భారత్ లోని సారవంతమైన, సౌభాగ్యమైన ప్రాంతాల్లో బెంగాల్ ఒకటి. మొగలుల రాజ్యంలో భాగంగా ఉన్న బెంగాల్ 18వ శతాబ్దంలో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. బెంగాల్ నవాబ్ అలీవర్గీఖాన్ మొదట బ్రిటిష్ వారి పట్ల స్నేహభావంలో ఉండేవాడు. కానీ కర్ణాటక పరిణామాలు అలీవర్గీఖాలో ఆందోళన రేకెత్తించాయి. 1756లో అలీవర్గీఖాన్ మరణించడంతో అతడి మనుమడు సిరాజుద్దేలా బెంగాల్ నవాబ్ అయ్యాడు.

బ్రిటిష్, ఫ్రెంచివారు బెంగాల్ లోని తమ కోటలను బలపరుచుకోవడం ప్రారంభించారు. 'యూరోపియన్లు వర్తకులుగానే ఉండాలి తప్ప, యజమానులు కాకూడదు' అని సిరాజ్ భావించాడు. కలకత్తా, చంద్రనాగూర్లలో ఉన్న కోటలనూ పడగొట్టవలసిందిగా బ్రిటిష్, ఫ్రెంచివారినీ సిరాజ్ ఆదేశించాడు. సిరాజుద్ధాలా ఆజ్ఞను ఫ్రెంచివారు అమలు చేశారు. కర్ణాటక యుద్ధ విజయాలు ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో బ్రిటిషర్లు సిరాజ్ ఆదేశాలను ధిక్కరించి బెంగాల్ లో వర్తకం చేయాలని భావించారు. దీంతో బెంగాల్ నవాబు 1756లో సైన్యాలను పంపి, బ్రిటిష్ స్థావరాలైన కాశింబజార్, కలకత్తాలను ఆక్రమించాడు. 

కలకత్తా చీకటి గది ఉదంతం: 

1756 జూన్లో సిరాజుద్ధాలా కలకత్తాలోని పోర్ట్ విలియంకోట ముట్టడిలో 146 మంది బ్రిటిషర్లను ఖైదీలుగా పట్టుకుని ఒక చిన్న గదిలో బంధించాడు. మరుసటి రోజు ఉదయం తలుపులు తెరిచేసరికి 23 మంది మాత్రమే బతికి ఉన్నారు. ఇది కలత్తా చీకటి గది ఉదంతంగా ప్రసిద్ధికెక్కింది. బెంగాల్ పరిణామాలను గుర్తించిన మద్రాలోని అధికారులు కలకత్తా పునరాక్రమణ బాధ్యతలను రాబర్ట్ క్లైవ్ కు అప్పగించారు. డ్రైవ్ కు సహకరించడానికి కల్నల్ వాట్సన్ నాయకత్వంలో నౌకాదళాన్ని పంపించారు. డ్రైవ్, వాట్సన్లు 1757 జనవరిలో కలకత్తాను పునరాక్రమించుకున్నారు. 

ప్లాసీ యుద్ధం

రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దెలాకు మధ్య 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దేలాను బ్రిటిషర్లు వధించారు. ఈ యుద్ధంలో సిరాజుద్ధాలా సేనాని మిర్జాఫర్ బెంగాల్ రాజ్యాధికారాన్ని ఆశించి క్లైవ్ కు సహకరించాడు. మీర్జాఫర్ తో పాటు, సిరాజ్ ప్రతినిధి మాణిక్ చంద్, వర్తకుడు అమీన్ చంద్, బ్యాంకర్ జగత్ సేట్, భూస్వామి రాయ్ దుర్లభ్, ఖడింఖాన్ ప్లాసీ యుద్ధంలో క్లైవ్ కు సహకరించి సిరాజ్ నుయ ఓడించిన కుట్రలో భాగస్వాములయ్యారు. క్లైవ్ కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని అమీన్ చంద్ కుదిర్చాడు. ప్లాసీ యుద్ధంలో విశ్వాస తకులైన మీర్ జాఫర్, రాయ్ దుర్లభ్ నాయకత్వంలోని సిరాజ్ ముఖ్య సైన్యం యుద్ధంలోనే పాల్గొ లేదు. ప్లాసీ యుద్ధంలో 29 మంది బ్రిటిష్ సైనికులు, సుమారు 500 మంది బెంగాల్ సైనికులు మరణించారు. డ్రైవ్ సహకారంతో మీర్జాఫర్ బెంగాల్ నవాబ్ అయ్యాడు. దాని ఫలితంగా 24 పరగణాల భూమి కంపెనీకి లభించింది. 

