పొలం దున్నడం, విత్నఆలను చల్లడం, నాట్లు వేసి, కలుపు తీసి, ఎరువులు పోసి, పంట కోయడం వంటివి వ్యవసాయంలోని వివిధ కార్యకలాపాలు. పంటలు పండటానికి సారవంతమైన నేల అవసరం. దున్నడం వల్ల నేల గుల్లబారి, మెత్తగా ఉంటుంది. నీరు అన్ని వైపులకూ ప్రవహిస్తుంది. నేల ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటుంది. వేర్లు బాగా పెరుగుతాయి. హానికర కీటకాలు నాశనమవుతాయి. నేల పైపొర మెత్తగా, వృక్ష, జంతు శిధిల పదార్థాలతో, నలుపు రంగులో ఉంటుంది. ఇలాంటి మట్టిని హ్యుమస్ అంటారు. ఇది సారవంతమైంది. మొక్కల పెరుగుదలకు అనుకూలం. ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో కురిసే భారీ వర్షాలవల్ల నేల కోతకు గురవుతుంది. దీనివల్ల నేలపై ఉన్న సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. కొండ ప్రాంతాల్లో చెట్లను, మైదానాల్లో గడ్డి మొక్కలను పెంచడం వంటి చర్యల ద్వారా నేల కోతను అరికట్టి భూమిలోకి నీరు ఇంకేలా చేయవచ్చు. పంట దిగుబడి పెరగడానికి మొక్కలకు పోషక పదార్థాలు కావాలి. నేలలో ఉండే పోషక పదార్థాలను ఖనిజ లవణాలు అంటారు. నీటిలో కరిగిన లవణాలను మాత్రమే మొక్కలు వేర్ల సహాయంతో పీల్చుకుంటాయి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, బోరాన్, ఇనుము, మాంగనీస్, జింకు, క్లోరిన్, సోడియం వంటివి మొక్కలకు కావలసిన మూలకాలు. వీటిలో నైట్రోజన్ ముఖ్యమైంది. మొక్కలు పెరగడానికి, ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండటానికి ఇది అవసరం. ఇది లోపిస్తే మొక్కల్లో పెరుగుదల తగ్గుతుంది. ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారతాయి. చిక్కుడు జాతికి చెందిన మొక్కల వేరు బెడి పెల్లో ఉండే రైజోబియం బాక్టీరియా గాల్లోని నత్రజనిని భూమిలో స్థాపిస్తాయి. భాస్వరం (పాస్ఫరస్) మొక్కలకు కాండం గట్టిపడి బలంగా పెరగడానికి, పూలు, కాయలు ఏర్పడి గింజలు బలంగా తయారయ్యేందుకు అవసరం. భాస్వరం వల్ల మొక్కలకు వివిధ తెగుళ్ల బారినుంచి రక్షణ కలుగుతుంది. ఇది లోపిస్తే మొక్కలు పొట్టిగా ఉండి దిగుబడి తగ్గుతుంది.

మొక్కల్లో పిండి పదార్థం తయారు కావడానికి, రోగ నిరోధకశక్తి ఏర్పడేందుకు, అధిక వేడి, చల్లదనాన్ని తట్టుకోవడానికి పొటాషియం తోడ్పడుతుంది. పొటాషియం లోపం వల్ల ఆకుల్లో తెల్లవి మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ముడతలు పడి వాటి అంచులు ఎండిపోతాయి. ఏ పోషక పదార్థం లేకపోయినా మొక్కల్లో పెరుగుదల లోపిస్తుంది. మొక్కలకు కావలసిన పోషక లవణాలను ఇచ్చే పదార్థాలను ఎరువులు అంటారు. ఇవి రెండు రకాలు. 1) సహజ లేదా స్వాభావిక ఎరువులు, 2) కృత్రిమ లేదా రసాయనిక ఎరువులు. సహజ ఎరువులు ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారవుతాయి. పశువుల వెంట, కంపోస్టు, గింజల నుంచి నూనె తీయగా మిగిలిన పిండి, ఎముకల పొడి మొదలైనవి వీటికి ఉదాహరణ. సహజ ఎరువులు లవణాలను భూమిలోకి విడుదల చేయడానికి కొంత సమయం అవసరం. కర్మాగారాల్లో రసాయన పదార్థాలతో తయారు చేసిన వాటిని రసాయనిక ఎరువులు అంటారు. ఇవి లవణాలను తొందరగా మొక్కకు అందిస్తాయి. అమోనియం సల్ఫేటు, యూరియా, సూపర్ ఫాస్పేటు వంటివి రసాయన ఎరువులకు ఉదాహరణ. రసాయనిక ఎరువుల్లో మిశ్రమ ఎరువులు ఒకటి కంటే ఎక్కువ పోషక పదార్థాలను మొక్కలకు అందిస్తాయి. ఎరువులు వేసినప్పుడు మొక్కలకు తగినంత నీటిని సరఫరా చేయాలి.

