ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖ చారిత్రక సంఘటనల్లో విప్లవాత్మకమైంది, విశిష్టమైంది 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటును భారత జాతీయోద్యమానికి నాందిగా చెప్పవచ్చును. ఈ తిరుగుబాటు అనంతరం భరతజాతి మొత్తం ఏక తాటిపై నిలిచి బ్రిటిష్ పాలనలో హింసాకాండ, దోపిడీలకు వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమాలు చేయడం జరిగింది. భారత జాతీయవాదులూ, ప్రముఖ చరిత్రకారులు 1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించారు.

రాజకీయ కారణాలు: 

భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఆంగ్లేయులు అనేక పద్ధతులను అవలంభించారు. యుద్ధాలు, సైనిక సహాయ ఒప్పందాలు, అరాచకం ప్రబలిందనే నెపంతో రాజ్య విస్తరణ చేశారు. మహా రాష్ట్రులు, మైసూరు పాలకులు, సిక్కులను ఓడించి వారి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అమలుచేయడం ద్వారా డల్హౌసీ సతారా, నాగ్ పూర్, ఝాన్సీ లాంటి రాజ్యాల్ని బ్రిటీష్ పాలన కిందికి తెచ్చాడు. అయోధ్యను కంపెనీ పరిధిలోని రాజ్యంలో అంతర్భాగం చేశాడు. పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్ కు భరణాన్ని నిరాకరించాడు. రెండో బహదూర్‌షా అనంతరం మొఘల్ పీఠం రద్దవుతుందని లార్డ్ కానింగ్ ప్రకటించాడు. అయోధ్య విలీనం మహ్మదీయుల అసంతృప్తికి ప్రత్యేక కారణమైంది. అసంతృప్తికి లోనైన స్వదేశీ రాజులు 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు. 

ఆర్థిక కారణాలు: 

బ్రిటిష్ వారు బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల భారతదేశం ఆర్ధికంగా దిగజారిపోవడం ప్రారంభమైంది. శాశ్వత భూమిశిస్తు విధానం, పెద్దమొత్తంలో చెల్లించాల్సిన పన్నులు, రుణభారం, శాసన వ్యవస్థ, వ్యవసాయంపై పెరిగిన అధిక ఒత్తిడి ఇవన్నీ రైతుల పరిస్థితిని దిగజార్చాయి. ఫలితంగా బ్రిటిషర్లపై ప్రజల్లో ద్వేషం పెరిగింది. యంత్రాల పై తయారైన వస్త్రాలు ఇంగ్లండ్ నుంచి దిగుమతి కావడం స్వదేశీ చేనేత కార్మికులను కోలుకోలేనంత దెబ్బతీసింది. బ్రిటిష్ వారి పాలనలో భారతదేశం పారిశ్రామిక విప్లవానికే కాకుండా వాణిజ్యపరమైన దోపిడికి కూడా గురైంది. అవుద్ ఆక్రమణతో అనేక వేల కుటుంబాలు తమ ఉపాధి కోల్పోయాయి. స్వదేశీ రాజ్యాలు, రాజులు అంతరించడంతో ఉద్యోగులు, గాయకులు, కవులు, విద్వాంసులు నిరుద్యోగులై బ్రిటిష్ వారిపై ద్వేషభావంతో తిరుగుబాటులో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. 

సాంఘిక కారణాలు: 

ఈస్టిండియా కంపెనీ లార్డ్ బెంటింక్ కాలం నుంచి లార్డ్ డలౌసీ కాలం వరకు అనేక సాంఘిక సంస్కరణలను ప్రవేశపెట్టింది. బెంటింక్ కాలం నాటి సతీ సహగమన నిషేద చట్టం, మతం మార్చుకున్నా ఆస్తిలో హక్కు కల్పించే చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, వితంతు పునర్వివాహ చట్టం లాంటి సంస్కరణలు సనాతన ధర్మానికి విరుద్ధమని ప్రజలు భావించారు. దలౌసీ కాలం నాటి ఆధునికీకరణ, రైల్వే, తంతి, తపాల ఏర్పాట్లు ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి. ఈ మార్పుల వల్ల తమ ఆచారబద్ధమైన ప్రాచీన సమాజం కూలిపోతుందని సనాతన వాదులు ఆందోళన లేవనెత్తారు. 

