మొక్కలు మానవుడికి ప్రాథమిక అవసరాలైన ఆహారం, ఔషధాలు, దుస్తులు లాంటివి సమకూరుస్తున్నాయి. అనేక రకాల మొక్కలను మానవుడు సాగుచేసి తన అవసరానికి వినియోగించుకుంటున్నాడు. ప్రస్తుతం సాగు చేస్తున్న మొక్కలన్నీ వన్యజాతి మొక్కల నుంచి ఉద్భవించినవే. మానవుడి రక్షణ, సహాయం పొందకుండా నివసించే మొక్కలను వన్యజాతి మొక్కలంటారు. ఇవి సాగు మొక్కలతో పోల్చితే ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఉంటాయి. ఈ మొక్కలకు వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. మొక్కల నుంచి లభ్యమయ్యే ఉత్పత్తులనుబట్టి వీటిని ధాన్యాలు, నార, ఔషధాలు, కలపనిచ్చే మొక్కలని విభజించవచ్చు. 

ధాన్యాలనిచ్చే మొక్కలు

మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉపయోగపడేవి ధాన్యాలు. ఇవి గడ్డిజాతి మొక్కలు. గింజల్లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, తక్కువ మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న లాంటివి ధాన్యాలను ఇచ్చే మొక్కలు.

ప్రపంచంలో సగం కంటే ఎక్కువ జనాభాకు వరి ముఖ్య ఆహార పదార్థం. వరి ఏకవార్షిక మొక్క. ఇది గడ్డి జాతికి చెందింది. ఆసియా, యూరప్, అమెరికాల్లో పండించే వరిని ఒరైజా సటైవా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. వీటిలో జపానిక, ఇండిక, జవానిక అనే మూడు ఉపజాతులు ఉన్నాయి. మనదేశంలో ఇండికా ఉపజాతి రకాన్ని సాగుచేస్తున్నారు. వరిని అన్నంగా తినడంతో పాటు దీనితో పిండివంటలు, ఇడ్లీ, దోసె లాంటి వాటిని తయారుచేస్తారు. వడ్లను వేడినీటిలో ఉడికించి ఎండబెట్టి, మిల్లు ఆడించి ఉప్పుడు బియ్యాన్ని తయారు చేస్తారు. తవుడు నుంచి వచ్చిన నూనె వంటల్లో ఉపయోగపడుతుంది. వరిగడ్డిని పశువుల మేతగా, ఊకను ఇటుకలను కాల్చడానికి ఉపయోగిస్తారు. స్థానికంగా వరిలో హంస, జయ, మసూరి, ఫల్గుణ లాంటి రకాలు ఉన్నాయి. భారత దేశంలోని కటక్ లో ఉన్న ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోను, ఫిలిప్పైన్స్ లోని మనిలాలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వరికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి.

వరి తర్వాత ఎక్కువగా ఉపయోగపడుతున్న మరో ధాన్యపు మొక్క గోధుమ. దీని శాస్త్రీయనామం ట్రిటికమ్ వల్గేర్. గోధుమ పిండిని చపాతీ, పూరి లాంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గోధుమ గడ్డిని పశువుల మేతగాను, ఇంటికప్పులకు, ప్యాకింగ్ పరిశ్రమలోను ఉపయోగిస్తారు. ట్రిటికమ్ ఏస్టివమ్ అనే గోధుమ రకాన్ని బ్రెడ్ వీట్ అని అంటారు. మొక్కజొన్న శాస్త్రీయనామం జియామేస్. దీన్ని ఆహారంగా, పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. ఆల్కహాల్, ప్లాస్టిక్ లాంటి వాటి తయారీలో కూడా మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ధాన్యాల్లో చిన్నగింజలతో కూడిన జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి వాటిని చిరుధాన్యలు అంటారు.

