మొగల్ చక్రవర్తుల కాలం రాజకీయ, ఆర్ధిక, సంస్కృతులపరంగా స్వర్ణయుగంగా చరిత్రకారుల మన్ననలు పొందింది. అలాంటి మొగల్ చక్రవర్తులను ధైర్యంగా ఎదుర్కొని వారిని ఓడించి, వారి పతనానికి ముఖ్య కారకులయ్యారు. మహారాష్ట్రులు. మహారాష్ట్రులే తమతో సమానంగా యుద్ధం చేయగల బలవంతులు, సమర్థులని, వారిని పరాజితులను చేస్తే మిగిలిన వారిని గెలవడం కష్టం కాదని ఆంగ్లేయుల గట్టి నమ్మకం అందువల్ల మహారాష్ట్రులను ఓడించడమే ధ్యేయంగా ఆంగ్లేయులు కృతనిశ్చయులై వారితో యుద్ధానికి తలపడ్డారు. ఇలా మరాఠాలు - ఆంగ్లేయుల మధ్య 3 యుద్ధాలు జరిగాయి. వీటినే ఆంగ్ల - మరాఠా యుద్ధాలు అంటారు.

పీష్వా మహారాష్ట్రులకు భారతదేశ చరిత్రలో సమున్నత స్థానం కల్పించిన మహారాష్ట్ర జాతిపిత 'శివాజీ' మంత్రివర్గంలో అత్యంత ముఖ్యమైన పదవి పీష్వా. పీష్వా రాజుకు కుడిభుజంలాంటి వాడు. శివాజీ మనవడైన 'షాహు' పరిపాలన కాలంలో (1707-1749) పీష్వా పదవికి ప్రాముఖ్యం పెరిగింది. ఛత్రపతి లేదా చక్రవర్తి అధికారం కేవలం నామమాత్రమైంది. వాస్తవ పరిపాలనా బాధ్యతలను పీష్వాలు చేపట్టారు. వాస్తవ పరిపాలనా బాధ్యతలు చేపట్టిన మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. ఇతడి పరిపాలనా కాలం (1713-20) నుంచి పీష్వా పదవి శక్తివంతం, అనువంశికం అయింది.

బాలాజీ విశ్వనాథ్ తర్వాత పీష్వా అయిన బాజీరావు-1 కాలంలో మరాఠా సర్దార్ల కూటమి ఏర్పడింది. వీరంతా చక్రవర్తి విధేయులుగా పనిచేస్తూ మహారాష్ట్ర సమైక్యత కోసం కృషి చేసేవారు. బాజీరావు-1 తర్వాత బాలాజీ బాజీరావు, మాధవరావు మొదలైన వారు పీష్వాలుగా పనిచేశారు. 1772లో పీష్వా మాధవరావు మరణం తర్వాత ఆయన తమ్ముడు నారాయణరావు పీష్వా అయ్యాడు. అయితే ఆయన పినతండ్రి రఘునాథరావు నారాయణరావును హత్య గావించి పీష్వాగా ప్రకటించుకున్నాడు. ఈ చర్య గిట్టని నానాపడ్నావీస్ అనే ప్రముఖ మరాఠా సర్దార్ నారాయణరావు కుమారుడైన మాధవరావు-2 ని పీష్వాగా చేసి రఘునాథరావును పదవీచ్యుతుడిని చేశాడు. పదవీచ్యుతుడైన రఘునాథరావు చాలా అవమానకరంగా భావించి, ఆంగ్లేయుల సహాయం అర్థించాడు. ఇటువంటి సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆంగ్లేయులు వెంటనే రఘునాథరావుతో సూరత్ సంధి చేసుకున్నారు. 

సూరత్ సంధి (1775): 

1775 లో సూరత్ సంధి బొంబాయి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ గోడార్డ్, మరాఠాలకు చెందిన రఘునాథరావు మధ్య జరిగింది. ఇందులో భాగంగా ఆంగ్లేయులు రఘునాథరావును పీష్వాగా నియమించాలి. దీనికి ప్రతిగా రఘునాథరావు సాల్ సెట్టి, బెస్సిన్ ప్రాంతాలను ఆంగ్లేయులకివ్వాలి. పీష్వాగా చేయడానికి అయిన సైనికఖర్చులు రఘునాథరావు భరించాలి. 