మతపరమైన కారణాలు: 

బ్రిటిష్ వారు తమను క్రైస్తవ మతంలోకి మార్చడానికి కుట్ర జరుపుతున్నారనే అనుమానం భారతీయుల మనస్సులో నాటుకుంది. క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, చర్చిలు, మత సంస్థల ఏర్పాటు ఈ అనుమానాన్ని మరింత బలపరిచాయి. దేవాలయాలు, మసీదుల ఆస్తులపై పన్ను విధించడంతో ప్రజల మత విశ్వాసాలు మరింత దెబ్బతిన్నాయి. హిందూమత ఆచారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని మత మార్పిడులను ప్రోత్సహించి, భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తుందనే భావం ప్రజల్లో ఏర్పడింది. దీనికి కొందరు కంపెనీ అధికారుల మత పక్షపాత ధోరణి కూడా దోహదం చేసింది. 

సైనిక కారణాలు: 

భారతీయ సిపాయిలను దేశాన్ని ఆక్రమించుకోవడానికి, తమ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి నిచ్చెనగా ఉపయోగించుకుని కూడా చిన్నచూపు చూసేవారు. వీరికి అతి తక్కువ వేతనాలు, చాలీచాలని ఆహారం ఇచ్చే వారు. వీరికి కేటాయించిన గృహాల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండేవికావు. పదోన్నతులు కూడా ఇచ్చేవారు కాదు. ఒక సిపాయి తన జీవిత కాలం సిపాయిగానే సేవలు అందించాల్సి వచ్చేది. విదేశీ సేవా భత్యాలు కూడా లభించకపోవడంతో భారతీయ సైనికులు అనేక ఇబ్బందులు పడ్డారు. కొత్త, సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి రావడం సైన్యంలో మరింత అసంతృప్తిని పెంచింది.

1856లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జనరల్ సర్వీసెస్ ఎ ప్లాస్ట్మెంట్ చట్టం ప్రకారం సిపాయిలు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేయాల్సి వచ్చేది. ఆ కాలంలో హిందూ ధర్మశాస్త్ర ప్రకారం సముద్ర ప్రయాణం నిషేధం. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన అసంతృప్తికి లోనైన సిపాయిలు 1849, 1850, 1852 లలో తమ నిరసనను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. మొదటి ఆప్షన్, సిక్కు యుద్ధాల్లో ఆంగ్లేయుల ఓటమితో వారు అనేయులనే భావం పోయింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించడం కష్టమేమీ కాదని భావించి తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు. 

తక్షణ కారణం: 

ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం 1856 లో కొత్త ఎన్‌ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టింది. వీటిలో ఉపయోగించే తూటాలను సైనికులు నోటితో చివరి భాగం కొరికి తుపాకిలో అమర్చి పేల్చాల్సి ఉండేది. కానీ ఆ తూటాలకు ఆవు, పంది కొవ్వులతో పూత పూసినట్లు ఒక వదంతి వ్యాపించింది. ఆవు హిందువులకు పవిత్రమైంది. పంది ముస్లింలకు అపవిత్రం. ఆంగ్లేయులు తమ మతాలను కించపరచడానికే ఇలా చేశారని సిపాయిలు భావించారు. ఈ నేపథ్యంలో 1857 మార్చి 29న మంగళ్ పాండే అనే సిపాయి బరకపూర్లో కొవ్వు తూటాలను ఉపయోగించడాన్ని నిరాకరించి ఇంగ్లీష్ అధికారిని కాల్చి చంపాడు. అందుకు గాను మంగళ్ పాండేను ఉరితీయడం జరిగింది. ఈ సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. సిపాయిలందరిలో అభద్రతా భావం అలుముకుని తిరుగుబాటుకు నాంది పలికారు. 1857 ఏప్రిల్ 24న మీరట్లో సిపాయిలను నూతన తూటాలను వాడాల్సిందిగా కల్నల్ స్మిత్ జారీ చేసిన ఆజ్ఞలను సిపాయిలు నిరాకరించగా, నిరాకరించిన వారిని ఉద్యోగాల నుంచి తీసివేసి, పదేళ్ల కఠిన కారాగారశిక్ష విధించారు. 1857 మే 10న మీరట్ లోని సిపాయిలు బహిరంగంగా తిరుగుబాటు చేసి తమ అధికారులను కాల్చివేసి ఢిల్లీ దిశగా ముందుకు సాగారు. తిరుగుబాటుదార్లు రెండో బహదూర్‌షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించి, అతనిని తమ నాయకునిగా ఎన్నుకున్నారు. 1857 మే 10న మీరట్లో జనరల్ భక్తఖాన్ నాయకత్వంలో ప్రారంభమైన తిరుగుబాటును మే 11 నాటికి ఢిల్లీకి వ్యాపించింది. మే 11వ తేదీన చేరిన సిపాయిలు జనరల్ భక్తఖాన్ అధ్వర్యంలో ఎర్రకోటలో ప్రవేశించి మొఘల్ పాలకుడైన బహదూరాష-II ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించి తిరుగుబాటుకు నాయకుడిగా చేశారు. 

