భారతీయ సైన్యం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ (బ్రిటన్ తరపున పోరాడుతూ) జపాన్ చేతిలో పట్టుబడింది. ఈ విధంగా బందీలైన భారతీయ యుద్ధ ఖైదీలందరూ, బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత జాతీయ సైన్యంగా ఏర్పడ్డారు. భారత జాతీయ సైన్యాన్ని మొదటగా 1942లో మోహన్ సింగ్ స్థాపించాడు. ఈయన బ్రిటిష్ ఇండియన్ సైన్యంలో ఉద్యోగి. 1942 ఫిబ్రవరిలో సింగపూర్ ను జపాన్ సైన్యం ఆక్రమించిన తర్వాత, 40,000 మంది భారతీయ యుద్ధ ఖైదీలు జపాన్ వశమయ్యారు. వీళ్లందరినీ మోహన్ సింగ్ కు జపాన్ అప్పగించింది. భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమివేయడానికి యుద్ధఖైదీల్లో ఎవరైనా సిద్ధంగా ఉంటే, వారు భారత జాతీయ సైన్యం (ఆజాద్ హింద్ ఫౌజ్ ) లో చేరవచ్చని మోహన్ సింగ్ ప్రకటించారు. 

ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ (భారత స్వాతంత్ర్య సమితి): 

ఆగ్నేయాసియా దేశాల్లోని ప్రవాస భారతీయులతో కలిసి 1942లో టోక్యోలో రాస్ బిహారీ బోస్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పరిచాడు. భారత దేశానికి బ్రిటన్ నుంచి విముక్తి కలిగించడం ఈ సంఘం లక్ష్యం. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తొలి అధ్యక్షుడు రాస్ బిహారీ బోస్. సుభాష్ చంద్రబోసను తూర్పు ఆసియా ప్రాంతాలకు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఆహ్వానించి బాధ్యతలు స్వీకరించమని కోరింది. సుభాష్ చంద్రబోస్ 1943లో సింగపూర్ లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ప్రవాస భారతీయులందరూ సుభాష్ చంద్రబోస్ ను అభిమానంగా 'నేతాజీ' అని పిలిచారు. జాతీయ సైన్యానికి సుభాష్ చంద్రబోస్ నాయకత్వం స్వీకరించిన తర్వాత “ఆజాద్ హింద్ ఫౌజ్”గా పేరువచ్చింది. భారత జాతీయ సైనికులకు ఆయన ఉత్తేజకరమైన 'ఛలో ఢిల్లీ' నినాదాన్ని అందించాడు.

భారత జాతీయ సైన్యం స్వాతంత్ర్య పోరాటాలు 

సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 1943లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం సింగపూర్ లో ఏర్పాటైంది. సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించిన తొలిదేశం జపాన్. స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం అమెరికా, బ్రిటన్లపై యుద్ధం ప్రకటించింది. టోక్యోలో జరిగిన తూర్పు ఆసియాదేశాల సమావేశానికి (1943 నవంబర్) ప్రభుత్వాధినేత హోదాలో సుభాష్ చంద్రబోస్ హాజరయ్యాడు. ఈ సమావేశంలో తాత్కాలిక ప్రభుత్వానికి అండమాన్ నికోబార్ దీవులను జపాన్ అప్పగించింది. సుభాష్ చంద్రబోస్ అండమాన్ దీవులకు 'షహీద్' దీవులని నికోబార్ దీవులకు 'స్వరాజ్య' దీవులని నామకరణం చేశాడు. 1944లో భారత జాతీయ సైన్యం బ్రిటిష్ వారితో యుద్ధం మొదలుపెట్టింది. భారత జాతీయ సైన్యం మౌడక్, కోహిమా, ఇంపాల్ ప్రాంతాలను బ్రిటిష్ వారినుంచి ఆక్రమించింది.

