మొదట యూరోపియన్లు వ్యాపార కార్యకలాపాల కోసం భారత్ కు రావడం జరిగింది. ప్రారంభంలో వ్యాపారానికి మాత్రమే పరిమితమైన బ్రిటీష్ వారు అనతి కాలంలోనే భారత రాజకీయాల్లో తలదూర్చి ఆర్థిక, మత, సాస్కృతిక పరిణామాలను నిర్దేశించే స్థాయికి ఎదిగారు. భారత్ లో లభ్యమయ్యే సుగంధ ద్రవ్యాలకు ఐరోపా రాజ్యా ల్లో ఉండే గిరాకీ గాను యూరోపియన్లు భారత్ లో అనేక ప్రాంతీయ కర్మాగారాల' పేరుతో వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. భారత్ తో వాణిజ్య సంబంధాలు ఏర్పర్చుకోవడంలో గుత్తాధిపత్యం కోసం పోర్చుగీస్, డచ్, బ్రిటిషర్లు, ఫ్రెంచ్ వాళ్లు తమలోతాము పోటీపడ్డారు. ఈ పోటీలో పోర్చుగీస్, డచ్చి వారిపై బ్రిటిషర్లు సులభంగా విజయం సాధించారు. కానీ ఫ్రెంచివారి నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాణిజ్యం విషయంలో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య పోటీ తలెత్తింది. దీంతోపాటు భారత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వారుచేసిన ప్రయత్నాలు 'కర్ణాటక' యుద్ధాలకు దారితీశాయి. 1756-1761 మధ్య జరిగిన మూడో కర్ణాటక యుద్ధం వల్ల బ్రిటిషర్లకు ఫ్రెంచివారి నుంచి పోటీ లేకుండా పోయింది. మూడో కర్ణాటక యుద్ధంలో సర్ ఐర్ కూట్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం 1760లో వందవాసి (వాండివాష్) యుద్ధంలో ఫ్రెంచివారిని ఓడించారు. ఈ విజయంతో దక్షిణ భారతదేశ రాజకీయాల్లో బ్రిటిషర్లు బలమైన శక్తిగా రూపొందించారు. 

మొదటి కర్ణాటక యుద్ధం (1744-1748) 

యూరప్ లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం 1740లో ప్రారంభమయింది. అదే భారతదేశంలో ఆంగ్ల-ఫ్రెంచి వర్తక కంపెనీల మధ్య మొదటి కర్ణాటక యుద్ధానికి కారణమైంది. ఫ్రెంచి వర్తక గవర్నర్ డూప్లే ఆంగ్లేయుల వర్తక స్థావరమైన మద్రాస్ ను ఆక్రమించారు. ఓడిపోయిన ఆంగ్లేయులు కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్ ను కర్ణాటక అధికార పరిధిలో ఉన్న వర్తక స్థావరమైన మద్రాస్ ను ఇప్పించాల్సిందిగా అడగటంతో అన్వరుద్దీన్ మద్రాస్ ను తిరిగి ఆంగ్లేయులపరం చేయమని కోరగా, ఫ్రెంచివారు నిరాకరించారు. దీంతో 1748లో శాంథోమ్ (అడయార్) వద్ద అన్వరుద్దీన్ సైన్యాలకు, ఫ్రెంచి సైన్యాలకు మధ్య యుద్ధం జరగ్గా, ఫ్రెంచి సేనాని, వర్తక కంపెనీ గవర్నర్ అయిన డూప్లే అన్వరుద్దీన్ సేనలను ఓడించాడు. అన్వరుద్దీన్ ఓటమి ఫ్రెంచివారి గౌరవ ప్రతిష్టలను పెంచింది. అన్వరుద్దీన్ ఓటమివల్ల స్థానిక పాలకుల సైనిక బలహీనతలు బహిర్గతమయ్యా యి. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ, విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధం శాంథోమ్ లేదా అడయార్ యుద్ధం. యూరప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం 'ఎక్స్-లా-షా పెల్' సంధితో ముగియడంతో 1748లో భారతదేశంలో కూడా బ్రిటిష్, ఫ్రెంచి యుద్ధం ముగిసింది. ఫ్రెంచి వారు ఆంగ్లేయుల వర్తక స్థావరమైన మద్రాస్ ను తిరిగి ఇచ్చేశారు. 