మొక్కలను ఆశించే కీటకాలను నివారించే పదార్థాలను కీటక నాశనులు (పెస్టిసైడ్లు) అంటారు. బాక్టీరియాలను నివారించడానికి వాడే పదార్థాలను బ్యాక్టీరియోసైడ్లు అని బూజులను (శిలీంధ్రాలను) నివారించేవాటిని ఫంగిసైడ్లు అంటారు. బ్రాడ్ కాస్టింగ్ పద్ధతిలో విత్తడానికి దున్నిన నేలలో విత్తనాలను వెదజల్లుతారు. ఇవి మొలకెత్తిన తరువాత ఒత్తుగా ఉన్న చోటు నుంచి వీటిని తీసివేసి, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో నాటుతారు. పప్పులు, వేరుశనగ గింజలను ఈ పద్దతిలో విత్తుతారు. 

కలుపు మొక్కల నివారణ:

సాగు మొక్కలతో పాటు పోటీ పడి పెరిగే అవసరం లేని మొక్కలను కలుపు మొక్కలు అంటారు. వీటిని భౌతిక, రసాయనిక, జీవ పద్ధతుల ద్వారా నియంత్రిస్తారు. దున్నడం, పనిముట్లతో పెరికి వేయడం, చేత్తో తీసివేయడం వంటివి భౌతిక పద్దతులు. రసాయనిక పద్ధతుల్లో కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగపడే రసాయనాలను గుల్మనాశకాలు లేదా హెర్బిసైడ్స్ అంటారు. 2, 4 - డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం (2, 4-D) అనేది వీటికి ఉదాహరణ. జీవక్రియా పద్ధతుల్లో కలుపు మొక్కలను సహజ శత్రువులైన కీటకాలను ప్రవేశపెట్టి నాశనం చేస్తారు. పంటమార్పిడి విధానం ద్వారా కూడా కలుపు మొక్కలను నియంత్రించవచ్చు. 

తెగుళ్లు-నియంత్రణ:

వివిధ పంట మొక్కలకు బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు, కీటకాల వల్ల అనేక తెగుళ్లు వస్తాయి. కీటకాలు, గొంగళి పురుగు దశలో మొక్కలకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి మెత్తటి ఆకులను తినేస్తాయి. కాండాలను, కాయలను గొంగళి పురుగులు తొలచివేస్తాయి. తెగుళ్లను నియంత్రించడానికి పొడి రూపంలో ఉండే మందులను డస్టర్ అనే సాధనంతో, ద్రవ రూపంలో ఉండే మందులను ప్రేయర్ అనే సాధనంతో చల్లుతారు. విత్తనాలను విత్తేముందు రసాయనాలతో శుద్ధి చేయడం, తెగులు సోకిన మొక్కలను నాశనం చేయడం, పంట మార్పిడి చేయడం కలుపు మొక్కలను ఏరివేయడం, వ్యాధి నిరోధక శక్తి ఉన్న మొక్కలను పెంచడం వంటి పద్ధతుల ద్వారా పంటలపై వచ్చే వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులను నియంత్రించవచ్చు. 

మిరపకు సోకే తెగుళ్లు:

మిరప మొక్కకు శిలీంధ్రాలు (ఫంగస్), బ్యాక్టీరియా, కీటకాల వల్ల పలు రకాల తెగుళ్లు సోకుతాయి. 

