శిథిలమై, రవాణా జరిగి, లోతట్టు ప్రాంతాల్లో నిక్షిప్తమైన శిలా పదార్థాన్నే నేల లేదా మృత్తిక అంటారు. మృత్తికలలో శిలాపదార్థంతో పాటు జీవపదార్థం, తేమ, గాలి కూడా కలిసి ఉంటాయి. మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో మృత్తికలు(నేలలు) చాలా ముఖ్యమైనవి. స్వభావం, రంగు, వాటి రసాయన ధర్మాలను ఆధారంగా చేసుకుని 'భారత వ్యవసాయ పరిశోధన మండలి' భారతదేశంలోని నేలలను 8 రకాలుగా విభజించింది. అవి - 1. ఒండలి నేలు, 2. నల్లరేగడి నేలలు, 3. ఎర్ర నేలలు, 4. లేటరైట్ నేలలు, 5. శుష్క, ఎడారి నేలలు, 6. పర్వత ప్రాంత నేలలు , 7. లవణీయ, క్షార మృత్తిక నేలలు, 8. పీట్, జీవ సంబంధ నేలలు. 

ఒండలి నేలలు: 

నదులు తెచ్చే అవక్షేప పదార్థాలు నిక్షేపితం అవడం వలన ఏర్పడినటువంటి నేలలే ఒండలి నేలలు. ఇవి నేలల్లోకెల్లా అత్యంత సారవంతమైనవి. భారతదేశ భూభాగంలో సుమారుగా 45 శాతం ఒండలి నేలలు ఆక్రమించి ఉన్నాయి. భారతదేశంలో పంజాబ్ నుంచి అసోం వరకు విస్తరించి ఉన్న గంగా సింధూ మైదాన ప్రాంతం; మధ్యప్రదేశ్-గుజరాత్ రాష్ట్రాల్లోని నర్మద, తపతి నదీ లోయల్లో; బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతం; చత్తీస్ గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లోని మహానది డెల్టా, ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా, గోదావరి; తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంతాల్లో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. 

భూ విజ్ఞానపరంగా గంగా సింధూ మైదాన ప్రాంతంలోని నేలలను భంగర్, ఖాదర్, భాబర్, టెరాయ్ అని నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. భంగర్ నేలలు పాత ఒండలి నేలలు. జంబాలయుతంగా ముదురు వర్ణంలో ఉంటాయి. వీటిలో కంకర అనే సున్నపు గుళికలు ఎక్కువగా ఉంటాయి. ఖాదర్ నేలలు నూతన ఒండలి నేలలు. ఈ రకమైన నేలలు సాధారణంగా నదీ తలాలకు సమీపంలో ఉంటాయి. వీటి నిర్మాణం జంబాలం నుంచి ఇసుకలోమ్ వరకు ఉంటుంది. శివాలిక్ పర్వతాల పాదాల వెంబడి ఇసుక లేదా గులకరాళ్లతో కూడిన, విసనకర్ర ఆకారంలో ఏర్పడి ఉన్న నేలలనే భాబర్ నేలలు అంటారు. భాబర్ నేలలకు దక్షిణంగా చిత్తడి నేలలతో కూడిన పల్లపు భూములను టెరాయ్ నేలలు అంటారు. ఒండలి నేలలు పొటాష్, ఫాస్ఫరిక్ ఆమ్లం, సున్నం పుష్కలంగా ఉండి, హ్యూమస్, నత్రజని లోపించి ఉంటాయి. ఇవి గోధుమ, వరి, పప్పు దినుసులు, చెరకు, ఇనుము, నూనెగింజలు, వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయలు పండించేందుకు అత్యంత అనుకూలమైన నేలలు. 

నల్లరేగడి నేలలు: 

కొన్ని మిలియన్ సంవత్సరాలకు పూర్వం అగ్ని పర్వతాలు నిక్షిప్తం చేసిన లావా నిక్షేపణ, నీస్, గ్రానైట్ శిలలు శైథిల్యానికి గురి కావడం వల్ల నల్లరేగడి నేలలు ఏర్పడినవి. ఈ నేలల్లో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, కార్బొనేట్లు, అల్యూమినియం మొదలైన మూలకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నత్రజని, పాస్ఫారిక్ ఆమ్లం, హ్యూమన్లు తక్కువ మోతాదులో ఉంటాయి. వీటికి ఛెర్నోజమ్ నేలలని కూడా పేరు. ఈ నేలలు అధిక మొత్తంలో మెత్తని ఇనుప పదార్థాన్ని కలిగి ఉండటం వల్ల నలుపు రంగులో ఉంటాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ లోని దక్షిణ ప్రాంతాల్లో ఈ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వీటినే స్థానికంగా 'రెగర్ నేలలు' అంటారు. ఈ నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలమైనవిగా ఉండడం వలన వీటిని 'బ్లాక్ కాటన్ సాయిల్స్' అని పిలుస్తారు. తేమను నిలుపుకొనే సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో పాటు సాగే ప్లాస్టిసిటీ లక్షణం కలిగి ఉండడం ఈ నేలల ప్రత్యేకత. నల్లరేగడి నేలలు ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం లాంటి ఖనిజాలు అధికంగా ఉండి, నత్రజని ఫాస్ఫారిక్ ఆమ్లం తక్కువగా ఉంటాయి. పత్తి, జొన్న, మొక్కజొన్న, పొగాకు, ఆముదం పంటలకు ఈ నేలలు ఎక్కువ అనుకూలమైనవి. 