తిరుగుబాటు గమనం

ఢిల్లీలో తిరుగుబాటుకు బహదూర్షా - II నామమాత్రపు నాయకత్వం వహించగా, భక్తఖాన్ నేతృత్వంలో వాస్తవ తిరుగుబాటు ప్రారంభమైంది. 1857 సెప్టెంబర్ నెలలో సిపాయిలు, బ్రిటిషర్ల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. బ్రిటన్ సైనికాధికారి నికలసన్ మరణించాడు. అయితే చివరికి హడ్సన్ నాయకత్వంలో బ్రిటిషర్లు విజయం సాధించారు. బహదూర్‌షా-II  భార్య జీనత మహల్, వారి కుమారులను కాల్చి చంపారు. బహదూర్‌-II ని రంగూన్ జైలుకు పంపగా, 1862 లో రంగూన్లో మరణించాడు. 

కాన్పూర్‌లో జూన్ నెలలో తిరుగుబాటు ప్రారంభమైంది. నానాసాహెబ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఆయన అసలు పేరు దొండూపంత్. బ్రిటిషర్లు అనుసరించిన దత్తత విధానం వల్ల పీష్వా బిరుదును పోగొట్టుకున్నాడు. జనరల్ హా క్ నాయకత్వంలో బ్రిటిషర్లు తిరుగుబాటును అణచివేయడం ప్రారంభించారు. నానాసాహెబ్ కు తాంతియాతోపే తోడ్పాటు అందించారు. తాంతియాతోపే గొరిల్లా యుద్ధంలో అరితేరినవాడు. ఈయనతో పాటు అజీముల్లాఖాన్ కూడా తోడ్పాటు అందించారు. జనరల్ కాంప్ టెల్ నాయకత్వంలో కాన్పూర్ లో బ్రిటిషర్లు విజయం సాధించారు. నానాసాహెబ్ నేపాల్ పారిపోయాడు. 

అయోధ్య లేదా ఔధ్ తిరుగుబాటుకు తుపాను కేంద్రం అవద్ ను బ్రిటిషర్లు అన్యాయంగా ఆక్రమించడంతో ప్రజలు, సిపాయిలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సిపాయిల్లో ఎక్కువ మంది అయోధ్యకు చెందినవారు. తిరుగుబాటుకు బేగం హజ్రత్ మహల్ నాయకత్వం వహించింది. ఈమె వాజిద్ అలీషా భార్య తన కుమారుడు బిర్జిస్ ఖాదిరను అయోధ్య రాజుగా ప్రకటించింది. మౌల్వీ అహ్మదుల్లా ఆమెకు సహాయం చేశాడు. కాంటల్ నాయకత్వంలో తిరుగుబాటును అణచి వేయగా బేగం హజ్రత్ మహల్ నేపాల్ పారిపోయింది. 

1857 తిరుగుబాటును నడిపిన నాయకుల్లోనే కాకుండా భారత చరిత్రలోని మహోజ్వల వీరనారీమణుల్లో ఝాన్సీ లక్ష్మీభాయి ఒకరు. లక్ష్మీభాయి అసలు పేరు మణికర్ణిక. డలౌసి రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా ఝాన్సీ రాజ్యాన్ని పోగొట్టుకొంది. ఝాన్సీకి, తాంతియాతోపే తిరుగుబాటులో సహాయం చేశాడు. తిరుగుబాటులో భాగంగా గ్వాలియర్‌ను ఝాన్సీ లక్ష్మీ బాయి ఆక్రమించింది. సర్హ్యూ రోజ్ నేతృత్వంలోని సైన్యం ఝాన్సీని ఓడించి, చంపివేసింది. తాంతియాతోపే ఆ మధ్య భారతదేశ అడవుల్లోకి వెళ్లి గెరిల్లా యుద్ధం ద్వారా బ్రిటిషర్లను ప్రతిఘటించాడు. అయితే మాన్ సింగ్ అనే వ్యక్తి తాంతియాతో పేని బ్రిటిషర్లకు పట్టించగా, వారు తాంతియాతో పేని ఉరితీశారు. ఝాన్సీలక్ష్మీభాయి తన అసమాన వీరోచిత కృత్యాల ద్వారా చరిత్రలో తనకంటూ ఒక శాశ్వత స్థానాన్ని నిలుపుకొంది. స హ్యూరోజ్ ఈమెని 'భారతదేశ జోన్ ఆఫ్ ఆర్క్'గా 'స్త్రీ తిరుగుబాటుదారుల్లో ఏకైక పురుషుడు'గా పొగిడారు.

