపంజరాలు సముద్రం ఆడుగుకు చేరి ఓషన్ ఊజ్ గా ఏర్పడి, గట్టిపడి శిలలుగా ఏర్పడతాయి. ఇలాంటి రాయిలాంటి నిర్మాణాలతో కట్టడాలను నిర్మిస్తారు. ఇవి పరిశ్రమల్లో మెరుగు పెట్టడానికి, ఆకురాయిలా వాడటానికి కూడా ఉపయోగపడుతున్నాయి.

సముద్రాల్లో నివసించే స్పంజికల అస్థిపంజరం కంటకాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కంటకాలు కాల్షియం కార్పొనేట్, సిలికాన్, స్పాంజిన్ తంతువులతో నిర్మితం. స్పంజికలు మరణించిన తర్వాత కంటకాలు సముద్రం అడుగుభాగానికి చేరి అడ్డుగోడల్లో తయారవుతాయి. ఈ ప్రదేశం అనేక జంతువులకు ఆవాసంగా ఉంటుంది. మొలస్కా జంతువులు మానవుడికి ఆహారం, అలంకరణ వస్తువులుగా ఉపయోగపడతాయి. వీటిలో రెండు కల్పాలుండే ద్వికవాటులైన ఆల్చిప్ప, ఆయిష్టర్లు ఆహారంగా ఉపయోగపడతాయి. మొలస్కా జంతువుల పైన ఉండే కర్పరాలను ఆటబొమ్మలు, అలంకరణ వస్తువుల తయారీకి, కోళ్లకు ఆహారం, రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ముత్యాలు మొలస్కా జీవులైన ముత్యపు చిప్పలు లేదా పెరల్ ఆయస్టర్ల నుంచి లభ్యమవుతాయి. ఈ జీవుల కర్పరంలోకి ఇసుక రేణువుల లాంటివి చేరినప్పుడు దాని చుట్టూ కాల్షియం కార్బొనేటు స్రవించి ముత్యంలా మారుతుంది.