మాంసకృత్తులు, నూనెల మొక్కలు

పప్పు ధాన్యాలు లేదా అపరాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. శాకాహారులకు మాంసకృత్తులు వీటి నుంచే లభిస్తాయి. మాంసకృత్తులు శరీరం పెరుగుదలకు, నిర్మాణానికి అవసరం. పెసర, మినుము, కంది లాంటివి వీటికి ఉదాహరణ. నిత్యజీవితంలో ఉపయోగించే వంట నునెలు వేరుశెనగ, సన్ ఫ్లవర్, పామాయిల్, కొబ్బరి, నువ్వులు లాంటి మొక్కల నుంచి లభ్యమవుతాయి. వీటిలో సఫ్లవర్ నూనె అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో ఉంటుంది. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండి గుండె సంబంధ జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ నూనెలే కాకుండా మొక్కల నుంచి సువాసన నిచ్చే నూనెలు కూడా లభ్యమవుతాయి. నిమ్మ, లావెండరు నూనెలు, కర్పూరతైలం మొదలైనవి వీటికి ఉదాహరణ. వేపగింజల నుంచి వచ్చిన నూనె సూక్ష్మజీవ నాశకంగా ఉపయోగపడుతుంది. 

కలప, నారల మొక్కలు

కలప సాధారణంగా గృహనిర్మాణాలకు, గృహోపకరణాలకు, వ్యవసాయ పనిముట్లకు, పడవలు, వాహనాల తయారీకి ఉపయోగిస్తారు. రోజ్ వుడ్, సాలు, టేకు, వేపలాంటివి కలపనిచ్చే మొక్కలు. మొక్కలతో ఉత్పత్తి అయ్యే సన్నని పొడవాటి కేశాల లాంటి నిర్మాణాలను నార లేదా పీచు అంటారు. ఇవి మందమైన గోడలతో ఉండే నిర్జీవ కణాలు. గాసిపియం జాతికి చెందిన మొక్క పత్తి గింజల నుంచి మృదువైన కేశాల లాంటి పోగులు ఏర్పడతాయి. వీటిని దారాలుగా మార్చి వస్త్రాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. క్రొటాలేరియా జంషియా అనే మొక్క నుంచి జనపనార లభిస్తుంది. దీన్ని గోనెసంచులు, వలలు, తాళ్ల తయారీకి ఉపయోగిస్తారు. హైబిస్కస్ కెన్నాబినస్ అనే మొక్క నుంచి గోగునార లభిస్తుంది. దీన్ని కూడా గోనె సంచులు, తాళ్ల తయారీకి వాడతారు. కొబ్బరి శాస్త్రీయ నామం కోకస్ న్యూసిఫెరా. దీని ఫలాల నుంచి కొబ్బరి నార లభిస్తుంది. దీన్ని తాళ్లు, బ్రష్ లు, సంచుల తయారీకి వాడతారు. ఈ నారతో కుషన్లు, పరువులు, దిండ్లు లాంటి వాటిని తయారుచేస్తారు. 

ఔషధ మొక్కలు

మొక్కలు తాము తయారు చేసుకున్న రసాయన పదార్థాలను పత్రాలు, బెరడు, ఫలాలు, విత్తనాలు లాంటి భాగాల్లో నిల్వ చేసుకుంటాయి. వీటిని మనం నేరుగాగాని, శుద్ధిచేసిగాని ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఆయుర్వేద వైద్య విధానంలో మొక్కల నుంచి వచ్చే ఔషధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.

వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలు వివిధ మొక్కలను లవంగాలుగా వాడతారు. దాల్చిన మొక్క ఎండబెట్టిన బెరడును దాల్చిన చెక్కగా వాడతారు. కుంకుమ పువ్వు (సాఫ్రాన్)ను కీలం, కీలాగ్రం నుంచి సంగ్రహిస్తారు. ఇంగువను ఇంగువ మొక్క వేరు నుంచి సేకరించిన స్రావంతో తయారుచేస్తారు. సుగంధ ద్రవ్యాల్లో మిరియాలను సుగంధ ద్రవ్యాల రాజు (కింగ్ ఆఫ్ స్పైసిస్) లేదా బ్లాక్ గోల్డ్ ఆఫ్ ఇండియా అంటారు. యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి (క్వీన్ ఆఫ్ స్మైసిస్) అంటారు. శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియంలు కూడా పరోక్షంగా మొక్కల నుంచి లభిస్తాయి. కొన్నివేల సంవత్సరాల కిందట మొక్కలు భూమిలోకి కుంగి మట్టితో కప్పబడి పాక్షికంగా దహనం చెందడం, ఒత్తిడి కారణంగా శిలాజ ఇంధనాలుగా ఏర్పడ్డాయి.