ముఖ్యాంశాలు 

 • రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆక్రమించబడిన స్వదేశీ సంస్థానాలు/రాజ్యాలు- సతారా - 1848 , జై పూర్, సంబల్‌పూర్-1849, భగత్ - 1850 , ఉదయ్ పూర్-1852, ఝాన్సీ - 1853, నాగపూర్ - 1854, 
 • ఉద్యోగాల నుండి తొలగించబడిన సిపాయిలు, సన్యాసులు, ఫకీర్లు వార్తా హరులుగా వ్యవహరించారు. ప్రభుత్వ నిఘా నుండి తప్పించుకోవడానికి “ఎర్ర కలువలు(సైన్యానికి), చపాతీలు (పౌర జన బహుళ్యానికి) తిరుగుబాటుకు రహస్య సంకేతాలుగా ఎంచుకొన్నారు. 
 • తిరుగుబాటు మే 31వ తేదీన ఏక కాలంలో జరపడానికి నిర్ణయించగా ముందుగానే మే 10వ తేదీన ప్రారంభమైనది. మే 10వ తేదీన మీరట్ నుండి సిపాయిలు బయల్దేరి ఢిల్లీ పట్టణాన్ని ఆక్రమించి, రెండవ బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటించి, తిరుగుబాటుకు నాయకుడిగా ఎన్నుకున్నారు. 
 • తిరుగుబాటు వివిధ తేదీలలో వివిధ ప్రదేశాల్లో జరిగింది: మే 14వ తేదీన - ముజఫర్ నగర్,  మే 18వ తేదీన - ఫిరోజ్ పూర్, మే 20వ తేదీన - అలీఘర్, మే 23వ తేదీన - ఇబావాయయిన్ పూర్, మే 30వ తేదీన - హోడల్, లక్నో మధుర, జూన్ 3వ తేదీన - బరేల్లీ, షాజహాన్‌పూర్ 
 • 1857 సెప్టెంబర్ 20వ తేదీన ఢిల్లీ పూర్తిగా బ్రిటీష్ వారికి వశమైంది. ఈ విజయానికి ముఖ్య కారకుడు “నికల్సన్”. 
 • బహదూర్‌షాను యుద్ధ ఖైదీగా బర్మాకు పంపించారు. 
 • నానాసాహెబ్, తాంతియాతో పేలు కలిసి దాడి చేయగా వారిని “కొలిన్ కాంప్బెల్” నాయకత్వంలో బ్రిటీష్ సేనలు ఎదుర్కొన్నాయి. 
 • కాన్పూర్ లో “నానాసాహెబ్” ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగింది. కాన్పూర్ వద్ద "సాండు” నదీ తీరాన నానాసాహెబ్ కు బ్రిటీష్ వారికి యుద్ధం జరిగింది. ఓటమి పాలైన నానాసాహెబ్ చిత్తోడ్ కు పారిపోయాడు. 
 • నానాసాహెబ్ పారిపోయిన తరువాత అతని సేనాని "తాంతియాతో పే” తిరుగుబాటు దారులకు నాయకత్వం వహించి గెరిల్లా యుద్ధం చేశాడు. 
 • ఆగస్టు 16వ తేదీన జరిగిన యుద్ధంలో హవ్ లాక్ చేతిలో తాంతియాతోపే ఓటమి చవిచూశాడు. 
 • లక్నో నుంచి తిరుగుబాటుదారులకు బేగం హజ్రత్ మహల్ నాయకత్వం వహించింది. 
 • బుందేల్ ఖండ్ లో ఝాన్సీ లక్ష్మీబాయి, బంద్రానవాబు, తాంతియాతో పే, రావూసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు విజృంభించారు. 
 • ఝాన్సీకోట లోపల సిపాయిలు తిరుగుబాటు చేసి అక్కడ బ్రిటీష్ వారిని విచక్షణా రహితంగా చంపారు. దీనిని "డిబైన్ బాగ్” హత్యాకాండ అంటారు. 
 • గ్వాలియర్ సర్దారులలో ఒకడైన మాన్ సింగ్ విద్రోహం వలన తాంతియాతో పేను బ్రిటీష్ వారు బంధించి 1859, ఏప్రిల్ 19న ఉరి తీసారు. 
 • గ్వాలియర్ యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీ బాయి పురుష దుస్తులు ధరించి, తన పరిచారికలు మందర, కపిలతో కలిసి పాల్గొన్నది