పురంధర్ సంధి (1776): 

1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బొంబాయి గవర్నర్ స్వదేశీ రాజులతో, బెంగాల్ ప్రభుత్వం అనుమతి లేకుండా యుద్ధం చేయడం, సంధి చేసుకోవడం వీలుకాదని బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ స్పష్టం చేశాడు. సూరత్ సంధికి ప్రతిగా ఆంగ్లేయులతో (వారన్ హేస్టింగ్) నానాపడ్నావీస్ రఘునాథరావుకు వ్యతిరేకంగా పురంధర్ సంధి చేసుకున్నారు. దీని ప్రకారం రఘునాథరావుకు ఆంగ్లేయులు సహాయం చేయడం నిలిపివేయాలి. మాధవరావు-2 ను పీష్వాగా గౌరవించాలి. సాల్ సెట్టి ద్వీపాన్ని ఆంగ్లేయులకివ్వాలి. అయితే ఇంగ్లండ్ లోని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పురంధర్ సంధిని ఖండించారు. దీనికి కారణం పీష్వా మాధవరావు-2 కు ఫ్రెంచివారికి సంబంధం ఉందనే అనుమానం. ఫ్రెంచి వారు భారతీయ రాజులతో సంబంధాలు పెట్టుకోవడం ఆంగ్లేయులకిష్టం లేదు.

మొదటి ఆంగ్ల-మరాఠా యుద్ధం (1775-1782) 

పీష్వా పదవికోసం మహారాష్ట్రుల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు. నానాపడ్నావీస్ నాయకత్వంలో మరాఠా కూటమి మాధవరావు-2 ను బలపరచగా బొంబాయి కంపెనీవారు రఘునాథరావును సమర్పించడం. రెండు వర్గాల్లో ఒక వర్గాన్ని సమర్ధిస్తూ అవకాశాల్ని తమ స్వప్రయోజనాలకోసం అనుగుణంగా మలచుకోవాలనే బ్రిటిష్ వైఖరి.

వారన్ హేస్టింగ్స్ సలహాలను తిరస్కరించి మరాఠాలపై బొంబాయి గవర్నర్ గోడార్డ్ యుద్ధం ప్రకటించగా, నానాపడ్నావీస్ నాయకత్వంలోని మరాఠా కూటమి ఆంగ్లేయులను ఓడించింది. దీనితో మరాఠా కూటమి, ఆంగ్లేయుల మధ్య వాడగాన్ సంధి జరిగింది. 

వాడగాన్ సంధి (1779) ముఖ్యాంశాలు: 

మాధవరావు-2 ను పీష్వాగా అంగీకరించాలి. రఘునాథరావును పీష్వాకు స్వాధీనం చేయాలి. నానా పెడ్నావీస్ నాయకత్వంలో హైదర్ఆ లీ (మైసూర్), నైజాం, మరాఠాలు ఒక మిత్రకూటమిగా ఏర్పడి, ఆంగ్లేయులపై దాడి చేయాలని నిర్ణయించగా భారతీయుల బలహీనతలు అంచనా వేసి, మిత్రకూటమిని వారన్ హేస్టింగ్స్ విడదీశాడు. 

సాల్బే సంధి (1782) 

