స్వాతంత్ర్యం కనుచూపు మేరకు వచ్చినా, సంస్థానాల సమస్య జాతీయోద్యమ నాయకులకు భయాందోళనలు కలిగించింది. సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో విలీనం కావని, వాటిని విలీనం చేయాలంటే తీవ్ర ప్రతిఘటన చర్యలకు దిగుతాయని ఆందోళన చెందారు. భారత దేశంలో అంతర్యుద్ధం తప్పదని భావించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడి, స్వదేశీ సంస్థానాలను భారత్ లో విలీనం చేసేందుకు నెహ్రూ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నడుం బిగించింది. స్వదేశీ సంస్థానాలను ఇండియాలో విలీనం చేసేందుకు తాత్కాలిక ప్రభుత్వం 'స్టేట్స్ డిపార్ట్మెంట్ శాఖను ఏర్పాటుచేసింది. ఈ శాఖకు మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను, కార్యదర్శిగా వి.పి. మీననను నియమించారు. సర్దార్ పటేల్ దేశం సమైక్యంగా ఉండాలని, స్వదేశీ సంస్థానాలు తమ క్షేమం, దేశ క్షేమం దృష్ట్యా భారత దేశంలో విలీనం కావడం శ్రేయస్కరమని సంస్థానాధిపతులకు విజ్ఞప్తి చేశారు. సంస్థానాధీశుల్లో జాతీయభావం, దేశభక్తి, త్యాగనిరతి రేకెత్తించి, శాంతియుతంగా స్వదేశీ సంస్థానాలను భారత్ లో విలీనం చేశారు. ఈ దిశగా పటేల్ ప్రదర్శించిన బుద్ధికుశలత, శక్తిసామర్థ్యాలు, ధైర్యసాహసాలు శాఘనీయం, స్వదేశీ సంస్థానాలను భారత్ లో విలీనం చేయడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ను “ఇండియన్ బిస్మార్క్'గా పిలిచారు. 1947 ఆగస్టు 15 నాటికి జునాగడ్, హైదరాబాద్, కాశ్మీర్ తప్ప మిగిలిన స్వదేశీ సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్ లో చేరాయి. ఈ మూడు సంస్థానాలను మాత్రం బలం ప్రయోగించి ఇండియన్ యూనియన్లో చేర్పించాల్సి వచ్చింది. 

జునాగఢ్: 

కథియావాడ్ (గుజరాత్) ప్రాంతంలో ఇది ఒక చిన్న స్వదేశీ సంస్థానం. ఇక్కడి జనాభాలో సుమారు 75 శాతం హిందువులు, అయితే పాలకుడు ముస్లిం మతస్థుడు. హిందువులను రాజ్యం నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. జునాగఢ్ పాకిస్థాన్‌లో చేరుతుందని ప్రకటించాడు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని పంపడంతో జునాగఢ్ నవాబు పాకిస్థాన్‌కు పారిపోయాడు. జునాగఢ్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సుమారు 2 లక్షల ముందిలో కేవలం 91 మంది మాత్రమే పాకిస్థాన్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో దేశంలో జునాగఢ్ విలీనమైంది. 

హైదరాబాద్: 

భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలన్నింటిలో హైద్రాబాద్ సంస్థానం చాలా పెద్దది. మతపరంగా చూస్తే నూటికి 88 శాతం హిందువులు. మిగతావారు ముస్లిములు, క్రైస్తవులు, ఇతర మతాలవారు. ఆనాటి సంస్థానాధిపతి మీర్ ఉస్మాన్ అలీఖాన్. నిజాం అండ చూసుకుని ముస్లిములు నిరంకుశంగా వ్యవహరించేవారు. దీంతో 'జాయిన్ ఇండియా' ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమాన్ని దారుణంగా అణచివేయడానికి నిజాం పూనుకున్నాడు. దీనికితోడు 'మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్' అనే మత సంస్థను, ఖాశీంరజ్వీ నాయకత్వంలో రజాకార్లు అనే సాయుధ దళాన్ని ఏర్పాటుచేశాడు. రజాకార్లు నిజాంకు అండగా ఉంటూ హిందువులపై అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు చేయడంతో శాంతి భద్రతలు క్షీణించాయి. సామాన్య ప్రజల ఆస్తులకు, మాన, ప్రాణాలకు రక్షణ కరవైంది. ఇలాంటి పరిస్థితుల్లో సైనిక చర్య తప్పు, భారత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేకపోయింది. భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 18న సైనికచర్య ప్రారంభించింది. దీంతో చెప్పుకోదగిన ప్రతిఘటన లేకుండానే నిజాం సైన్యాలు లొంగిపోయాయి. సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైంది. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి సైనిక గవర్నర్ గా సెప్టెంబర్ 18న పదవీ బాధ్యతలు స్వీకరించారు. నైజాం నిరంకుశత్వం నుంచి విముక్తి లభించినందుకు సంస్థాన ప్రజలు వేడుకలు జరుపుకొన్నారు. ఈ సైనిక చర్యను సర్దార్ పటేల్ “పోలీస్ చర్య'గా పేర్కొన్నారు. సైనిక పరిభాషలో దానికి 'ఆపరేషన్ పోలో' అని పేరు. 

