మొక్కల్లో పరిసరానుగుణ్యత

మొక్కలు వివిధ పరిసరాల్లో నివసిస్తూ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ దేహభాగాల్లోను, జీవన విధానాల్లోను మార్పు చేసుకోవడాన్నే పరిసరానుగుణ్యత అంటారు.

నీటిలో ఉండే మొక్కలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి. 1) నీటిపై తేలే మొక్కలు. ఉదాహరణ పిస్టియా (అంతర తామర), ఐకార్నియా, ఉల్ఫియా 2) నీటిలో నాటుకుని పైకి తేలే మొక్కలు. ఇవి వేర్ల సహాయంతో భూమిలో నాటుకుని పొడవైన పత్ర వృంతాల సహాయంతో నీటిపై తేలుతుంటాయి. ఉదాహరణ కలువ, తామర మొక్కలు. 3) పూర్తిగా నీటిలో ఉండే మొక్కలు. వీటికి ఉదాహరణ హైడ్రిల్లా, వాలిస్ నేరియా, యుట్రిక్యులేరియా. ఈ నీటి మొక్కల్లో అనేక అనుకూలనాలు కనిపిస్తాయి. పిస్టియా, ఐకార్నియాల్లో నీటిమీద తేలడానికి సమతూకం జరిపే వేళ్లు ఉన్నాయి. నీటి మొక్కల కాండాల్లో గాలిగదులు ఉండి గాలిని నిల్వ చేస్తాయి. ఇవి మొక్క నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. తామర మొక్క పత్రాలపైన మైనపుపూత ఉంటుంది. ఇది పత్రాలపై నీరు నిల్వ ఉండకుండా, పత్రరంధ్రాలు మూసుకుపోకుండా సహాయపడుతుంది. కొన్ని నీటి మొక్కల్లో పత్రాలు చీలి ఉండి నీటి ప్రవాహానికి అనుగుణంగా ఉంటాయి. నీటి మొక్కల్లో వేరువ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండదు.

ఎడారి మొక్కలు 

నీరు అతి తక్కువగా ఉండే ప్రదేశాల్లో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అంటారు. నాగజెముడు, కాక్టస్, బ్రయోఫిల్లమ్, కలబంద మొదలైనవి వీటికి ఉదాహరణ. ఈ మొక్కల వేళ్లు లోతుగా ఉన్న నీటిని పీల్చుకోడానికి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. నాగజెముడు (ఒపన్షియా) మొక్కలో కాండం పైనున్న పత్రాలు బాష్పోత్సేకాన్ని తగ్గించుకోడానికి ముళ్లలా మారి ఉంటాయి. దీనిలో కాండం ఆహారం తయారుచేసుకోవడానికి వీలుగా ఆకుపచ్చగా ఉంటుంది. కలబంద, బ్రయోఫిల్లమ్ మొక్కలు నీటిని పత్రాల్లో నిల్వ చేసుకుంటాయి. మరికొన్ని నీటిని కాండాల్లో నిల్వ చేసుకుంటాయి. ఈ అనుకూలనాలన్నీ నీటి పొదుపుకు సంబంధించినవి. 

జంతువుల్లో పరిసరానుగుణ్యత

వివిధ పరిసరాల్లో నివసించే జంతువులు అక్కడి పరిస్థితులకు అనుకూలంగా తమ శరీర నిర్మాణాన్ని మార్పిడి చేసుకున్నాయి. నీటిలో నివసించే చేపలకు నీటిలో కరిగిన ఆక్సిజనను పీల్చుకోవడానికి మొప్పలు ఉన్నాయి. వీటి శరీరం నీటిలో చలనానికి ఉపయుక్తంగా ఉంటుంది. చేపలోని తోక దిశను మార్చుకోవడానికి, రెక్కలు సమతాస్థితిని నిలపడానికి, ఈదడానికి ఉపయోగపడతాయి. కప్ప నీటిలో, నేలపైన నివసిస్తుంది. కాబట్టి దీన్ని ఉభయజీవి అంటారు. కప్పకు ఉండే రెండు జతల కాళ్లు నేలపై దుమకడానికి ఉపయోగపడుతుంది. వెనక కాళ్ల మధ్య ఉండే చర్మం తెడ్లలా పనిచేసి నీటిలో ఈదడానికి సహాయపడుతుంది. కప్పకు నేల మీద శ్వాసించడానికి ఒక జత ఊపిరితుత్తులు ఉంటాయి. నీటిలో ఉన్నప్పుడు తడిగా ఉండే చర్మం సహాయంతో శ్వాసిస్తుంది. పాముల శరీరంపై ఉండే పొలుసులు పాకడానికి సహాయపడతాయి. పక్షుల్లో ముందరి జత చలనాంగాలు రెక్కలుగా మారి గాలిలో ఎగరడానికి ఉపయోగపడతాయి. రెక్కల్లో ఉండే ఈకలు గాలిని అడ్డుకుని తెరచాపలా ఉంటాయి. ఎముకలు బోలుగా గాలితో నిండి ఉండి శరీర బరువు తగ్గించడానికి, తేలికగా ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి. ఎడారిలో నివసించే జంతువులు తమ శరీరం ద్వారా నీటిని నష్ట పోకుండా అనేక అనుకూలనాలను చూపుతాయి. ఒంటె ఆహారం దొరికినప్పుడు ఎక్కువగా తిని జీర్ణమైన ఆహారాన్ని కొవ్వు రూపంలో దాచుకుంటుంది. ఆహారం దొరకనప్పుడు దీనిని కరిగించుకుని శక్తిని, నీటిని పొందుతుంది. నీటిని కూడా నేరుగా తన శరీరంలో దాచుకుంటుంది. శరీరంపై వెంట్రుకలుంటాయి. స్వేద రంధ్రాలు ఉండవు. దీనివల్ల ఒంటెకు చెమట పట్టదు. ఇసుక ముక్క రంధ్రాల్లో దూరకుండా అవి సన్నగా, లోపల ఉంటాయి. కనురెప్పలు ముందుకు వచ్చి ఇసుక నుంచి కాపాడతాయి. పాదాల అడుగున వెడలైన మెత్తలు ఉండి ఇసుకలో నడపడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకమైన అనుకూలనాలు ఉండడం వల్ల ఒంటెను ఎడారి ఓడ అంటారు.

ధ్రువ ప్రాంతాల్లో ఉండే జంతువులైన ధ్రువపు ఎలుగు బంట్లు, సీళ్లు, పెంగ్విన్లు కూడా అనేక అనుకూలనాలను చూపుతాయి. వీటిలో ధ్రువపు ఎలుగుబంటి శరీరంపై ఉన్న దట్టమైన ఉన్ని శరీరం నుంచి వేడి బయటకు పోకుండా, బయటి చలి శరీరానికి తగలకుండా కాపాడుతుంది. పాదాల అడుగున ఉన్న వెంట్రుకలు మంచుపై నిలదొక్కుకోవడానికి, ముందరి పాదాల మధ్య ఉన్న చర్మం ఈదడానికి ఉపయోగపడతాయి. శీతాకాలంలో అధిక చలి నుంచి రక్షించుకోవడానికి ఇవి శీతాకాలపు నిద్రను చూపిస్తాయి. ఈ సమయంలో ఇవి కదలకుండా పడుకుని శ్వాసక్రియను నెమ్మదిగా జరుపుకొంటూ నిల్వ ఉన్న కొవ్వును శరీర అవసరాలకు వాడుకుంటాయి.