రెండో కర్ణాటక యుద్ధం (1749-1754) 

స్వదేశీ రాజుల వ్యవహారాల్లో ఆంగ్లేయులు, ఫ్రెంచివారు జోక్యం చేసుకోవడం వల్ల జరిగిన యుద్ధం రెండో కర్ణాటక యుద్ధం. రెండో కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం హైదరాబాద్, అర్కాట్ (కర్ణాటక) సింహాసనాల వారసత్వం కోసం పోరాటం. హైదరాబాద్ నిజంగా ఉన్న నిజాం ఉల్-ముల్క్, మరణించడంతో హైదరాబాద్ సింహాసనం కోసం ఆయన కుమారుడైన నాసర్‌జంగ్, నిజాం-ఉల్-ముల్క్ మనవడైన ముజఫర్ జంగ్ మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. కర్ణాటక సింహాసనం నుంచి అన్వరుద్దీన్‌ను తప్పించాలని చందాసాహెబ్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఫ్రెంచివారు హైదరాబాద్ లో ముజఫర్ జంగ్, కర్ణాటకలో చందాసా హెబ్ లను సమర్థించారు. ఆంగ్లేయులు హైదరాబాద్ లో నాసర్ జంగ్, కర్ణాటకలో అన్వరుద్దీన్లను సమర్ధించారు. అంబూర్ యుద్ధం క్రీ.శ. 1749 లో జరిగిన అంబూర్ యుద్ధంలో ముజఫర్హంగ్, చందాసాహెబ్ తో కలిసి, ఫ్రెంచి గవర్నర్ డూప్లే కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్ ను చంపారు. నాసర్‌జంగ్ ను చంపడానకి కూడా ఫ్రెంచివారి ప్రోద్బలమే కారణమయింది. దీంతో హైదరాబాద్ లో ముజఫర్ జంగ్, కర్ణాటకలో చందాసాహెట్లు సింహాసనం అధిష్టించారు. 1751 లో కడపజిల్లా లక్కిరెడ్డిపల్లి వద్ద ముజఫర్ జంగ్ ను చంపేశారు. ఫ్రెంచివారు నాసర్‌జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ ను హైదరాబాద్ నైజాంగా చేశారు. సలాబత్ జంగ్ రక్షణ కోసం హైదరాబాద్లో మకాం వేసిన ఫ్రెంచి సేనాని జనరల్ బుస్సీ. ఫ్రెంచివారి ప్రాబల్యాన్ని తగ్గించడానికి, అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్ అలీని అర్కాట్ నవాబుగా చేసేందుకు 1751 లో ఆంగ్లేయ సేనాని రాబర్ట్ క్లైవ్ అర్కాట్ పై దాడి చేశాడు. ఈ యుద్ధంలో చందాసాహెబ్, ఫ్రెంచివారు ఓడిపోయారు. అర్కాట్ యుద్ధ ఫలితంగా రాబర్ట్ క్లైవ్ 'అర్కాట్ వీరుడు' అని బిరుదు పొందాడు. డూప్లే వైఫల్యంతో ఫ్రెంచి వర్తక కంపెనీ డూప్లేని గవర్నర్ గా తొలగించి ఆయన స్థానంలో 'గోడెన్ హ్యూ'ని నియమించింది. ఫ్రెంచి గవర్నర్ గోడెన్ హ్యూ ఆంగ్లేయులతో పుదుచ్చేరి సంధి (1754) చేసుకున్నాడు. దీంతో రెండో కర్ణాటక యుద్ధం ముగిసింది. 

మూడో కర్ణాటక యుద్ధం (1756-1763); 

మొదటి కర్ణాటక యుద్ధంలా, యూరప్లో సప్తవర్ష సంగ్రామ యుద్ధం వల్ల భారతదేశంలోని ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి మధ్య మూడో కర్ణాటక యుద్ధం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ ప్రాబల్యాన్ని తుదముట్టించేందుకు, రాబర్ట్ క్లైవ్ ను ఎదుర్కోవడానికి ఫ్రెంచివారు కౌంట్-డి-లాలీ ని గవర్నర్‌గా నియమించారు. ఈయనకు సహాయంగా హైదరాబాద్ నుంచి ఫ్రెంచి సేనాని జనరల్ బుస్సీని పిలిపించారు. క్రీ.శ. 1760 లో బ్రిటిష్ సేనాని 'స్ఫరూట్', ఫ్రెంచి వారైన జనరల్ బుస్సీ, కౌంట్-డి-లాలీని ఓడించారు. వాంది వాశి యుద్ధంలో ఫ్రెంచివారు ఓడిపోవడంతో భారతదేశంలో వారి ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. 1763 లో ప్యారిస్ సంధి ద్వారా 'సప్తవర్ష సంగ్రామం' యూరప్ లో ముగియగా, భారతదేశంలో మూడో కర్ణాటక యుద్ధం ముగిసింది. పై మూడు కర్ణాటక యుద్ధాల ఫలితంగా ఫ్రెంచివారు కేవలం వర్తకానికి మాత్రమే పరిమితం అయ్యారు. బ్రిటిష్ ప్రాబల్యం విస్తరించింది.