ఎర్ర నేలలు: 

గ్రానైట్, నీస్ లాంటి శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడినవే ఎర్రనేలలు. ఈ నేలలు ఎర్రగా ఉండటానికి ప్రధాన కారణం అందులో కరిగి ఉండే ఫెర్రిక్ ఆక్సైడ్లు. ఈ రకమైన నేలలు దేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. జార్బండ్, అసోం, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, భూభాగాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో పొటాష్ ఎక్కువగా, నత్రజని, పాస్ఫరస్, హ్యూమస్ పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి పత్తి, వరి, గోధుమ, పొగాకు, వేరుశెనగ, పప్పుదినుసుల్లాంటి పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటాయి. 

లేటరైట్ నేలలు లేదా జేగురు నేలలు: 

లేటర్ అనగా ఇటుక అని అర్థం. ఈ రకమైన నేలలు ఇటుక రంగులో ఉంటాయి కావున వీటిని లేటరైట్ నేలలు అని పిలుస్తారు. ఈ నేలలు వర్షపాతం ఎక్కువగా ఉన్న ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. మహారాష్ట్ర, ఒరిస్సా, అసోం, కేరళ, పశ్చిమబంగ మొదలైన రాష్ట్రాల్లో ఈ రకమైన నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. గృహ నిర్మాణానికి అవసరమైన ఇటుకల తయారీకి ఈ నేలలు ఎక్కువగా ఉపయోగపడతాయి. 

ఎడారి నేలలు: 

భారతదేశ వాయువ్య ప్రాంతంలోని శుష్క, అర్ధశుష్క ప్రాంతాల్లో ఎడారి నేలలు అధికంగా విస్తరించి ఉన్నాయి. రాజస్థాన్ లోని ఆరావళి పర్వత శ్రేణి పశ్చిమాన, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో దక్షిణాన, రాణ్ ఆఫ్ కచ్ కు ఉత్తరాన ఈ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇవి నిస్సారమైన నేలలు కావడం వలన వ్యవసాయానికి పనికిరావు.

పర్వత ప్రాంత నేలలు: 

ఈ నేలల్లో హ్యూమస్ శాతం అధికంగా ఉంటుంది. ఇవి ఆమ్లరహిత పోట్రోల్ లుగా ఉంటాయి. వీటిలో ఆమ్ల గుణం తక్కువ. హిమాలయాల్లోని వాలు ప్రాంతాల్లో, తూర్పు, పశ్చిమ కనుమల్లోని కొండవాలులో విస్తరించి ఉన్నాయి. కాఫీ, తేయాకు, సుగంధ ద్రవ్యాలు, రబ్బరు పంటలకు ఇవి అనుకూలమైన నేలలు. 

క్షార మృత్తిక నేలలు: 

దేశంలోని శుష్క, అర్థశుష్క ప్రాంతాల్లో ఉన్న సోడియం, కాల్షియం, మెగ్నీషియం లవణాలతో కూడిన చవుడు నేలలను 'క్షార మృత్తిక నేలు' అంటారు. క్షార మృత్తిక నేలలను 'రే' లేదా 'కల్లార్' లేదా 'ఊసర నేలలు' అని కూడా పిలుస్తారు. పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. పీట్ నేలలు: జీవ సంబంధ పదార్ధం ఎక్కువగా సంచయనం చెంది ఉండే నేలలు ఇవి. కేరళలోని అలెప్పీ, కొట్టాయం జిల్లాల్లో ఈ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. స్థానికంగా వీటిని 'కరి నేలలు' అంటారు. బీహార్, ఉత్తరాంచల్, ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ లోని సుందర్బన్ డెల్టా ప్రాంతాల్లో పీట్ నేలలు అధికంగా విస్తరించి ఉన్నాయి.