భారతదేశంలో 1927 నాటికి అనేక రకాలుగా స్వాతంత్ర్యోద్యమం జరిగింది. ఈ సమయంలో హైదరాబాద్లో కొందరు మహ్మదీయ నాయకులు నిజాం పరోక్ష ఆశీస్సులతో హైదరాబాద్ లోని లోహిద్ మండీలో సమావేశమై నవాబ్ సదర్ యార్ జంగ్ అధ్యక్షతన ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్ అనే సంస్థను 1927 లో స్థాపించారు. ముస్లింల ప్రత్యేక హక్కులను కాపాడడం ఈ సంస్థ ముఖ్య ధ్యేయం. ఈ సంస్థ 1938 వరకు నామ మాత్రంగానే ఉండేది. 1938 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇస్లామిక్ థియాలజీ అండ్ స్టడీస్ ప్రొఫెసర్ మోల్వీ అబ్దుల్ ఖాదర్ సిద్దికి ఈ సంస్థకు అధ్యక్షుడైన తరువాతే దీని కార్యాచరణలో మార్పు వచ్చింది. ఈ సంస్థ ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం ఉద్దేశించిన అన్ని సంస్కరణలను వ్యతిరేకించింది. బహదూర్ జంగ్ అధ్యక్షుడయ్యాక ఇత్తే హాద్-ఉల్-ముస్లిమీన్ నిజాం కంటే తానే గొప్ప అని భావించడం మొదలైంది. కాంగ్రెస్ పై నిషేధం తొలగించడం గురించి చిర్చించినప్పుడు జంగ్ వ్యతిరేకించారు.

1940 సెపెప్టెంబరులో సయ్యద్ మహమ్మద్ హసన్ ఒక వాలంటరీ దళాన్ని ఏర్పాటు చేయాలని బహదూర్ జంగ్ కు సలహా ఇచ్చారు. దీని ప్రకారం రజాకార్లనే వాలంటీర్ల సంఘాలు హైదరాబాద్ రాజ్యమంతా వెలిశాయి. 30 మంది రజాకార్లకు నాయకునిగా ఒక సలార్, ప్రతి తాలూకాకు ఒక సలార్-ఎ-సగీర్ ఉంటారు. ప్రతి జిల్లాకు సలార్-ఎ-కబీర్ ఉంటాడు. కేంద్ర సంఘానికి అధ్యక్షుడిగా అప్సర్-ఎ-అలా ఉండేవారు. ఈ కేంద్ర సంఘం హైదరాబాద్ లో ఉండేది. రజాకార్లు ఖాకీ యూనిఫాం, నల్ల టోపీ ధరించేవారు. వారికి సైనిక శిక్షణ ఇచ్చేవారు. కత్తి, బాకు వారి ఆయుధాలు. 

రజాకార్లు

నిజాం ప్రభువు పోలీసు, మిలీటరి, రెగ్యులర్, ఇర్రెగులర్ కాకుండా రజాకార్ల సైన్యాన్ని సిద్ధపరిచాడు. మజ్లిస్ అధ్యక్షుడు ఈ రజాకార్ల సైనిక పటాలానికి మార్గనిర్దేశకుడయ్యాడు. నిజాం పోలీసు శాఖాధిపతి దీన్ యార్జంగ్ బహద్దూర్ రజాకార్ల సైన్య కార్యక్రమాలను రూపొందించడానికి తోడ్పడేవారు.

రజాకార్ల సంస్థ లేక మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంస్థ  తన రజాకార్ల జీతభత్యాలకు, ఆహార పానీయాలకు రోజుకు సుమారుగా 30 వేల రూపాయలు ఖర్చు చేసేది. జిల్లా కేంద్రాలలో, తాలుకాలలో, ఇతర ముఖ్య పట్టణాలలో రజాకార్ల కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. కాలక్రమేణా రజాకార్ సంస్థ పటిష్టమైంది. ఘాజిసిరాజుద్దీన్ మునీద్, లెఫ్ట్ నెంటు కర్నల్ గులాం మొయినుద్దీన్లు ఈ సంస్థను క్రమశిక్షణలో పెట్టే బాధ్యతను స్వీకరించారు. సంస్థకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమకూర్చబడ్డాయి. జీపులు, ట్రక్కులు, మోటారు సైకిళ్ళు, సైకిళ్ళు ప్రయాణాలకు అనుకూలంగా ఏర్పాటు చేయబడ్డాయి.

ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు వేల సంఖ్యలో నిజాం రాష్ట్రంలో స్వైర విహారం చేశారు. పరానులు, అరబ్బులు, ఆఫ్ఘనులు,పనాగజీలు, హైదరాబాద్ అంతటా విస్తరించారు. స్థానికులైన మహ్మదీయులు, రాష్ట్రం బయట నుండి వచ్చినవారు, విద్యార్థులు రజాకార్ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతిదినము ఖాసీం రజ్వీ రజాకార్ల నాయకులకు ఆదేశాలు అందించేవాడు.

జిల్లా, తాలూకా నాయకులు, కేంద్ర కార్యాలయ ఆదేశాల ప్రకారం గృహ దహనాలు, దోపిడీలు సాగించేవారు. వీరికి ప్రభుత్వాధికారులు, పోలీసు యంత్రాంగము, మిలటరీ పటాలాల సహాయ సహకారాలు ఉండేవి. 

రజాకార్ల అకృత్యాలు 

అమాయకులైన ప్రజలను వరుసబెట్టి కాల్చి చంపేవారు. 

ప్రజల ఆస్తిపాస్తులను ధ్వంసం చేసి, ధన, కనక వస్తువులను దోచుకొని గడ్డివాములను, పూరి గుడిసెలను, ఇళ్ళను కాల్చేవారు. 

రైలు బండ్లను ఆపి బోగీలలో ఉన్న ప్రజలను దోచుకొని నానా హింసలను గురిచేసేవారు. 

రైలు డబ్బాలకు నిప్పంటించి తగులబెట్టేవారు. 

ప్రతిదినం లారీలలో తమకు నిర్దేశించి గ్రామాలను చుట్టుముట్టి దోపిడీలు సాగించి, స్త్రీలను చెరబట్టి, బీభత్స కాండలు నిర్వహించి వారి ప్రాణాలను తీసేవారు. 

నిజాం రాష్ట్రంలో ఉన్న హిందువులు ఈ భయానక వాతావరణంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవితాన్ని గడిపేవారు. ఏ పరిస్థితిలోనూ అత్యధిక హిందూ మత అనుయాయులు నిజాం రాష్ట్రంను వీడి యూనియన్ ప్రాంతాలకు వలసపోయేవిధంగా చేయాలన్నది నిజాం ప్రభువు అభిమతము. వారి స్థానంలో యూనియన్ ప్రాంతంలో ఉన్న మహమ్మదీయులను రప్పించి వారికి సమస్త సదుపాయాలను కల్పించి నిజాం రాజ్యం ఇస్లామిక్ రాజ్యంగా రూపొందించాలనేదే నిజాం ఆకాంక్ష. నిజాం సుల్తాను రజాకారులకు సర్వాధికారాలు దత్తము చేసి పోలీసు మిలిటరీ, ప్రభుత్వ యంత్రాంగం వారికి అన్ని విధాల సహాయ సహకారాలను అందించాలని ఆదేశమిచ్చాడు.

ఒకానొక సమయంలో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఖాశిం రజ్వీ వ్యతిరేకించి నిజాంకు వ్యతిరేకంగా మారాడు. భారతదేశంలో విలీనమయ్యేందుకు నిజాం సిద్ధపడితే నిజాం ప్రభుత్వంపై ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని కూడా బెదిరించాడు. 

ప్రజల తిరుగుబాటు

రజాకార్ల దౌర్యన్యాలను, దోపిడీలను సహించని నిజాం రాష్ట్ర ప్రజలు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపారు. ఆయుధాలు సేకరించుకొని వారిపై ఎదురుదాడి ప్రారంభించారు. ప్రజలు విప్లవ సంఘములు ఏర్పాటుచేసుకొని ఆయుధాలు సంపాదించుకున్నారు. కొందరు మారువేషాతో వంగపల్లి రైల్వేస్టేషనుపై దాడి నిర్వహించి రైల్వే పోలీసుల ఆధీనంలో ఉన్న తుపాకులను, మందు గుండు సామగ్రిని కొల్లగొట్టి ప్రజలలో ఉత్సాహాన్ని కలిగించారు.

రావులపెంట, చింతలమ్మ గూడెము, కోటపాడు గ్రామాలపై రజాకార్లు, నిజాం పోలీసులు జరిపిన దాడులను ప్రజలు అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొన్నారు. మామిళ్ళగూడెము పోలీసు స్టేషనుపై దాడిచేసి ఆయుధాలు సంపాదించిన ప్రజలు బిక్కిమళ్ళ మామిడి తోటలోని రజాకార్ల క్యాంపుపై దాడి జరిపారు. రజాకార్లు, నిజాం పోలీసులు భువనగిరి తాలూకాలోని పులిగొళ్ళ గ్రామంపై దాడి జరిపి అమాయకులైన ప్రజలపై కాల్పులు జరపడంతో 22 మంది మరణించారు. ఈ దారుణ మారణకాండకు ప్రజలు కోపోద్రిక్తులై రజాకార్ల క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి ఆ క్యాంపులను ధ్వంసం చేశారు.

