1857 సిపాయిల తిరుగుబాటు వైఫల్యానికి కారణాలు 

  • తిరుగుబాటుకు ప్రధాన నాయకుడు లేకపోవడం, వివిధ ప్రాంతాల మధ్య నాయకులకు సమన్వయం లేకపోవడంతో తిరుగుబాటు విఫలమైందని చెప్పవచ్చు. 
  • తిరుగుబాటు ఒకేసారి అన్ని ప్రదేశాల్లో జరగలేదు. ఒకే పథకం లేకపోవడం కూడా వైఫల్యానికి ఒక కారణం. 
  • తిరుగుబాటు ఉత్తర, మధ్య భారతదేశం దాటిపోలేదు. ఇలా భారతదేశమంతటా జరగకపోవడం వల్ల తిరుగుబాటును అణచివేయడం బ్రిటిషర్లకు సులభమైంది. 
  • అన్ని వర్గాలూ పాల్గొనలేదు. స్వదేశీ సంస్థానాధీశుల్లో అందరూ పాల్గొనలేదు. గ్వాలియర్, నైజాం మొదలైన రాజులు బ్రిటిషర్లకు అండగా నిలిచారు. 
  • ఆధునిక విద్యావంతులు తిరుగుబాటును సమర్ధించలేదు. వీరు బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం, ఆధునిక రాజకీయ విద్యా విధానాల ద్వారా ఆధునికీకరించి, అభివృద్ధి చేస్తుందని ఆశించారు. 
  • వర్తకులు, వడ్డీ వ్యాపారులు బ్రిటిష్ వారికి మద్దతు పలికారు. బ్రిటిష్ రెవెన్యూ విధానాల ద్వారా లాభపడటం, తిరుగుబాటుదార్ల దాడితో నష్టపోవడంతో వాళ్లు తిరుగుబాటుదార్లకు సహకరించలేదు. 
  • సిపాయిల్లో అందరూ పాల్గొనలేదు. సిక్కులు, గూర్బాలు, బ్రిటిషర్లకు మద్దతు పలికారు. 
  • ఆయుధ సంపత్తి, సమర్ధులు - అనుభవజ్ఞులైన సైనికాధికారులు, పటిష్ఠమైన సమాచార వ్యవస్థ బ్రిటిషర్ల విజయానికి తోడ్పడ్డాయి. ఇవి భారతీయులకు లేవు.
  • తిరుగుబాటుదార్లే బ్రిటిషర్లకు రహస్య సమాచారం అందించడం: బహదూర్‌షా- II భార్య జీనత్ మహల్ తిరుగుబాటుదార్లపై నమ్మకం లేక, బ్రిటిషర్ల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు, బ్రిటిషర్లకు తిరుగుబాటుదార్ల సమారావాన్ని అందించింది. 
  • దూరదృష్టి, ఆధునిక దృక్పథాల లోపం తిరుగుబాటు దార్లలో భవిష్యత్ భారత్ పట్ల నిర్దిష్ట అభిప్రాయాలు, ప్రణాళికలు మొదలైనవి లేవు. కేవలం తమకు జరిగిన నష్టాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకమయ్యారు. తిరుగుబాటు విఫలమైనా తర్వాత జరిగిన భారత స్వాతంత్ర్య సంగ్రామానికి ఇది బీజాలు వేసింది.

