కోల్ గిరిజనుల తిరుగుబాటు (1831-32): 

వంశపారం పర్యంగా తమ గ్రామాలపై పెత్తనం వహిస్తున్న గ్రామాధికారులను తొలగించి, వారి స్థానంలో సిక్కులు, ముస్లింలను పెత్తందార్లుగా నియమించడం 'కోల్' గిరిజనుల తిరుగుబాటుకు కారణమైంది. చోటా నాగపూర్ ప్రాంతం కోల్ గిరిజనుల తిరుగుబాటుకు 'బుద్ధీభగత్' నాయకత్వం వహించారు. పెత్తందార్లు శిస్తు మొత్తాలను వసూలు చేయడం కోసం తీవ్ర ఒత్తిడి చేయడంతో కోల్ గిరిజనులు గ్రామాలు దోచుకోవడం, దగ్ధం చేయడం, వందల సంఖ్యలో గిరిజనేతరులను హత్యచేయడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం సైనిక చర్య ప్రారంభించి తిరుగుబాటును అణిచివేసింది. 

ఖోండ్  తిరుగుబాటు (1846-48; 1855) 

నరబలులు, శిశు హత్యలు నిషేధిస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు తమ మతానికి, అలవాట్లకు, ఆచారాలకు విరుద్ధమని ఖోండ్లు భావించారు. ఒరిస్సాలో ఉండే ఈ తెగ వారు ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచుకున్నారు. 'చక్రబిసాయ్' నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. బాణాలు, గొడ్డళ్లు ఖోండుల ఆయుధాలు. గ్రామాలను దగ్ధం చేసేవారు. ప్రభుత్వం సైనిక చర్య ద్వారా తిరుగుబాటును అణిచివేసింది. 

సంతాల్ తిరుగుబాటు (1855-56): 

గిరిజన తెగల తిరుగుబాట్లతో అతి గొప్పది, ఘనమైంది సంతాల్ తిరుగుబాటు. సిద్ధు, కన్హూ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటు ముఖ్యంగా గిరిజనేతరుల అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్దేశించింది. ప్రభుత్వం దోపిడీ శక్తులకు చేయూత నివ్వడంతో, పరాయి పాలనపై 'సంతాలులు' ద్వేషం పెంచుకున్నారు. జమీందార్లు, పోలీసుల, పన్ను వసూలు చేసే అధికారులు పెత్తనం చెలాయించేవారు. బలవంతంగా ఆస్తులను వశపరచుకోవడం, వ్యక్తిగత హింసకు పాల్పడటం లాంటి నిరంకుశ చర్యలు గిరిజనులను మరింత కుంగదీశాయి. అప్పులకు అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. ఫలసాయ అమ్మకాల సమయంలో తూనికలు, కొలతల్లో దోపిడీ జరిగేది. గిరిజనులకు చెందిన పంటకు వచ్చిన చేలల్లోకి ధనవంతులు తమ పశువులను తోలి నష్టం కలిగించేవారు. వేతనాలను ఇవ్వకపోవడంతో సహనం కోల్పోయిన సంతాల్స్ తిరుగుబాటు చేశారు. జమీందార్లు, తోట యజమానులు, రైల్వే ఉద్యోగులు, పోలీసు అధికారులు, వర్తకులు, రైతుల గృహాలపై సంతాల్స్ దాడికి పాల్పడ్డారు. హత్యలు చేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి ప్రభుత్వానికి సవాలుగా నిలిచారు. సంతాలు ఆధునిక భారతదేశ చరిత్రలో తొలి స్వతంత్ర గిరిజన రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రేరణగా నిలిచారు. బ్రిటీష్ ప్రభుత్వం తిరుగుబాటు తీవ్రతను గుర్తించి సైన్యంతో అణిచివేసింది. 

రంప తిరుగుబాటు (1879-80): 

1879-80లో గోదావరి ఏజెన్సీలోని రంప ప్రాంతంలో కలప మీద, పశువులను మేపుకోవడం మీద పన్నులు పెంచడానికి మున్సబ్దారు ప్రయత్నాలు చేశారు. పోలీసులు బలవంతపు వసూళ్లకు, వడ్డీ వ్యాపారులు దోపిడీకి పాల్పడ్డారు. పోడు వ్యవసాయం మీద విధించిన ఆంక్షలతో ఆగ్రహించిన గిరిజనులు 'కోయ కొండదొర' నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. 

అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో 1922-24 మధ్యకాలంలో రంప ప్రాంతంలో మళ్లీ తిరుగుబాటు జరిగింది. వడ్డీ వ్యాపారుల దోపిడీ, పశువులను అడవిలో మేపుకోవడంపై, పోడు వ్యవసాయంపై ఆంక్షలు, కూలి చెల్లించకుండా అటవీ రహదారులు నిర్మించడానికి ప్రయత్నాలు చేయడంతో తిరుగుబాటు జరిగింది. ప్రభుత్వం మలబార్ ప్రత్యేక పోలీసు దళాలతో, అస్సాం రైఫిల్ దళాలతో ఉద్యమాన్ని అణిచివేసింది. 

ముండా తిరుగుబాటు (1899-1900): 

'ముండాలు' బీహార్ లోని చోటా నాగపూర్ ప్రాంత గిరిజనులు. వీరి మత విశ్వాసాలపై క్రైస్తవ మిషనరీలు దుష్ప్రచారం సాగించాయి. జాగీర్దారులు (భూస్వాములు) తికాదారులు (రెవెన్యూ అధికారులు), వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి పొందడానికి ముండాలు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు 'బిర్సా ముండా' నాయకత్వం వహించారు. బిర్సా తనకు దైవ దృష్టి, మంత్రశక్తులు ఉన్నాయని, త్వరలో ప్రళయం విచ్చ సత్యయుగం స్థాపితమవుతుందని నమ్మబలికాడు. ఇతడు జాగీర్దారులు, తికాదారుల, క్రైస్తవ మిషనరీలపై దాడిచేసి మారణహోమం సృష్టించాడు. ప్రభుత్వం సైన్యంతో తిరుగుబాటు అణిచివేసింది. తిరుగుబాటు తీవ్రతను గుర్తించిన బ్రిటీష్ ప్రభుత్వం 1908లో చోటా నాగపూర్ కౌలుదారి చట్టం ద్వారా ఉమ్మడి భూముల హక్కులను పునరుద్ధరించింది. అంతేకాకుండా భౌత్ బెగారి (వెట్టిచాకిరి)ని నిషేధించింది. మత స్వేచ్ఛ పూర్తి వ్యక్తిగతమని చెప్పిన బిర్సాముండా అటు వైష్ణవానికి, ఇటు క్రైస్తవానికి చెందకుండా తనదైన 'సింగ్ భోంగా' అనే దేవుడిని పూజించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. ముండాలకు ప్రత్యేక ప్రదేశం కోసం 'ఉలుస్తున్' ఉద్యమాన్ని నడిపాడు. 

ఓరాన్ల తిరుగుబాటు (1915): 

ఓరాన్ల తిరుగుబాటుకు 'జాత్ర భగత్' నాయకత్వం వహించారు. చోటా నాగపూర్ ప్రాంతంలోని గిరిజన తెగ ఓరాన్స్. వీరు మొదట ఏకేశ్వరోపాసనను బోధించేందుకు ఉద్యమం ప్రారంభించారు. కాలక్రమేణా ఉద్యమం బ్రిటిష్ వలస వాదానికి వ్యతిరేకంగా సాగింది. జాత్రాభగత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంస్కరణ ఉద్యమం తానాభగత్ (పెద్దవాళ్ల) ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. ఇది తదనంతర కాలంలో స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక భాగంగా మారింది.

నాగాకుకీ తిరుగుబాటు (1915): 

ఈశాన్య గిరిజన రాష్ట్రాల్లో బ్రిటిష్ సైన్యాలకు వ్యతిరేకంగా నాగాకుకీల తిరుగుబాటు ప్రారంభమైంది. రాణి గైడిన్లూ, ఆమె సోదరులు జడనాగు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో భాగమైంది. 1917లో రాణి గైడినను నిర్బంధించిన బ్రిటిష్ ప్రభుత్వం 1947లో విడుదల చేసింది. రాణి గైడినను జవహర్ లాల్ నెహ్రూ 'స్వతంత్ర భారత 'ప్రథమ పుత్రిక'గా ప్రశంసించారు. 

చెంచు తిరుగుబాటు (1922); 

ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల పర్వత ప్రాంతంలో ఉండే చెంచు గిరిజన తెగ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. అటవీ ఉత్పత్తికి సంబంధించి తమకున్న సాంప్రదాయక హక్కులను క్రమంగా కాలరాయడంతో చెంచులు స్వతహాగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. చెంచులు తిరుగుబాటుకు నాయకత్వం వహించింది కన్నెగంటి హనుమంతు. ఈ ఉద్యమానికి మరో పేరు పల్నాడు అటవీ సత్యాగ్రహం.