కాశ్మీర్: 

కాశ్మీర్ సంస్థాన పాలకుడు మహారాజా హరిసింగ్, మతపరంగా చూస్తే ముస్లిములు అధిక సంఖ్యలో ఉన్నా, హిందువులు ప్రధాన ప్రభుత్వోద్యోగాలు, సైనిక పదవుల్లో ఉన్నారు. కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేస్తే ఆ చర్య జమ్మూ హిందువులకు, ఇండియాలో విలీనం చేస్తే కాశ్మీర్ లోని ముస్లిములకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ను తమ దేశంలో విలీనం చేయాలని పాకిస్థాన్ రాజా హరిసింగ్ పై ఒత్తిడి తెచ్చింది. కాశ్మీర్ పై పాకిస్థాన్ బలప్రయోగం చేయడానికి నిశ్చయించి, 1947 అక్టోబర్ 22న దండయాత్ర ప్రారంభించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాశ్మీర్ రాజా హరిసింగ్ ఇండియా సహాయాన్ని కోరాడు. జమ్మూ-కాశ్మీర్ ను ఇండియాలో విలీనం చేస్తే, సహాయం చేయడానికి వీలవుతుందని, భారత ప్రభుత్వం తెలియజేయగా 1947 అక్టోబర్ 26న భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు విలీనీకరణ పత్రంపై సంతకం చేశాడు. పాకిస్థాన్ దాడి నుంచి కాశ్మీరు సంరక్షించడానికి భారతీయ సైన్యాలు కాశ్మీర్ లోనికి ప్రవేశించి పాకిస్థాన్ సైన్యాన్ని తరిమివేయడం ప్రారంభించాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడైన షేక్ అబ్దుల్లా దీన్ని సమర్ధించాడు. ముస్లిం హక్కుల పరి రక్షణకు షేక్ అబ్దుల్లా 'అల్ జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్' అనే సంస్థను 1932లో ఏర్పాటు చేశారు. దాన్నే 'నేషనల్ కాన్ఫరెన్స్'గా తర్వాత మార్చారు. జమ్మూకాశ్మీర్ ఇండియాలో విలీనమై, అంతర్భాగమైనా అప్పటికే 1/3 వంతు పాకిస్థాన్ ఆక్రమిత భూభాగంగా ఉంది. దీన్నే ఆజాద్ కాశ్మీర్ లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు. జవహర్‌లాల్ నెహ్రూ ఈ సమస్యను బక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశారు. ఐ.రా.స. నిర్ణయం ప్రకారం 1949 జనవరి 1న ఇండియా, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ సమస్య అపరిష్కృతంగానే ఉంది.

సంస్థానాల విలీనం పూర్తిచేసిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం ఆయా సంస్థానాలను పునఃసమీక్షించారు. చిన్నచిన్న సంస్థానాలను వాటి సమీపంలోని పెద్ద రాష్ట్రాల్లో కలిపారు. వాటి ఆర్థిక, భౌగోళిక తదితర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సర్దుబాటు చేశారు. సుమారు 217 సంస్థానాలను బ్రిటిష్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో కలిపారు. వీటిని 'ఎ' తరగతి రాష్ట్రాలంటారు. మహారాష్ట్ర, గుజరాత్ లోని సంస్థానాలను బొంబాయి, మద్రాస్ పరిసరాల్లోని వాటిని మద్రాస్, ఒరిస్సా ప్రాంతంలోని సంస్థానాలను ఒరిస్సా రాష్ట్రంలో కలిపారు. వీటి పాలకులను గవర్నర్లు అంటారు. మరికొన్ని సంస్థానాలను కలిపి రాష్ట్రాలుగా ఏర్పరిచారు. సుమారు 275 చిన్న సంస్థానాలను కలిపి అయిదు కొత్త రాష్ట్రాలుగా ఏర్పరిచారు. 

రాజస్థాన్, మధ్య భారత్, సౌరాష్ట్ర మొదలైన వాటిని 'బి' తరగతి రాష్ట్రాలంటారు. వీటికి పరిపాలకులు రాజప్రముఖులు. సంస్లానాధిపతులనే రాజ ప్రముఖులుగా నియమించారు. మరికొన్ని సంస్థానాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, భోపాల్ మొదలైన వాటిని 'సి' తరగతి రాష్ట్రాలంటారు. వీటి అధిపతులుగా 'చీప్ కమిషనర్ల'ను నియమించారు. కొన్ని ద్వీపాలను 'డి' తరగతి రాష్ట్రాలుగా చేసి, వాటి పరిపాలనా బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే నిర్వహించింది. అండమాన్, నికోబర్, మినికాయ్ మొదలైన దీవులు. ఈ విధంగా ధైర్యంతో, దృఢ సంకల్పంతో దేశ సమైక్యతను సాధించడంలో ఆనాటి ఉప ప్రధాని, హోంశాఖామంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అమోఘమైంది. ఆయన సాధించిన ఘన విజయాన్ని 'రక్తపాతరహిత విప్లవం'గా కొనియాడారు.