1857 సిపాయిల తిరుగుబాటుకు ఫలితాలు

  • బ్రిటిషర్లకు తమ పాలన, కార్యక్రమాలపట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే విషయం అర్థమైంది. సామ్రాజ్య విస్తరణ కంటే అంగీకారం పొందే అధికారం ముఖ్యమని గుర్తించారు. 
  • బ్రిటిషర్లు తమ మనుగడకు, పాలన సుస్థిరతకు విధేయవర్గం ఆవశ్యకతను గుర్తించారు. దీనికోసం కంపెనీపాలన, బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు, సైనిక వ్యవస్థ మొదలైన ఎన్నో విషయాల్లో మార్పులు తెచ్చారు. 
  • 1858 భారత ప్రభుత్వ చట్టం, 1858లో బ్రిటిష్ పార్లమెంటు 'యాక్ట్ ఫర్ బెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' అనే చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయింది. భారతదేశ పరిపాలనను బ్రిటిష్ ప్రభుత్వమే ప్రత్యక్షంగా చేపట్టింది.
  • భారతదేశ పరిపాలనా వ్యవహారాలకోసం 'భారత రాజ్య కార్యదర్శి లేదా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా'ను నియమించారు.
  • ఇతని సహాయార్ధం 15 మంది సభ్యులున్న కౌన్సిల్ ఉంటుంది. ఈయన బ్రిటన్ మంత్రి వర్గంలో సభ్యుడు. ఇతనికి క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ఈ విధంగా నియమితుడైన మొదటి భారత రాజ్యకార్యదర్శి చార్లెస్ ఉడ్స్. 
  • గవర్నర్ జనరల్ పదవిని 'గవర్నర్ జనరల్ అండ్ వైశ్రాయ్'గా మార్చారు. బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు గవర్నర్ జనరల్ హోదాలో, స్వదేశీ సంస్థానాల పై బ్రిటిష్ సార్వభౌముడి ప్రతినిధిగా వైశ్రాయ్ హోదాలో వ్యవహరిస్తాడు. మొదటి వైశ్రాయ్ గా లార్డ్ కానింగ్ నియమితుడైనాడు. 

బ్రిటిష్ ప్రభుత్వ విధానాల్లో మార్పు 

  • లార్డ్ కానింగ్ 1858 నవంబర్ ఒకటో తేదీన అలహాబాద్ లో దర్బార్ ఏర్పాటు చేశాడు. అందులో స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపబోమని, వారితో మైత్రీభావం కొనసాగిస్తామని చెప్పారు. 
  • రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. దీనివల్ల సంస్థాన పాలకులకు దత్తత స్వీకరించే హక్కు కలిగింది. 
  • సువిశాల దేశాన్ని పాలించడానికి ప్రజల మద్దతు అవసరమని గుర్తించి, అణచివేత ధోరణికి స్వస్తి చెప్పి, ప్రజాభిప్రాయానికి విలువనివ్వడం ప్రారంభించారు. 
  • మతవిషయాల్లో జోక్యం చేసుకోబోమని చెప్పారు. ఏ జాతికి, మతానికి చెందినవారైనా విద్య, ప్రతిభ, నిజాయితీ, సమర్ధతలే ప్రభుత్వోద్యోగాలకు అర్హత అని తెలిపారు. 
  • రాజకీయ వ్యవస్థలో దేశప్రజలకు భాగస్వామ్యం కల్పించేందుకు 1861 కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశ పెట్టారు.
  • సైనిక వ్యవస్థలో మార్పులు 1857 తిరుగుబాటుకు సిపాయిలు ప్రధాన కారణమని గుర్తించిన బ్రిటిష్ వారు సైనిక వ్యవస్థలో గణనీయ మార్పులు తెచ్చారు. 
  • బెంగాల్ లో సిపాయిలు సైనికుల నిష్పత్తి 2:1 గా బొంబాయి, మద్రాస్ లో 3:1 గా నిర్ణయించారు. అంతకుముందు ఇది 6:1 గా ఉండేది. 
  • తిరుగుబాటు సమయంలో తమకు సహకరించిన గూర్బాలు, సిక్కులు, రాజపుత్రులను ఎక్కువ సంఖ్యలో చేర్చుకున్నారు. శతఘ్నిదళాన్ని పూర్తిగా ఆంగ్లేయుల అధీనంలోకి తీసుకున్నారు.
  • విభజించు, పాలించు విధానం హిందు-ముస్లిం సఖ్యతను తమ మనుగడకు ఆందోళనగా భావించి, విభజించు పాలించు విధానాన్ని అవలంభించారు. 
  • 1857 తిరుగుబాటుకు ముస్లింలు ప్రధాన కారణమని మొదట ముస్లిం వ్యతిరేక విధానాలు, 1875 తరువాత ముస్లింలను దగ్గరికి చేరుస్తూ, హిందువులను దూరంగా ఉంచారు. ఇలా హిందు-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించారు. 
  • 1857 తిరుగుబాటు ఒక శకాన్ని ముగించి, మరో వినూత్న శకారంభానికి పునాది వేసింది. సామ్రాజ్య విస్తరణ శకం స్థానంలో ఆర్థిక దోపిడీ శకం ప్రారంభమైంది.