వారన్ హేస్టింగ్, మహారాష్ట్రులను ఓడించడంతో మహారాష్ట్రులు 1782లో ఆంగ్లేయులతో సాల్బే సంధి చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆంగ్లేయుల మాధవరావు-2 ను పీష్వాగా గుర్తించాలి. రఘునాథరావుకు ప్రతి సంవత్సరం 3 లక్షల పెన్షన్ ఇవ్వాలి. సాల్ సెట్టి ద్వీపం బ్రిటిష్ వారికి ఇవ్వాలి. సాల్బే సంధి మహారాష్ట్రులకు, ఆంగ్లేయులకు మధ్య రమారమి 20 సంవత్సరాలు సత్సంబంధాలు కల్పించడంతో, ఆంగ్లేయులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పాలనను స్థిర పరచుకుంటూ సైనికంగా పటిష్ఠం చేసుకున్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మహారాష్ట్రుల ఐక్యత నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేసిన నానా పడ్నావీస్ క్రీ.శ. 1800 లో మరణించాడు. దీంతో మహారాష్ట్రుల మధ్య విభేదాలు, కలహాలు మొదలు కాగా ఆంగ్లేయులు జోక్యం చేసుకొనేందుకు అవకాశం కలిగింది. నానా పడ్నావీస్ మరణించే నాటికి పీష్వా బాజీరావు-2 బలహీనుడు కావడంతో, మహారాష్ట్ర సర్దార్ల కూటమిలోని సింథియా, హోల్కర్లు బాజీరావు-2 అధికారాన్ని దిక్కరించసాగారు. దీంతో బాజీరావు-2 సింథియాతో చేతులు కలిపి జస్వంత్ రావ్ హోల్కర్ తమ్ముడిని హత్య చేయించాడు. దీంతో జస్వంత్ రావు హోల్కర్ పీష్వా, సింథియాలను ఓడించగా, పీష్వా బేసిన్ పారిపోయి ఆంగ్లేయుల సహాయం కోరి ఆంగ్లేయులతో బేసిన్ సంధి చేసుకున్నాడు. 

బేసిన్ సంధి (1802 )

ఈ సంధి ప్రకారం బాజీరావు-2 సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని సంవత్సరానికి 26 లక్షల రూపాయలు లేదా అంతటి ఆదాయాన్నిచ్చే ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వాలి. బాజీరావు-2 ను పీష్వాగా చేసేందుకు బ్రిటిషర్లు అంగీకరించారు.

రెండో ఆంగ్ల-మరాఠా యుద్ధం (1803-1805) 

బేసిన్ ఒప్పందమే 2వ ఆంగ్ల - మరాఠా యుద్దానికి కారణం. ఆంగ్లేయులతో పీష్వా కుదుర్చుకున్న బేసిన్ సంధికి వ్యతిరేకంగా మమారాష్ట్ర సర్దార్ల కూటమిలోని సింథియా, బోంస్లేలు తమ విభేదాలను విస్మరించి, ఏకమై అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీపై యుద్ధం ప్రకటించారు. సింథియా, బోంస్లేలు ఆంగ్లేయులతో యుద్ధానికి తలపడితే, గైక్వాడ్స్ ఆంగ్లేయులకు సహాయం చేయగా, హోల్కర్, తటస్థంగా వ్యవహరించాడు. ఫలితంగా సింథియా, బోంస్లేలు యుద్ధంలో ఓడిపోయి విడివిడిగా ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకొన్నారు. 

దేవ్ గన్ సంధి (1803): 

రాఘాజీ బోంస్లే, ఆంగ్లేయులతో సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నాడు. మరాఠా సర్దార్ల కూటమి నుంచి తప్పుకోవాలి. బాలాసోర్, కటక్, వార్ధా ప్రాంతాలను ఆంగ్లేయులపరం చేశారు. 

సుర్జి అర్జన్ గాన్ సంధి (1803)

దౌలతరావ్ సింథియా ఆంగ్లేయులతో సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొన్నాడు. అహ్మద్ నగర్, బ్రోచ్ ప్రాంతాలను ఆంగ్లేయులకివ్వాలి. ఆంగ్లేయులతో చెప్పకుండా ఇతర దేశీయులతో సంబంధాలు ఏర్పర్చుకోకూడదు. ఆంగ్లేయుల నుంచి తమకు సంభవించబోయే ప్రమాదాన్ని గుర్తించి హోల్కర్ ఆంగ్లేయులపై యుద్ధానికి దిగాడు (1804). అయితే యుద్ధంలో ఎవరూ సంపూర్ణ విజయం సాధించకముందే యూరప్ లో జరుగుతున్న పరిణామాలవల్ల యుద్ధం నిలుపుదల చేశారు. యశ్వంత్ రావ్ హోల్కర్, ఆంగ్లేయుల మధ్య 1805లో జరిగిన రాజ్ ఘాట్ సంధితో రెండో ఆంగ్ల-మరాఠా యుద్ధం ముగిసింది.