జపాన్ నుంచి పొందిన రంగూను, భారత్ జాతీయ సైన్యం నుంచి బ్రిటిష్ సైన్యం వశపరచుకోవటంతో, ఆగ్నేయాసియాలో భారత జాతీయ సైన్యం సాగించిన స్వాతంత్ర్య సమరం అంతమైంది. రంగూనను బ్రిటిష్ వారు స్వాధీనపరచుకున్న తర్వాత, సుభాష్ చంద్రబోస్ బ్యాంకాక్ చేరుకుని, అక్కడ నుంచి తైపే చేరుకున్నాడు. 1945 ఆగస్టు 18న తైపేలో విమానం ఎక్కాడు. ఆ తర్వాత ఏం జరిగిందో స్పష్టంగా ఎవరికీ తెలీదు. జపాన్ వెల్లడించిన ప్రకటన ప్రకారం, బోస్ ఎక్కిన విమానం అగ్ని ప్రమాదానికి గురై బోస్ చనిపోయినట్లు తెలిసింది. భారత జాతీయ సైన్యం తన లక్ష్యాన్ని సాధించలేక పోయినా పూర్తిగా వైఫల్యం చెందిందనడానికి వీల్లేదు. భారతదేశంలో ఇక ఏమాత్రం తమ సామ్రాజ్యాన్ని కొనసాగించలేమని బ్రిటన్ గుర్తించింది.

భారత జాతీయ సైనికుల విచారణ 

భారత జాతీయ సైనికులను యుద్ధ ఖైదీలుగా బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుంది. యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని భారత జాతీయ కాంగ్రెస్ తో పాటు, ముస్లిం లీగ్, భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదలైన పార్టీలు ముక్త కంఠంతో యుద్ధ ఖైదీలకు మద్దతు పలికాయి. దీంతో ఉద్యమం పాక్షికమైంది కాదనీ, జాతీయమైందనీ అర్ధమైంది. 'రక్తానికి రక్తం', 'శిక్ష పడ్డ ప్రతి యుద్ధఖైదీకి బదులుగా 20 మంది యూరోపియన్లను హతమారుస్తాం' అనే నినాదాలతో ఢిల్లీ నగర వీధుల్లో కరపత్రాలు, పోస్టర్లు వెలిశాయి. యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని సాగుతున్న ఉద్యమం జాతీయ స్థాయిలో ఉధృతమయ్యేసరికి బ్రిటిష్ ప్రభుత్వం సైనికులతో ఉదారంగా వ్యవహరించింది. వారి నాయకులను విచారించడానికి నిర్ణయించింది. భారత జాతీయ సైన్యం 1945 నవంబర్‌లో నాయకులను ఎర్రకోటలో విచారించింది. బ్రిటిష్ ప్రభుత్వం విచారించిన భారతీయ సైన్యాధికారులు జనరల్ షానవాజ్ ఖాన్, కర్నల్ టి.కె. షెగాల్, కర్నల్ జి.యస్. ధిల్లాన్లు అయితే వీరు ముగ్గురు యాదృచ్ఛికంగా వరుసగా ముస్లిం, హిందూ, సిక్కుమతాలకు చెందినవారు కావడంతో వీరి విడుదలకోసం వివిధ మతస్తులంతా ఏకమయ్యారు. భారత జాతీయ సైన్య అధికారుల తరపున తేజ్ బహదూర్ సప్రూ, జవహర్ లాల్ నెహ్రూ, అరుణ్ అసఫ్ అలీలు న్యాయవాదులుగా విచారణకు హాజరయ్యాడు. ఆ ముగ్గురికీ బ్రిటిష్ ప్రభుత్వం యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. అయితే వాటిని తిరిగి రద్దు పరిచారు.

భారత నావికుల తిరుగుబాటు (1946) 

1946 ఫిబ్రవరిలో బొంబాయిలో 'రాయల్ ఇండియన్ నేవీ' లో పనిచేస్తున్న సైనికులు బ్రిటన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ అధికారులు జాత్యాహంకారాన్ని ప్రదర్శించడం, ఆహారం సరిగ్గా లేకపోవడం, పై అధికారుల చేతుల్లో కిందివారు అనుభవిస్తున్న అవమానాలు, వంటి కారణాలతో జరిగిన తిరుగుబాటుకు బొంబాయిలో బి.సి. దత్ నాయకత్వం వహించాడు. నావికులకు మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ బొంబాయిలో సమ్మెకు పిలుపునిచ్చింది. బొంబాయి తర్వాత కరాచీలో నావికులు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు సందర్భంగా జరిపిన కాల్పుల్లో 200 మంది మరణించారు. దీంతో తిరుగుబాటుదార్లు లొంగకపోతే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేస్తుందని బ్రిటన్ హెచ్చరించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య వర్తిత్వంతో తిరుగుబాటు ఆగిపోయింది.