ఈ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహా నాయకులలో ముఖ్యమైనవారు శ్రీ రావి నారాయణరెడ్డిగారు. కాంగ్రెస్ నాయకునిగా, 8వ, 11వ ఆంధ్ర మహాసభలకు అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాతగా రావి నారాయణరెడ్డి ప్రజాభిమానాన్ని పొందారు. బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొయినుద్దీన్, రాజ బహద్దర్ గౌడ్, ఆరుట్ల సోదరులు, ఆరుట్ల కమలాదేవి, కె.రామచంద్రారెడ్డి, పైళ్ళ రాంచంద్రారెడ్డి, పద్మారెడ్డి, తొడిగెల వెంకటరెడ్డి, కంచనేపల్లి సోదరులు ప్రజా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి రజాకారు దళాలను, నిజాం పోలీసులను, మిలిటరీ పటాలాలకు ముచ్చెమటలు పట్టించారు.

కాంగ్రెసు నాయకులు ప్రజలను ఉత్తేజపరచి భయభ్రాంతులైన వారిలో ధైర్య సాహసాలు కలుగచేసి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. కోదాటి నారాయణరావు, వారి అనుచరులు సూర్యాపేటలో వర్తక మహాసభలు నిర్వహించి, గ్రంథాలయోధ్యమము ద్వారా ప్రజలలో నవ చైతన్యం కలిగించారు.

నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్య చర్యలు, నిజాం పోలీసు, మిలిటరీ వారి దుష్టచర్యలు, ప్రవర్తన రాష్ట్ర ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేశాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాలలో దోపిడికి గురికాని గ్రామాలు కాని, దౌర్జన్యములకు గురి కాని కుటుంబాలు లేవు అని అనడంలో అతిశయోక్తి లేదు.

హైదరాబాదు రాష్ట్రంలో భారత ప్రభుత్వము ప్రతినిధిగా ఉన్న కె.ఎం.మున్షి గారు చాకచక్యంగా వ్యవహరించి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలను, దౌర్జన్యాలను, అరాచక స్థితిగతులను భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియచేసేవారు. వందేమాతరం రామచంద్రరావు, వీరభద్రరావు సోదరులు కె.ఎం.ముస్లీ గారికి సంస్థానంలో రజాకార్ల కార్యకలాపాలను, ప్రభుత్వ దమనరీతిని, పోలీసుల దౌర్జన్యాలను, మిలిటరీవారి దాడులను తెలుసుకొని సమాచారమందించేవారు.

చివరకు భారత ప్రభుత్వం, హైదరాబాదు రాష్ట్రంపై పోలీసు చర్య జరపడానికి నిర్ణయించింది. భారత ప్రభుత్వ ఉప ప్రధాని, సర్దార్ వల్లభాయ్ పటేలు గారు చక్కని పథకాన్ని రూపొందించి నిజాం రాష్ట్రం పై పోలీసు చర్య జరపడానికి ఆదేశించారు. ఈ భారత ప్రభుత్వం మొదటి నుండి సామదాన భేదోపాయాలను అనుసరించి నిజాం ప్రభువును భారత యూనియన్లో చేర్చడానికి ప్రయత్నించారు. రాయబారాలు జరిపారు. కానీ ఉస్మానలీఖాన్ బహద్దూర్, ఖాసిం రజ్వీ మాటలకు లొంగి స్వతంత్ర ఆసఫ్లా రాజ్యమును శాశ్వతంగా తన వంశీయులు పాలించాలన్న ఆకాంక్షతో హైదరాబాదు రాష్ట్ర ప్రజలను ఎన్నో రకాలుగా హింసించాడు. తన సైనిక బలము, ఆయుధాలు, రజాకార్ల పటాలములు, పోలీసు బలగము, ధన సంపద, భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో తోడ్పడుతాయని భావించాడు. 

బైరాన్‌పల్లి మారణకాండ

నిజాంల కాలంలో నల్లగొండ జిల్లాలో, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో గల బైరాన్ పల్లిలో 1948 ఆగస్టు 27న జరిగిన నిజాం రజాకర్ల ముష్కరదాడి భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వారు జరిపిన అత్యంత భయంకర మారణకాండ 'జలియన్ వాలాబాగ్' ఉదంతాన్ని తలపిస్తుంది.