మూడో ఆంగ్ల-మరాఠా యుద్ధం (1817-1818) 

బేసిన్ సంధి ద్వారా సైన్య సహకార పద్ధతిని అంగీకరించి, తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను బ్రిటిషర్ల పాదాక్రాంతం చేసిన బాజీరావు-2, బ్రిటిష్ అధికారం నుంచి విముక్తి పొందడానికి మిగిలిన మహారాష్ట్ర నాయకులతో రహస్య మంతనాలు జరపడం. తమ సామ్రాజ్య వ్యాప్తికి, అధికారానికి అడ్డంగా వచ్చిన వారిని పూర్తిగా తొలగించివేయాలనే నిర్ణయం. పిండారీలను అణిచివేసే కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలో ఆంగ్లేయ సైన్యం తిష్టవేయడం. పిండారీలు అంటే దారి దోపిడీ చేసేవాళ్లు. వీరు ఒకప్పుడు సైనికులుగా ఉంటూ, స్వదేశీ రాజ్యాలు ఆంగ్లేయులు ఆక్రమించగా ఉద్యోగాలు కోల్పోయి, బాటసారులను అతిక్రూరంగా హింసించి ఆస్తిని, ధనాన్ని దోచుకునేవారు. వీరు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండగా వీరిని అణచివేయాలిన, ఆంగ్లసైన్యం మహారాష్ట్రలో చేరింది. ఇలా మహారాష్ట్రులతో యుద్ధం చేయకుండానే పిండారీలను అణచివేసే నెపంతో మహారాష్ట్రలో ప్రవేశం పొంది, బ్రిటిషర్లు మహారాష్ట్రుల సైనిక రహస్యాలు, బలాలు, బలహీనతలు తెలుసుకున్నారు. ఆంగ్లేయులు పిండారీలను 1817-1818 మధ్య అణచివేశారు. 

పూనా సంధిని : 

బేసిన్ సంధిని పీష్వా అతిక్రమించాడని పీష్వాపై నేరారోపణ చేసి, ఆంగ్లేయులు 1817లో బాజీరావు-2 తో పూనాసంధి చేసుకున్నారు. ఈ సంధి ప్రకారం పీష్వా మిగిలిన మహారాష్ట్ర కూటమిలో చేరకూడదు. కూటమి ఏర్పాటు చేయరాదు. అహ్మద్ నగర్ ను శాశ్వతంగా ఆంగ్లేయులకివ్వాలి. పీష్వా బాజీరావు-2 తిరుగుబాటు చేసి 'కిర్కీ'లోని బ్రిటిష్ స్థావరంపై దాడి చేయడమే కాకుండా, పూనాలోని బ్రిటిష్ స్థావర కార్యాలయాన్ని తగలబెట్టాడు. పీష్వా బాజీరావు-2 ను ఆంగ్ల సేనాని మాల్కమ్ బంధించడంతో మూడో ఆంగ్ల-మరాఠా యుద్ధం ముగిసింది. 

ఈ యుద్ధం కారణంగా గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ పీష్వా పదవిని 1818లో రద్దు చేశారు. మరాఠాల అభిమానాన్ని సంతృప్తి పరిచేందుకు మహారాష్ట్ర సామ్రాజ్యానికి గుర్తుగా 'సతారా' రాజధానిగా చిన్న మహారాష్ట్ర రాజ్యాన్ని నిర్మించి, దాని పరిపాలకుడిగా శివాజీ కుటుంబానికి చెందిన ప్రతాప్ సింగ్ ను నియమించారు. పీష్వా అధీనంలోని ప్రాంతాలన్నింటిని బొంబాయి ప్రెసిడెన్సీలో కలిపివేశారు ఈ విధంగా వారెన్ హేస్టింగ్స్ కాలంలో మొదలైన మహారాష్ట్రుల అణచివేతను లార్డ్ హేస్టింగ్స్ పూర్తిచేశారు.