ప్రస్తుతం భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 4780 మె.వా. ఇది దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఉత్పత్తిలో సుమారు 3 శాతం. అణు విద్యుదుత్పత్తికి అవసరమైన యురేనియం, థోరియం, ఇల్మనైట్, మోనజైట్ ఖనిజాలు భారతదేశంలో తగినంతగా లభిస్తున్నాయి. జార్ఖండ్ లోని రాణి మేఖలలో, రాజస్థాన్ లోని 'ఆరావళి' పర్వత ప్రాంతంలో యురేనియం లభిస్తోంది. బీహార్ లో గయ, రాజస్థాన్లో జైపూర్, ఉదయ్ పూర్, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాల్లో యురేనియం నిల్వలున్నాయి. జార్ఖండ్ లోని 'జాదుగూడ'లో యురేనియాన్ని శుద్ధి చేసే ప్లాంట్ ఉంది. కేరళ తీరం వెంట ఉన్న మోనజైట్ ఇసుకల్లో థోరియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. 

భారతదేశంలోని ముఖ్యమైన అణు విద్యుత్ కేంద్రాలు 

తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం 

దీనిని 1969, అక్టోబర్ 28న మహారాష్ట్రలోని తారాపూర్ వద్ద స్థాపించారు. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి అణు విద్యుత్ కేంద్రం ఇది. ఇక్కడ గల అణు రియాక్టర్ పేరు - అప్సర. ఈ కేంద్రం అణు విద్యుత్ సామర్థ్యం - 1400 మె.వాట్లు. 

రావత్ భాటా అణు విద్యుత్ కేంద్రం 

1973, డిసెంబర్ 16న రాజస్థాన్ లోని రావత్ భాటా వద్ద దీనిని నెలకొల్పారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. దీనిని 'కోటా అణు విద్యుత్ కేంద్రం' అని కూడా పిలుస్తారు. దీని అణు విద్యుత్ సామర్థ్యం 1180 మె.వా. 

కల్పకం అణు విద్యుత్ కేంద్రం 

1984, జనవరి 24న తమిళనాడులోని కల్పకం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. దీనిని మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ (ఎంఎపీఎస్) అని, 'ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ' అని కూడా పిలుస్తారు. ఇక్కడ గల అణు రియాక్టర్ పేరు - కామిని, ఈ రియాక్టర్ ద్వారా ప్లాటినాన్ని ఉపయోగించి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. దీని అణు విద్యుత్ సామర్థ్యం - 440 మె.వా. 

నరోరా అణు విద్యుత్ కేంద్రం 

ఉత్తరప్రదేశ్ లోని నరోరా వద్ద 1991, జనవరి 1న దీన్ని ఏర్పాటు చేశారు. ఈ అణువిద్యుత్ కేంద్రం ద్వారా ప్రధానంగా ఢిల్లీకి విద్యుత్ ను సమకూరుస్తున్నారు. దీని అణు విద్యుత్ సామర్థ్యం 440 మె.వా. 

కాక్రపార అణు విద్యుత్ కేంద్రం 

1993, మే 6న గుజరాత్ లోని కాకపార ప్రాంతంలో దీనిని నెలకొల్పారు. దీని అణు విద్యుత్ సామర్థ్యం 440 మె.వా. 

కైగా అణు విద్యుత్ కేంద్రం 

2000, నవంబర్ 16న కర్ణాటక రాష్ట్రంలోని 'కైగా' ప్రాంతంలో దీనిని స్థాపించారు. దీని అణు విద్యుత్ సామర్థ్యం 850 మె.వా.