బైరాన్‌పల్లి ఊరు ఊరంతా కమ్యూనిస్టులు, దళనాయకులే. స్థానిక దళనాయకుడు ఇమ్మడి రాజిరెడ్డి. దళ బలాన్ని అంచనా వేసి వారిని ఎదుర్కొనడానికి మద్దూరు, లద్నూరు, చేర్యాల ముస్త్యాల క్యాంపుల రజాకార్లు ఒక్కటై బైరాన్‌పల్లిపై దాడిచేశారు. స్థానికదళం వారిని తిప్పికొట్టింది. ఈ విధంగా బైరాన్‌పల్లి గ్రామంపై రజాకార్లు తమ పట్టును నిలుపు కోవడానికి 5 సార్లు దాడి చేశారు. అయినా కూడా బైరాన్ పల్లి రజాకార్ల వశం కానీయకుండా వారికి ఎదురొడ్డి వీరోచితంగా పోరాడి గ్రామస్తులు తమ ధైర్యసాహసాలను ప్రదర్శించారు.

1948 ఆగస్టు 27వ తేదీన 400 మంది నిజాం సైనికులు బైరానపల్లెను దాని సమీప గ్రామం కూటికల్లును చుట్టుముట్టారు. గ్రామస్తులంతా గాఢ నిద్రలో ఉండగా, ఈ విధంగా రజాకార్లు గ్రామాన్ని చుట్టు ముట్టడం గ్రహించిన గ్రామ రక్షక దళసభ్యుడు నగారా మోగించి అందరిని నిద్రలోంచి మేల్కొనాల్సిందిగా సూచించాడు. గ్రామస్తులంతా చేతికి అందిన కత్తులు, కఠార్లు, బడి సెలు, గునపాలు తీసుకుని నిజాం సైన్యంపై ఎదురు దాడికి దిగినారు. కానీ నిజాం సైనికులు మోటార్లు ఉపయోగించి బురుజు పై గుళ్ళ వర్షం కురిపించారు. వారిని దళ సభ్యుల నాటు తుపాకులు ఎదుర్కొనలేకపోయాయి. గ్రామం నిజాం సైన్య వశం అయినది.

స్థానిక భూస్వామి ఒకరు మాయమాటలతో గ్రామస్తులను నమ్మించి అందరిని ఒకచోట చేర్చాడు. వారు తప్పించుకోకుండా వరుసగా నిలబెట్టి ఇద్దరు చొప్పున కట్టి, మొత్తం 88 మందిని నాలుగు వరుసల్లో నిలిపి ఉంచి మెషిన్ గన్లతో కాల్చి చంపారు. ఈ నరమేధం స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా జరిగింది. ఈ దాడిలో నల్లగొండ జిల్లా కలెక్టర్ మొహజ్జం హుసేన్ మరియు డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హాషీం స్వయంగా పాల్గొనడంతో ఇది నిజాం ప్రభుత్వం జరిపిన దారుణమని తెలిసిపోయింది. కూటికల్లులో దొరికిన 14 మందిని చంపివేశారు. ఒకే రోజు 102 మంది వీరమరణం పొందారు. ఈ నరమేధంలో మొత్తం 118 మంది సమరవీరులు నేలకొరిగారు. బైరాన్‌పల్లి హత్యోదంతం జరిగిన మరుసటి రోజు దళనాయకుడు చిత్ర సర్వారెడ్డి తోటి దళసభ్యుడు గాండ్ల చిన్న ఆగయ్యను తీసుకొని పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్ళగా, గ్రామంలో ఒక్కరు గూడా లేరు. వారి ఆచూకి గూడా తెలుసుకోవడం కష్టమైనది.

బైరానపల్లి నరమేధం బయటి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఒకే రోజు, ఒకేప్రాంతంలో ఇంతమందిని హత్య చేయడం అనేది హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలు ఎంత నికృష్టపు బ్రతుకును వెళ్ళదీస్తున్నారో చాటిచెప్పింది. ఈ సంఘటన హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో చేర్చే ప్రయత్నాలకు ఊపునిచ్చినట్లయింది. వీరమరణం పొందిన 118 మంది పేర్లను, బైరాన్ పల్లి గ్రామస్తులు 2003లో ఒక స్థూపాన్ని నిర్మించి, దానిపై చెక్కించి చరిత్రకు అందించారు.