ప్లాసీ యుద్ధ ఫలితాలు: 

  • రాజకీయంగా ప్లాసీ యుద్ధానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 
  • ఈ యుద్ధానంతరం బెంగాల్ లోనూ, భారత దేశంలోనూ సర్వాధిపత్యం చెలాయించడానికి బ్రిటిషర్లకు మార్గం సులువైంది. 
  • బ్రిటిషర్లు తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం బెంగాల్ ఆర్థిక వనరులను ఉపయోగించుకున్నారు. 
  • ఆర్థిక వనరులతోపాటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 
  • బ్రిటిషర్ల భారతదేశ ఆక్రమణ వాస్తవానికి ప్లాసీ యుద్ధంతోనే మొదలైంది. 
  • ఈ యుద్ధం ద్వారా బ్రిటిషర్లకు కలిగిన ప్రయోజనాలు ఏ యుద్ధంతోనూ లభించలేదు. 
  • ఈ యుద్ధం బ్రిటిషర్ల ఖ్యాతిని మరింత పెంచింది. భారత్ లోని రాజకీయ బలహీనతలను బహిర్గత పరిచింది. 
  • ఆర్థిక దోపిడి, భారత సంపదను బ్రిటన్‌కు తరలించడం ఈ యుద్ధంతోనే ప్రారంభమైంది. 
  • 1758లో క్లైవ్ బెంగాల్ గవర్నర్ అయ్యాడు. ఇతడు బెంగాల్ లో డచ్ వారిని అంతమొందించాడు. 

బక్సార్ యుద్ధం:

1760లో రాబర్ట్ క్లైవ్ ఇంగ్లండ్ కు వెళ్లిన తర్వాత వాన్ సిటార్ట్ బెంగాల్ గవర్నర్ అయ్యాడు. మీర్జాఫర్‌ను బెంగాల్ నవాబ్ పదవి నుంచి తొలగించి, అతడి అల్లుడు మీర్‌ ఖాసీంను బెంగాల్ పీఠంపై వాన్ సిటార్ట్ కూర్చోబెట్టాడు. మీర్ ఖాసీం బర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను కంపెనీకి అప్పగించాడు. 29 లక్షల రూపాయలను కంపెనీ అధికారులకు ముట్టజెప్పాడు. మీర్ ఖాసీం కొంతకాలం తర్వాత పరిపాలనా వ్యవహారాల్లో, కంపెనీ జోక్యం చేసుకోవడంపై వ్యతిరేకించి, టిషర్ల ఆగ్రహానికి గురయ్యాడు. 1763లో మీర్ ఖాసీంను తొలగించి, మీర్జాఫర్‌ను మళ్లీ బెంగాల్ నవాబును చేశారు. మీర్ ఖాసీం అయోధ్య నవాబు షజా ఉద్దేలా, మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం సహాయం కోరాడు.సర్ హెక్టర్ మన్రో నాయకత్వంలోని కంపెనీ సైన్యం మీర్ ఖాసీం కూటమిని 1764 అక్టోబరు 17న బక్సార్ యుద్ధంలో ఓడించింది. భారతదేశ చరిత్రలోనే నిర్ణయాత్మక యుద్ధాల్లో బక్సార్ యుద్ధం ఒకటి. బక్సార్ యుద్ధం బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసింది. 1765లో బెంగాల్ గవర్నర్ గా డ్రైవ్ తిరిగి నియమితుడయ్యాడు. క్లైవ్ మొఘల్ చక్రవర్తి, అయోధ్య నవాబుతో అలహాబాద్ సంధిని కుదుర్చుకొన్నాడు. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది. బెంగాల్ అధికారాలను దివానీ, నిజామ లుగా విభజించారు. దివానీ అంటే భూమిశిస్తు వసూలు చేసుకొనే అధికారం, నిజామత్ అంటే పరిపాలనా బాధ్యత. 1770లో బెంగాల్ లో తీవ్ర క్షామం వచ్చింది. లక్షలాది మంది దీనికి బలయ్యారు. కంపెనీ వర్తకుల్లో అవినీతి పెరిగింది. కంపెనీ పరిస్థితిని సరిదిద్దడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేసింది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత రాబర్ట్ క్లైవ్ కు దక్కుతుంది.