మిరపను ఆశించే తెగుళ్లు - నివారణ 

ఫంగస్ ద్వారా సోకే తెగుళ్లు

ఎ) మొదలుకుళ్లు తెగులు - తెగులు సోకిన మొక్కలను కాల్చేయాలి 

బి) బూడిద తెగులు - గంధకపు పొడి చల్లాలి

సి) కాయకుళ్లు-కొమ్మఎండుతెగులు - డైతేన్ ఎం-45 మందు చల్లాలి 

బ్యాక్టీరియావల్ల సోకే తెగుళ్లు

ఎ) వేరుపురుగు - వేప పిండిని పొలంలో చల్లాలి 

బి) పేరుబంక - మోనోక్రోటోఫాస్ చల్లాలి

సి) కాయతొలిచే పురుగు - ఎండోసల్ఫాన్ చల్లాలి 

నిమ్మజాతి మొక్కలకు సోకే తెగుళ్లు:

నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ వంటి మొక్కలను నిమ్మజాతి మొక్కలంటారు. వీటి ద్వారా మనకు విటమిన్-సి లభిస్తుంది. చీనీ (బత్తాయి) మొక్కలకు వైరస్ల వల్ల ట్రస్టీజా, మొజాయిక్, ఎల్లో కార్కివీన్ వంటి తెగుళ్లు సంభవిస్తాయి. ట్రస్టీజా తెగులుకు ఏసిడ్స్ అనే కాటకాలు వాహకాలుగా ఉంటాయి. మొజాయిక్ తెగులులో ఆకుల్లో పసుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఎల్లో కార్కివీన్ తెగులు కస్క్యూటీ అనే పరాన్న ఔషధ మొక్క వల్ల కూడా వ్యాపిస్తుంది. నిమ్మజాతి మొక్కల్లో జంథోమొనాస్ సిట్రి అనే బాక్టీరియా వల్ల సిట్రస్ కాంకర్ (గజ్జి తెగులు) వస్తుంది. లీ మైనర్, సిట్రస్ బటర్ ఫ్లై, ఏసిడ్స్, నల్లిపురుగులు వంటి కీటకాలు ఈ మొక్కలను ఆశిస్తాయి. వీటి నివారణకు మొనోక్రోటోఫాస్ అనే రసాయనాలను చల్లవచ్చు. 

ద్రాక్ష, కొబ్బరి మొక్కలకు సోకే తెగుళ్లు:

ద్రాక్ష మొక్కలపై శిలీంధ్రం వల్ల డైనీమిల్ డ్యూ అనే తెగులు సోకుతుంది. వేన్ గల్ బీటిల్ అనే కీటకం కాండం చుట్టూ బెరడును తొలిచేస్తుంది. కొబ్బరి చెట్లలో రైనోసిరాస్ బీటిల్ అనే కీటకం కాండం చివర ఉండే లేత ఆకులను, పుష్పాలను నాశనం చేస్తుంది. వైరస్ వల్ల కొబ్బరిలో విక్ట్ అనే తెగులు సోకుతుంది.

పత్తి, చెరకు మొక్కలకు సోకే తెగుళ్లు:

పత్తి మొక్కలను అనేక రకాల కీటకాలు ఆశిస్తాయి. ఈ కీటకాలన్నీ గొంగళి పురుగుదశలో పైరుకు నష్టాన్ని కలిగిస్తాయి. పత్తిని ఆశించే పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ఎర్రనల్లి పురుగు వంటివి రసాన్ని పీల్చే పురుగులకు ఉదాహరణ. మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు, గులాబి రంగు పురుగు వంటివి కాయ తొలిచే పురుగులకు ఉదాహరణ. పత్తిని ఆశించే తెగుళ్లఓ ముఖ్యమైనవి నల్లమచ్చ, వేరుకుళ్లు, ఆకుమచ్చ, ఎండుతెగుళ్లు, చెరకును కాండం తొలిచే పురుగు, పిండినల్లి పొలుసు పురుగు, వేరుపురుగు, దూదేకుల పురుగు వంటివి ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. శిలీంధ్రాల వల్ల కీటక లేదా కొరడా తెగులు, ఎర్రకుళ్లు వంటివి సోకుతాయి.